ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: విదేశాలకు ప్రత్యేకమైన ఆయిల్ ఎగుమతి చేస్తే భారీ లాభాలు వస్తాయంటూ నగర యువతికి ఎర వేసిన సైబర్ నేరగాళ్లు రూ.48 లక్షలు స్వాహా చేశారు. ఎట్టకేలకు మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు సోమవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. వెస్ట్‌జోన్ పరిధిలోని సంజీవ్‌రెడ్డినగర్‌కు చెందిన యువతి అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తి చేసి, ప్రస్తుతం గానుగ నూనె వ్యాపారం చేస్తోంది. తన విక్రయాలకు సంబంధించి ఆమె ఇండియన్ మార్ట్ వెబ్‌సైట్‌లో ప్రకటన పోస్టు చేశారు. దీనిని చూసి ఆమెకు ఫోన్ చేసిన సైబర్ నేరగాడు ఘనా దేశంలోని వెస్ట్ ఇన్విస్ట్ అనే కంపెనీలో పని చేస్తున్న జాన్సన్‌గా పరిచయం చేసుకున్నాడు.
తమ సంస్థ నిత్యం భారత్ నుంచి భారీగా ప్రత్యేకమైన ఆయిల్స్ ఖరీదు చేస్తుందని, దాని వివరాలు తెలిసినా పెట్టుబడిలేక తానేం చేయలేకపోతున్నానని చెప్పాడు. ‘విగా గార్లిక్ లిక్విడ్’గా పిలిచే ఆ ఆయిల్‌ను ఢిల్లీలో తయారు చేస్తున్నారని నమ్మించాడు. వారి వద్ద ఖరీదు చేసి తమ కంపెనీకి విక్రయిస్తే భారీ లాభాలు వస్తాయని చెప్పాడు. సదరు ఢిల్లీ కంపెనీ వారికి మీ నంబర్ ఇచ్చానని, వారే సంప్రదిస్తారంటూ యువతికి చెప్పాడు. ఆ మరుసటి రోజు ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నానంటూ పరిచయం చేసుకున్న విజయ అనే మహిళ కాల్ చేసింది. ‘జాన్సన్ మీ వివరాలు పంపించాడంటూ చెప్పి తమ వద్ద విగా గార్లిక్ అయిల్ లీటర్ 6 వేల డాలర్ల (రూ.4.34 లక్షలు) రేటు ఉందని, సగం అడ్వాన్సుగా చెల్లించాలని చెప్పింది’. తొలుత రూ.4.5 లక్షలు చెల్లించిన బాధితురాలు ఓ లీటర్ ఖరీదు చేసింది.
దానిని కొరియర్ ద్వారా అందుకున్న ఆమె పరీక్షలు చేయించాలంటూ జాన్సన్ చెప్పడంతో అతడు సూచించినట్లే ఢిల్లీ వెళ్లి కోపి అనే నైజీరియన్‌ను కలిసింది. అయితే పరీక్షలు నిర్వహించడానికి కనిష్టంగా 10 లీటర్లు ఉండాలంటూ అతడు నమ్మబలికాడు. దీంతో మరికొంత మొత్తం చెల్లించిన బాధితురాలు పది లీటర్ల ఆయిల్ ఖరీదు చేసింది. దీనిని పరీక్షించడానికి ఒడిశాకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పిన నేరగాళ్లు మరికొంత మొత్తం వసూలు చేశారు. ఇలా దఫదఫాల్లో రూ.48 లక్షలు చెల్లించిన, జీఎస్టీ తదితర బిల్లులు సైతం తీసుకున్న బాధితురాలికి అనుమా నం వచ్చింది. తన అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు ఒడిశా వెళ్లి ఆరా తీయగా మోసంగా తేలింది. అంతా ఓ ముఠాగా ఏర్పడి తన ను మోసం చేశారని గుర్తించిన ఆమె సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్ బి.రమేష్ దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment