Vijay Dairy
-
మార్కెట్లోకి ‘విజయ’ మినరల్ వాటర్
సాక్షి, హైదరాబాద్: పాల ఉత్పత్తుల నుంచి నీటి వ్యాపారంలోకి విజయ డెయిరీ అడుగుపెట్టింది. త్వరలో ‘విజయ’బ్రాండ్‌తో మినరల్ వాటర్‌ను అందుబాటులోకి తేనుంది. ప్రముఖ బ్రాండ్లకు దీటుగా ‘విజయ’పేరుతో మినరల్ వాటర్ తీసుకొస్తున్నట్లు డెయిరీ యాజమాన్యం తెలిపింది. మరో 15 రోజుల్లో రాష్ట్ర మార్కెట్లోకి ప్రధానంగా హైదరాబాద్ వినియోగదారులకు ఈ వాటర్ అందుబాటులోకి తీసుకొస్తామని డెయిరీ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ లాలాపేటలో ఉన్న విజయ డెయిరీ ప్లాంటులోనే వాటర్‌ప్లాంటును నెలకొల్పారు. అందుకు సంబంధించి అత్యాధునిక వాటర్‌ప్లాంటు కొనుగోలు చేసినట్లు డెయిరీ ఎండీ శ్రీనివాస్‌రావు ‘సాక్షి’కి తెలిపారు. ఇప్పటికే మినరల్ వాటర్ తయారీ, అమ్మకాలకు సంబంధించి లైసెన్సు తీసుకున్నట్లు వెల్లడించారు. మినరల్ వాటర్‌ను ఇళ్లకు సరఫరా చేసేలా 20 లీటర్ల క్యాన్లు తీసుకొస్తున్నామని, ఒక లీటరు, అర లీటరు బాటిళ్లను కూడా వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. సమావేశాలు, శుభకార్యాలు తదితర అవసరాల కోసం పావు లీటర్ల బాటిళ్లను అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచన ఉన్నట్లు వివరించారు. వాటి ధరపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. మార్కెట్లో ప్రముఖ బ్రాండెడ్ కంపెనీల ధరలకు కొంచెం తక్కువ ఉండేలా కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. మరీ తక్కువ ధరకు అమ్మడం సాధ్యపడదని, సరైన ప్రమాణాలు ఉండాలంటే ఆ స్థాయిలో ధర తప్పదని చెప్పారు. తాగునీటి సరఫరాకు వివిధ ప్రాంతాల్లో ఏజెంట్లను నియమించనున్నట్లు వివరించారు. పాల ఏజెంట్ల పునరుద్ధరణ.. విజయ డెయిరీ పాల విక్రయాలు గణనీయంగా పడిపోవడంతో యాజమాన్యం పలు చర్యలకు శ్రీకారం చుట్టింది. డెయిరీ ఎండీగా బాధ్యతలు తీసుకున్న శ్రీనివాస్‌రావు అందుకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం 4 లక్షల లీటర్ల పాల సేకరణ జరుగుతుండగా, రెండున్నర లక్షలే విక్రయాలు జరుగుతున్నాయి. ఆయన బాధ్యతలు చేపట్టాక పలు చర్యల ఫలితంగా విక్రయాలు 2.7 లక్షలకు చేరినట్లు డెయిరీ వర్గాలు తెలిపాయి. వచ్చే మూడు నెలల్లో మూడున్నర లక్షల లీటర్లకు పెంచాలని లక్ష్యంగా నిర్ధారించారు. వచ్చే ఏడాదికి 5 లక్షల లీటర్ల విక్రయాలు జరపాలని నిర్ణయించినట్లు విజయ డైయిరీ యాజమాన్యం తెలిపింది. హైదరాబాద్‌లో గతేడాది 650 మంది ఏజెంట్ల వ్యవస్థను రద్దు చేసి 150 మందితో డిస్ట్రిబ్యూటర్ల వ్యవస్థను నెలకొల్పడం వల్లే పాల విక్రయాలు పడిపోయాయి. దీంతో తాజాగా 650 మంది ఏజెంట్ల వ్యవస్థను పునరుద్ధరించారు. ఆ ఏజెంట్లతో ఈ నెల 20 నుంచి పాల విక్రయాలు మళ్లీ ఊపందుకోనున్నాయని శ్రీనివాస్‌రావు తెలిపారు. పాల ఉత్పత్తుల విక్రయాలు కూడా గణనీయంగా పెంచాలని నిర్ణయించారు. అందుకు వాటి ప్యాకెట్లు, నాణ్యతలో అనేక మార్పులు చేర్పులు చేయనున్నారు. మార్కెటింగ్, ప్రచార వ్యవస్థను పటిష్టం చేస్తారు. విజయ డెయిరీలో అంతర్గత వ్యవస్థను పటిష్టం చేస్తున్నారు. అనేకమంది అధికారులకు స్థాన చలనం కల్పించారు. కొందరిని బదిలీ చేశారు. కాగా, ఇప్పటికే పేరుకుపోయిన రూ.100 కోట్ల విలువైన పాల ఉత్పత్తుల నిల్వలను ఎలా వదిలించుకోవాలన్న దానిపై యాజమాన్యం ఇంకా దృష్టిసారించలేదన్న ఆరోపణలున్నాయి. -
నాలుగు డెయిరీలతో ‘విజయ బోర్డు’
సాక్షి, హైదరాబాద్: విజయ డెయిరీ ఫెడరేషన్లో అనేక మార్పులు చోటుచేసుకోనున్నాయి. విజయ డెయిరీ ఆధ్వర్యంలో నల్లగొండ–రంగారెడ్డి సహకార డెయిరీ, ముల్కనూరు మహిళా డెయిరీ, కరీంనగర్ డెయిరీల భాగస్వామ్యంతో ఒక బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు సంబంధించి రెండు రోజుల క్రితం సహకార డెయిరీల ప్రతినిధులు కొందరు ప్రభుత్వంలోని ఓ కీలక ఉన్నతాధికారితో సమావేశమై చర్చించారు. ప్రతిపాదనలు తయారు చేసుకుని తీసుకురావాలని, వాటిని ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్తామని ఆ ఉన్నతాధికారి చెప్పినట్లు ఓ సహకార డెయిరీ చైర్మన్ ‘సాక్షి’కి తెలిపారు. ప్రతిపాదనలు తయారు చేసే పనిలో తాము నిమగ్నమైనట్లు ఆయన వెల్లడించారు. ‘ఈ 4 డెయిరీలతో బోర్డు ఏర్పాటైతే, సహకార డెయిరీల చైర్మన్లంతా సభ్యులుగా ఉంటారు. ఆయా డెయిరీ సొసైటీలతో కలుపుకుని బోర్డుకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఆ ఎన్నికల్లో ఎవరు గెలిస్తే వారే విజయ డెయి రీ భాగస్వామ్య బోర్డుకు చైర్మన్‌గా ఉంటారు’అని తెలిపారు. కొత్త మార్కెట్ కోసమే ఈ నాలుగు డెయిరీలకు 2.13 లక్షల మంది రైతులు పాలు పోస్తుంటారు. విజయ డెయిరీకి రోజుకు 3.5 లక్షల లీటర్ల నుంచి 4 లక్షల లీటర్ల వరకు పాలు వస్తుంటాయి. కానీ 2 లక్షల నుంచి 2.5 లక్షల లీటర్లే అమ్ముడవుతున్నాయి. నల్లగొండ–రంగారెడ్డి డెయిరీ విక్రయాలు రోజుకు లక్ష లీటర్లు ఉండగా, 35 వేల లీటర్ల వరకు పాలు మిగులుతున్నాయి. కరీంనగర్ డెయిరీ విక్రయాలు లక్షన్నర లీటర్లు ఉండగా, కొంత వరకు మిగులుతున్నాయి. ముల్కనూరు డెయిరీ విక్రయాలు 60 వేల లీటర్లు ఉన్నాయి. ఇలా ఈ డెయిరీల్లోనూ పాలు మిగులుతున్నాయి. మరోవైపు రాబోయే రోజుల్లో ప్రభుత్వం సబ్సిడీపై 2.13 లక్షల పాడి గేదెలను పంపిణీ చేస్తే మరో 15 లక్షల లీటర్ల వరకు అదనపు పాలు వచ్చే అవకాశముంది. ఈ పరిస్థితుల్లో కొత్త మార్కెట్‌ను సృష్టించుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఈ నాలుగు డెయిరీలు ఒకే గొడుగు కిందికి రావాలని ఈ ప్రతిపాదనలు తెస్తున్నట్లు చెబుతున్నారు. తాజా పాలు నినాదంతో.. ఇతర రాష్ట్రాల పాలు చౌకగా హైదరాబాద్ మార్కెట్లోకి వస్తున్నాయి. వాటిపై సెస్ విధిం చేలా ప్రతిపాదనలు తయారు చేస్తారని సమా చారం. ‘అమూల్ పాలు గుజరాత్ నుంచి వస్తున్నాయి. సేకరించిన వారం రోజుల తర్వాత అవి రాష్ట్ర వినియోగదారులకు చేరుతుంది. కాబట్టి అవి తాజా పాలు కావు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల నుంచి వచ్చే వాటికి కూడా మూడు రోజులు తేడా ఉంటుంది. కానీ రాష్ట్రంలో ఉత్పత్తి చేసే పాలు 24 గంటల తేడాతో ఉంటాయి. కాబట్టి ‘తాజా పాలు’నినాదంతో ముందుకు వెళ్లాలి’అని యోచిస్తున్నట్లు తెలిసింది. మిగిలిపోయిన పాలతో పాలకోవ, వెన్న, నెయ్యి తదితర ఉత్పత్తులను తయారు చేసి విజయ డెయిరీ పేరుతోనే ప్యాకింగ్ చేస్తామని, విజయ డెయిరీ ఆధ్వర్యంలో అమ్మకాలు చేస్తామని ఆ సహకార డెయిరీ చైర్మన్ చెబుతున్నారు. విజయ డెయిరీ ఫెడరేషన్‌ను ‘విజయ డెయిరీ మార్కెటింగ్ ఫెడరేషన్’గా పేరు మార్చాలని ప్రతిపాదించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం విజయ డెయిరీలోని నిబం ధనలను మార్చాలని కోరుతున్నామన్నారు. ఎండీగా ఐఏఎస్ వద్దు కొత్తగా ఏర్పాటయ్యే విజయ డెయిరీ మార్కె టింగ్ ఫెడరేషన్ బోర్డుకు చైర్మన్‌ను డెయిరీల్లోని సొసైటీ సభ్యులు ఎన్నుకుంటారు. ఆ ప్రకారం నాలుగు డెయిరీల్లోని వారిలో ఎవరో ఒకరు చైర్మన్ అవుతారు. ప్రస్తుతం ఉన్నట్లుగా ఐఏఎస్‌ను మాత్రం ఎండీగా నియమించకూడదని ప్రతిపాదనల్లో ఒక అంశంగా చేర్చాలని యోచిస్తున్నట్లు సమాచారం. పాల ఉత్పత్తి రంగంలో అత్యంత అనుభవజ్ఞులైన జాతీయ స్థాయి వ్యక్తిని తీసుకోవాలనేది భావిస్తున్నట్లు తెలిసింది. పాల పొడి, వెన్న, నెయ్యి తదితరాలు తయారు చేసే ప్లాంటు రాష్ట్రంలో లేకపోవడంతో ఏపీకి వెళ్లాల్సి వస్తోందని, దీంతో ఇక్కడే ఒక ప్లాంటును నెలకొల్పాలని తాము ప్రభుత్వానికి ప్రతిపాదిస్తామని ఆ సహకార డెయిరీ చైర్మన్ చెబుతున్నారు. ప్రైవేటు దిశగా అడుగులా? ప్రసుత్తమున్న సహకార సొసైటీలకు తోడు పూర్వ నిజామాబాద్, ఆదిలాబాద్ల్లోని పాల సొసైటీలతో ఒక యూనియన్, ఖమ్మం, వరంగల్ జిల్లాలతో కలిపి మరో యూనియన్, మహబూబ్‌నగర్ జిల్లాతో కలిపి మరో యూనియన్ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. అంటే విజయ డెయిరీ, మూడు సహకార డెయిరీలు, కొత్తగా మరో మూడు యూనియన్ల భాగస్వామ్యంతో ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలనేది తాజా ప్రతిపాదనల్లో ఒక కీలక అంశం. విజయ డెయిరీ ఇప్పటికే పూర్తిస్థాయిలో నష్టాల్లో ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అది నిర్వీర్యమైంది. ఇప్పుడు తాజాగా ఇతర సహకార డెయిరీలు తీసుకునే విధానాలు ఏ మేరకు దాన్ని బాగు చేస్తాయోనన్న చర్చ జరుగుతోంది. ప్రైవేటు దిశగా విజయ డెయిరీలో అడుగులు పడుతున్నాయా అన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. -
డెయిరీల గుప్పిట్లో సర్కారీ భూములు
