నిబంధనలకు ‘నీళ్లు’ | No Qulaity in Mineral Water in West Godavari | Sakshi
Sakshi News home page

నిబంధనలకు ‘నీళ్లు’

Published Mon, Apr 29 2019 12:08 PM | Last Updated on Mon, Apr 29 2019 12:08 PM

No Qulaity in Mineral Water in West Godavari - Sakshi

అధికారుల పర్యవేక్షణ లేని మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌

పశ్చిమగోదావరి, తణుకు: ‘కాదేదీ వ్యాపారానికి అనర్హం అన్నట్టు’ ప్రకృతి వరప్రసాదంగా లభించే నీరు కొందరు అక్రమార్కుల చేతుల్లో వ్యాపార వస్తువుగా మారిపోయింది. అమ్మేవారికి పన్నీరు... కొనేవారికి కన్నీరులా అన్నట్టు మంచినీరు కాసులు కురిపించే కల్పతరువుగా మారింది. సహజసిద్ధంగా నేల తల్లి అందించే నీరు ప్రజలకు ఉచితంగా అందుబాటులో ఉండాల్సింది పోయి.. కాసులు కురిపిస్తేనే గానీ కదలిరానంటోంది. జిల్లాలో తాగునీటిపై నిత్యం కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతుండగా పర్యవేక్షించాల్సిన అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సాటి మనిషి కనిపిస్తే ఆప్యాయంగా పలకరించి కనీసం మంచినీరు ఇచ్చి దాహార్తిని తీర్చే మానవ సంబంధాలు పోయి దాహం తీర్చుకునేందుకు డబ్బులు పెట్టి మరీ నీటిని కొనుక్కోవాల్సి వస్తోందని జనం గగ్గోలు పెడున్నారు.

జిల్లాలో 2 వేలకు పైగా ప్లాంట్లు
వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చే నీరు ఇçప్పుడు డబ్బులు వెచ్చిస్తే గాని దాహం తీర్చలేనంటోంది. మినరల్‌ వాటర్‌ పేరిట వాటర్‌ ప్లాంట్లు జిల్లాలోని ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్నాయి. ప్రధానంగా పట్టణాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో సైతం వీటిని ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో 2 వేలకు పైగా వాటర్‌ ప్లాంట్లు ఉన్నాయి. అయితే ఎన్టీఆర్‌ సుజల పథకం ఆధ్వర్యంలో కొనసాగుతున్న 272 ప్లాంట్లు మాత్రం ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ పర్యవేక్షిస్తుండగా మిగిలిన వాటిపై ఎవరి అజమాయిషీ లేకపోవడం విశేషం. ఇదిలా ఉంటే ఎలాంటి పరీక్షలు లేకుండా ఎంత వాటర్‌కు ఎంత మినరల్‌ కలవాలనేది కనీస అవగాహన లేకుండా ఏదో తెలిసినకాడికి వాటర్‌లో మినరల్‌ కలిపి జనరల్‌ వాటర్‌నే మినరల్‌గా ప్రజలను బోల్తా కొట్టిస్తున్నారు. ఇలా ప్రతిరోజూ కోట్లలో సంపాదించుకునే తంతు కొనసాగుతోంది. ఈ తతంగాన్ని ప్రభుత్వ అ«ధికారులు సైతం తమ శాఖ కాదంటే తమ శాఖ కాదని చూసీచూడనట్టు వదిలేయడం అనుమానాలకు తావిస్తోంది. ఇదే అదునుగా భావిస్తున్న కొందరు అక్రమార్కులు తమ వ్యాపారాన్ని విస్తరిస్తూ చెలరేగిపోతున్నారు. పరిశుభ్రత పేరుతో రసాయనిక పదార్థాలు కలుపుతున్నారు. రుచి కోసం మరో రసాయనాన్ని కలిపి ప్లాస్టిక్‌ బాటిళ్లు, కవర్లలో బంధించిన వ్యాపారులు అధిక ధరలకు విక్రయించి సొమ్ములు చేసుకుంటున్నారు.

రోజుకు రూ.8 కోట్లు...
పలు అవసరాల నిమిత్తం పట్టణాలకు వచ్చే వారు తప్పనిసరిగా డబ్బులు వెచ్చింది నీళ్లు కొనుక్కుని తాగాల్సిందే. పైగా ఫంక్షన్‌ హాళ్లకే అధికంగా నీరు అమ్ముడుపోతోంది. ఈ శుభకార్యాలకు హాజరయ్యే దూరప్రాంతాల బంధుగణం దాహార్తితో బస్సు దిగగానే నీళ్ల బాటిళ్లు కొనుక్కోవాల్సిందే. నీటి వ్యాపారులకు ఇదే మంచి అవకాశంగా కలిసివస్తోంది. జిల్లాలో రోజుకు 40 వేల కిలోలీటర్ల నీరు కేవలం తాగడానికే వినియోగిస్తున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. ఇందుకోసం రోజుకు తాగునీటికే రూ.8 కోట్లు ఖర్చు పెడుతున్నారంటే పరిస్థితి అర్థమవుతోంది. చిరు వ్యాపారుల నుంచి మల్టీనేషనల్‌ కంపెనీల వరకు ఈ మంచినీళ్ల వ్యాపారం కాసులు కురిపించే వరంగా మారింది. కొన్ని సందర్భాల్లో ఈ నీళ్లలో కలిపే రసాయన పదార్థాలతో జబ్బులు వచ్చి వాంతులు, విరేచనాలతో ఆసుపత్రి పాలవుతున్న సంఘటనలు సైతం చోటు చేసుకుంటున్నాయి. నీళ్ల వ్యాపారం పేరుతో పెద్ద మొత్తంలో బోర్లు వేసి భూగర్భజలాలను యథేచ్ఛగా తోడివేయడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లోని చెరువులు, బావులు ఎండిపోతున్నాయి. అదీకాకుండా సరైన సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన లేకుండా విచ్చలవిడిగా ఏర్పాటు చేసే నీటి ప్లాంట్లు వల్ల భూగర్భజలాల నీటిమట్టం విపరీతంగా పోతోంది. దీనివల్ల రాబోయే రోజుల్లో మరింత నీటి కొరతను ఎదుర్కొనాల్సి వస్తుందని పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతిలో లభించే స్వచ్ఛమైన నీటి లభ్యత తగ్గిపోతే మానవ మనుగడ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో అధికారులు విచ్చలవిడి నీటి ప్లాంట్ల ఏర్పాటులో నియంత్రణ విధించాలని పలువురు కోరుతున్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని అక్రమ వ్యాపారాన్ని అరికట్టి ప్రజల ఆరోగ్యం కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఫిర్యాదులు ఉంటే చర్యలు తీసుకుంటాం
తాగునీటి నాణ్యతపై ఎక్కడైనా ఫిర్యాదులు ఉంటే తక్షణమే పరిశీలించి చర్యలు తీసుకుంటాం. పట్టణాలు, గ్రామాల్లోని ఏర్పాటు చేసిన వాటర్‌ ప్లాంట్లుపై రెవెన్యూ అధికారులు అజమాయిషీ చేయాల్సి ఉంది. ఎన్టీఆర్‌ సుజల పథకం కింద ఏర్పాటు చేసిన వాటర్‌ ప్లాంట్లుపై మా శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు.–సీహెచ్‌ అమరేశ్వరరావు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ, ఏలూరు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement