ఈ-కామర్స్‌లో తెలుగుతో తెలివిగా టోకరా.. | Cyberabad Police Held 10 Members Gang Who Cheats E Commerce Site In Hyderabad | Sakshi
Sakshi News home page

తెలంగాణ, ఏపీలో రూ.కోట్లు వసూలు 

Published Tue, Mar 2 2021 8:45 AM | Last Updated on Tue, Mar 2 2021 8:54 AM

Cyberabad Police Held 10 Members Gang Who Cheats E Commerce Site In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈ-కామర్స్‌ సైట్లలో వినియోగదారుల వివరాలు సేకరిస్తారు. ప్రైజ్‌మనీ వచ్చిందంటారు. టాటా సఫారీ వాహనం గెలుచుకున్నారని నమ్మబలుకుతారు. ఆపై మోసాలకు తెరలేపుతారు. ఇలా తెలంగాణ, ఏపీ రాష్ట్రాలవారితో  తెలుగులో మాట్లాడి రూ.కోట్లలో మోసం చేసిన పది మంది ముఠా సభ్యులను సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. అంతర్రాష్ట సైబర్‌ నేరాల కేసులో అయిదుగురు తెలుగువారు పట్టుబడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. టాటా సఫారీ గెలుచుకున్నారంటూ నమ్మించి రూ.95,459 వసూలు చేయడంతో గత ఏడాది సెప్టెంబర్‌ 1న సైబరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి నుంచి ఫిర్యాదు అందిన నేపథ్యంలో ఈ మోసం వెలుగులోకి వచ్చిందని సీపీ సజ్జనార్‌ పేర్కొన్నారు. సోమవారం ఆయన సైబర్‌క్రైమ్‌ ఏసీపీ బాలకృష్ణారెడ్డితో కలిసి గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు.  

పోస్టులు పంపించి.. నమ్మించి..  
⇔ బిహార్‌లోని నవాడా జిల్లా మిర్జాపూర్‌కు చెందిన తరుణ్‌ కుమార్‌ అలియాస్‌ అమిత్‌ బీసీఏ చదివాడు. కోచింగ్‌ సెంటర్‌ పెట్టి ఆర్థికంగా నష్టపోయాడు. స్నేహితులు అలోక్, తిరంజ్‌ల సహకారంతో ఈ-కామర్స్‌ సైట్లు హెర్బల్‌ కేర్‌ గ్రూప్, నాప్‌టాల్, షాప్‌క్లూజ్‌ల నుంచి కొనుగోలుదారుల వివరాలు సేకరించాడు. భజరంగి, కామ్లేష్‌ దూబె, యశ్వంత్‌ ఠాకూర్, సౌరవ్‌ పటేల్‌లతో కలిసి 53 బ్యాంక్‌ ఖాతాలు సృష్టించారు. 

⇔ బిహర్‌ షరీఫ్‌లోని ప్రింటింగ్‌ ప్రెస్‌ వద్ద స్క్రాచ్‌ కార్డులు, అప్లికేషన్లు, బ్యాంక్‌ల నకిలీ స్టాంప్‌లు ముద్రించాడు. ఆయా సంస్థల ఎన్వెలప్‌ కవర్లకు బ్యాంక్‌ సీల్‌ వేసి లోపల స్క్రాచ్‌కార్డులు పంపి కస్టమర్లను నమ్మించేవారు. ప్రైజ్‌మనీ, టాటా సఫారీ గిఫ్ట్‌లు వచ్చాయని నకిలీ ఐడీ కార్డులు, లెటర్‌ హెడ్‌లను కొనుగోలుదారుల వాట్సాప్‌ నంబర్లకు పంపించేవారు. అనంతరం నగదు, కారు డెలివరీ అంటూ రిజిస్ట్రేషన్‌ ఫీజు, డాక్యుమెంట్‌ చార్జీలు, జీఎస్‌టీ, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ తదితరాలు చెల్లించాలంటూ బురిడీ కొట్టించేవారు.   

రాంచీ, ఒడిశా కేంద్రాలుగా..  
⇔ 2020 ఆగస్టులో జార్ఖండ్‌ రాష్ట్రం రాంచీలోని కొకర్‌కాల్‌ సెంటర్, ఒడిశాలోని రూర్కెలాలో తరుణ్‌ కుమార్‌ టెలీ కాలింగ్‌ కార్యాలయాలు ప్రారంభించాడు. అలోక్, తిరంజల నుంచి సేకరించిన ఈ– కామర్స్‌ సైట్ల కొనుగోలుదారుల వివరాలను టెలీ కాలర్లకు ఇచ్చాడు. తెలుగు రాష్ట్రాల ప్రజలను మోసగించేందుకు తెలుగు భాష వచ్చిన టెలీ కాలర్లను, కర్ణాటక, తమిళనాడు ప్రజలను చీటింగ్‌ చేసేందుకు కన్నడ, తమిళం మాట్లాడేవారిని నియమించాడు.  

⇔ రాంచీకి చెందిన కామ్లేష్‌ దూబే ఉపాధి కోసం 30 ఏళ్ల క్రితం మంచిర్యాలలోని బెల్లంపల్లిలో  స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. ఇతని స్నేహితులు యశ్వంత్‌కుమార్, సౌరభ్‌ పటేల్‌ పిలవడంతో రాంచీకి వెళ్లి వారితో చేతులు కలిపాడు. సైబర్‌ నేరాలు చేసే క్రమంలో తెలుగువాళ్లు అతిగాస్పందిస్తుండడంతో కామ్లేష్‌ దూబే సహకారంతో మంచిర్యాలకు చెందిన మచినెల్ల వెంకటేష్, గుర్రం రాకేష్, ప్రశంత్, రాజేందర్‌రెడ్డి, రాజలింగులను రాంచీకి పిలిపించుకొని టెలీకాలర్లుగా నియమించుకుని దందా సాగిస్తున్నారు. ఇలా దేశవ్యాప్తంగా రూ.2 కోట్ల వరకు ఈ ముఠా మోసగించింది. పదిమంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో మంచిర్యాలకు చెందిన అయిదుగురు ఉన్నారు. పరారీలో ఉన్నవారి కోసం గాలిస్తున్నారు.  

చదవండి: ‘భీష్మ’ డైరెక్టర్‌ వెంకీ కుడుములకు టోకరా..
           రెండు ఉదంతాల్లో రూ.73 లక్షల మోసం  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement