సాక్షి, హైదరాబాద్: పాల ఉత్పత్తుల నుంచి నీటి వ్యాపారంలోకి విజయ డెయిరీ అడుగుపెట్టింది. త్వరలో ‘విజయ’బ్రాండ్‌తో మినరల్ వాటర్‌ను అందుబాటులోకి తేనుంది. ప్రముఖ బ్రాండ్లకు దీటుగా ‘విజయ’పేరుతో మినరల్ వాటర్ తీసుకొస్తున్నట్లు డెయిరీ యాజమాన్యం తెలిపింది. మరో 15 రోజుల్లో రాష్ట్ర మార్కెట్లోకి ప్రధానంగా హైదరాబాద్ వినియోగదారులకు ఈ వాటర్ అందుబాటులోకి తీసుకొస్తామని డెయిరీ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ లాలాపేటలో ఉన్న విజయ డెయిరీ ప్లాంటులోనే వాటర్‌ప్లాంటును నెలకొల్పారు. అందుకు సంబంధించి అత్యాధునిక వాటర్‌ప్లాంటు కొనుగోలు చేసినట్లు డెయిరీ ఎండీ శ్రీనివాస్‌రావు ‘సాక్షి’కి తెలిపారు. ఇప్పటికే మినరల్ వాటర్ తయారీ, అమ్మకాలకు సంబంధించి లైసెన్సు తీసుకున్నట్లు వెల్లడించారు.
మినరల్ వాటర్‌ను ఇళ్లకు సరఫరా చేసేలా 20 లీటర్ల క్యాన్లు తీసుకొస్తున్నామని, ఒక లీటరు, అర లీటరు బాటిళ్లను కూడా వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. సమావేశాలు, శుభకార్యాలు తదితర అవసరాల కోసం పావు లీటర్ల బాటిళ్లను అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచన ఉన్నట్లు వివరించారు. వాటి ధరపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. మార్కెట్లో ప్రముఖ బ్రాండెడ్ కంపెనీల ధరలకు కొంచెం తక్కువ ఉండేలా కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. మరీ తక్కువ ధరకు అమ్మడం సాధ్యపడదని, సరైన ప్రమాణాలు ఉండాలంటే ఆ స్థాయిలో ధర తప్పదని చెప్పారు. తాగునీటి సరఫరాకు వివిధ ప్రాంతాల్లో ఏజెంట్లను నియమించనున్నట్లు వివరించారు.
పాల ఏజెంట్ల పునరుద్ధరణ..
విజయ డెయిరీ పాల విక్రయాలు గణనీయంగా పడిపోవడంతో యాజమాన్యం పలు చర్యలకు శ్రీకారం చుట్టింది. డెయిరీ ఎండీగా బాధ్యతలు తీసుకున్న శ్రీనివాస్‌రావు అందుకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం 4 లక్షల లీటర్ల పాల సేకరణ జరుగుతుండగా, రెండున్నర లక్షలే విక్రయాలు జరుగుతున్నాయి. ఆయన బాధ్యతలు చేపట్టాక పలు చర్యల ఫలితంగా విక్రయాలు 2.7 లక్షలకు చేరినట్లు డెయిరీ వర్గాలు తెలిపాయి. వచ్చే మూడు నెలల్లో మూడున్నర లక్షల లీటర్లకు పెంచాలని లక్ష్యంగా నిర్ధారించారు. వచ్చే ఏడాదికి 5 లక్షల లీటర్ల విక్రయాలు జరపాలని నిర్ణయించినట్లు విజయ డైయిరీ యాజమాన్యం తెలిపింది. హైదరాబాద్‌లో గతేడాది 650 మంది ఏజెంట్ల వ్యవస్థను రద్దు చేసి 150 మందితో డిస్ట్రిబ్యూటర్ల వ్యవస్థను నెలకొల్పడం వల్లే పాల విక్రయాలు పడిపోయాయి. దీంతో తాజాగా 650 మంది ఏజెంట్ల వ్యవస్థను పునరుద్ధరించారు.
ఆ ఏజెంట్లతో ఈ నెల 20 నుంచి పాల విక్రయాలు మళ్లీ ఊపందుకోనున్నాయని శ్రీనివాస్‌రావు తెలిపారు. పాల ఉత్పత్తుల విక్రయాలు కూడా గణనీయంగా పెంచాలని నిర్ణయించారు. అందుకు వాటి ప్యాకెట్లు, నాణ్యతలో అనేక మార్పులు చేర్పులు చేయనున్నారు. మార్కెటింగ్, ప్రచార వ్యవస్థను పటిష్టం చేస్తారు. విజయ డెయిరీలో అంతర్గత వ్యవస్థను పటిష్టం చేస్తున్నారు. అనేకమంది అధికారులకు స్థాన చలనం కల్పించారు. కొందరిని బదిలీ చేశారు. కాగా, ఇప్పటికే పేరుకుపోయిన రూ.100 కోట్ల విలువైన పాల ఉత్పత్తుల నిల్వలను ఎలా వదిలించుకోవాలన్న దానిపై యాజమాన్యం ఇంకా దృష్టిసారించలేదన్న ఆరోపణలున్నాయి.
మార్కెట్లోకి ‘విజయ’ మినరల్ వాటర్
Published Sat, Aug 18 2018 2:30 AM | Last Updated on Sat, Aug 18 2018 3:02 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment