కర్ణాటక ప్రభుత్వం గిగ్ వర్కర్ల(షార్ట్‌టర్మ్, ఫ్లెక్సిబుల్ సమయాల్లో పని చేసేవారు) సంక్షేమం కోసం చర్యలు తీసుకోనుంది. వీరి భద్రత కోసం స్విగ్గీ, జొమాటో, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఉబెర్ వంటి ఆన్‌లైన్ అగ్రిగేటర్ ప్లాట్‌ఫామ్‌లపై కర్ణాటక ప్రభుత్వం 1-2 శాతం పన్ను విధించాలని యోచిస్తోంది. ఈమేరకు సబ్‌కమిటీని ఏర్పాటు చేసి ఈ అంశంపై మరింత చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నట్లు అధికారులు తెలిపారు.
ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్స్ (సామాజిక భద్రత, సంక్షేమం) బిల్లు, 2024కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించింది. అందుకోసం ప్రత్యేక సబ్‌కమిటీ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీనిపై వచ్చే వారం చర్చ జరగనుందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారులు తెలిపారు. ముసాయిదా బిల్లు ప్రకారం..రాష్ట్ర ప్రభుత్వం ‘ది కర్ణాటక గిగ్ వర్కర్స్ సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ ఫండ్’ పేరుతో ఒక నిధిని ఏర్పాటు చేస్తుంది. దీని కోసం ఆన్‌లైన్ అగ్రిగేటర్ల నుంచి ‘ప్లాట్‌ఫారమ్ ఆధారిత గిగ్ వర్కర్స్ వెల్ఫేర్ ఫీజు’ వసూలు చేయాలని భావిస్తుంది. ఈ ఫీజును ప్రతి త్రైమాసికం చివరిలో రాష్ట్ర ప్రభుత్వానికి చేరేలా ముసాయిదా బిల్లులో ప్రతిపాదనలు చేర్చినట్లు అధికారులు చెప్పారు.
ఈ విషయం తెలిసిన టెక్ స్టార్టప్ కంపెనీలు, ఇప్పటికే ఈ విభాగంలో సేవలందిస్తున్న సంస్థలు ఒక గ్రూప్‌గా చేరి తమ ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ), నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (నాస్కామ్), ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) వంటి వివిధ వాణిజ్య సంస్థల ద్వారా ఈ బృందం రాష్ట్ర ప్రభుత్వానికి తమ వినతులు సమర్పించింది. ఈ బిల్లు వల్ల తమ వ్యాపారానికి నష్టాలు తప్పవని చెబుతున్నాయి. సంస్థల కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం కలుగుతుందని తెలియజేస్తున్నాయి.
ఇదీ చదవండి: సాఫ్ట్‌వేర్ సంస్థల ఎగుమతులు పెంపు
రూ.2 ప్లాట్‌ఫామ్ ఫీజు రూ.6కు పెంపు..
స్విగ్గీ ఏప్రిల్ 2023లో, జొమాటో ఆగస్టు, 2023లో ప్లాట్‌ఫామ్ రుసుమును రూ.2గా ప్రవేశపెట్టారు. అయినా కంపెనీలకు వచ్చే ఆర్డర్లు తగ్గకపోవడంతో కస్టమర్లు ఛార్జీల పెంపును అంగీకరిస్తున్నారని భావించారు. దాంతో క్రమంగా ప్లాట్‌ఫామ్ ఫీజును పెంచుతూ రూ.6 వరకు తీసుకొచ్చారు. జొమాటో రోజూ సుమారు 22-25 లక్షల ఆర్డర్లను డెలివరీ ఇస్తోంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో గతంలో జొమాటో తన ప్లాట్‌ఫారమ్ ఫీజును ఆర్డర్‌కు రూ.9కి పెంచింది. స్విగ్గీ బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, ఇతర నగరాల్లోని నిర్దిష్ట కస్టమర్‌లకు రూ.10 వసూలు కూడా వసూలు చేసిన సంఘటనలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment