
పౌర విమాన కార్యకలాపాలు భద్రంగా సాగేలా అన్ని దేశాలు బాధ్యత వహించాలని అంతర్జాతీయ విమానయాన సంస్థల సంఘం ఐఏటీఏ తెలిపింది. రాజకీయ సంఘర్షణల్లో సంస్థ ఎవరి వైపూ మొగ్గదని ఐఏటీఏ డైరెక్టర్ జనరల్ విల్లీ వాల్ష్ స్పష్టం చేశారు. వివిధ దేశాల్లో యుద్ధ వాతావరణం పెరుగుతున్న నేపథ్యంలో పౌర విమానాల నేవిగేషన్ వ్యవస్థను ఏ దేశం లక్ష్యంగా చేసుకోకూడదని పేర్కొన్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల వాల్ష్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా వాల్ష్ మాట్లాడుతూ..‘విమానాశ్రయాలు, విమాన నేవిగేషన్ మౌలిక వసతులను ఏ దేశం కూడా లక్ష్యంగా పెట్టుకోరాదు. పౌర విమాన కార్యకలాపాలు భద్రంగా కొనసాగేలా చూడాలి. రాజకీయ సంఘర్షణల్లో పౌర విమానయానం ఎవరి పక్షమూ వహించదు. అంతర్జాతీయంగా వివిధ దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకుంటోంది. అందులో పాల్గొంటున్న ఎవరివైపూ సంస్థ మొగ్గు చూపదు. పౌర విమానయానం భద్రంగా సాగేలా అన్ని దేశాలు సహకరించాలి. యుద్ధాలకు సిద్ధపడే దేశాలు పౌర విమానాల నేవిగేషన్ వసతులను లక్ష్యంగా చేసుకోకూడదు. ప్రతి పరిశ్రమకు అంతర్జాతీయ ప్రమాణాల్లో పనిచేయడం ముఖ్యం. మేం పౌరులకు సేవలందిస్తున్నాం. కాబట్టి దేశాలకు అతీతంగా ఈ యుద్ధ సంఘర్షణలకు మమ్మల్ని దూరంగా ఉంచండి. అంతర్జాతీయ చట్టంలోని నిబంధనలు అందరూ పాటించాలి’ అని చెప్పారు.
ఇదీ చదవండి: పెరిగిన ఇంటి భోజనం ఖర్చు..ఎంతంటే..
భారత విమానయాన సంస్థలతో పాటు, అంతర్జాతీయంగా మొత్తం 330 కంపెనీలకు ఐఏటీఏ ప్రాతినిధ్యం వహిస్తోంది. అంతర్జాతీయ విమాన రద్దీలో 80 శాతానికి పైగా వాటా కలిగిన సంస్థలు ఈ సంఘంలో భాగంగా ఉన్నాయి.