ప్రైవేటు కంపెనీలుగా మారి ‘విజయ’ భూములు కాజేసే యత్నాలు వందల కోట్ల ఆస్తులు దక్కించుకునే కుట్ర జిల్లా కేంద్రంలో 20 ఎకరాలను సొంతం చేసుకున్న కరీంనగర్ పాల సహకార సంస్థ హయత్‌నగర్‌లో రూ.720 కోట్ల భూమిపై కన్నేసిన ‘నార్మాక్’ అంగుళం కూడా వదులుకోం: మంత్రి పోచారం సాక్షి, హైదరాబాద్: కోట్లాది రూపాయల విలువజేసే ప్రభుత్వ భూములను కాజేసేందుకు కుట్ర జరుగుతోందా..? పాడి పరిశ్రమ సహకార సంఘాలు ఇందుకు ఎత్తులు వేస్తున్నాయా? మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ సొసైటీ (మ్యాక్స్) చట్టాన్ని అడ్డుపెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘విజయ’ డెయిరీ భూములను గుప్పిట పట్టేందుకు యత్నిస్తున్నాయా..? తాజా పరిణామాలు అందుకు అవుననే సమాధానమిస్తున్నాయి! సహకార డెయిరీల కుట్రలపై విజయ డెయిరీ ఇప్పటికే ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో కోట్లాది రూపాయల విలువైన భూములను కాజేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను వివరించింది. భూములను కాజేసేందుకే సహకార సంఘాలు... తమ సంస్థలను ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలుగా మార్చుకునేందుకు యత్నిస్తున్నాయని ప్రభుత్వానికి తెలిపింది. ఈ సహకార సంఘాలు ఒక్కసారి కంపెనీ చట్టంలోకి మారిపోతే వాటి పేరిట ఇప్పటిదాకా ఉన్న భూములన్నీ కంపెనీ ఆధీనంలోకి వెళ్తాయి. అంటే ఇక ఆ భూములపై విజయ డెయిరీకి ఎలాంటి హక్కులు ఉండవన్నమాట! కరీంనగర్ పాల ఉత్పత్తి సహకార సంఘం ఇప్పటికే కంపెనీ చట్టం కింద ప్రైవేట్ లిమిటెడ్‌గా మార్చుకుని దానికి ఉన్న 20 ఎకరాలను సొంతం చేసుకుంది. దీనిపై ప్రభుత్వం న్యాయపోరాటానికి సైతం దిగడం గమనార్హం. మ్యాక్స్ చట్టం తర్వాత జిల్లాల్లోని సహకార డెయిరీ సంఘాలకు అనేక అధికారాలు దఖలు పడ్డాయి. ఈ చట్టాన్ని ఆసరాగా చేసుకొని కరీంనగర్ పాల ఉత్పత్తి సహకార సంస్థ.. ప్రైవేటు కంపెనీ చట్టం కిందకు మారడంతో దానికి జిల్లా కేంద్రంలో ఉన్న 20 ఎకరాల భూమితో పాటు అందులోని యూనిట్లు కూడా ఆ కంపెనీ పరిధిలోకే వెళ్లాయి. దీంతో విజయ డెయిరీ కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ‘‘ప్రభుత్వ రంగ సంస్థ భూములు అప్పనంగా కాజేయడానికి మ్యాక్స్ ను ఉపయోగించుకుంటున్నారు. కచ్చితంగా ఇది అక్రమమే. అటు ప్రభుత్వాన్ని, ఇటు పాడి రైతులను దగాచేయడమే’’ అని విజయ డెయిరీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ‘‘మ్యాక్స్ చట్టం ఆర్టికల్ 2(డీ), 4(3)ఈ ప్రకారం కరీంనగర్ పాల సహకార సంస్థ.. దాని ఆస్తులను ప్రభుత్వానికి అప్పగించాలి. లేదంటే ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవాలి. ఇవేవీ లేకుండా నిబంధనలను తుంగలో తొక్కి ఆ సంస్థ భూములను, పాల యూనిట్లను సొంతం చేసుకుంటోంది’’ అని ఆయన పేర్కొన్నారు. హయత్‌నగర్‌లో భూమి విలువ రూ.720 కోట్లు విజయ డెయిరీ కింద హయత్‌నగర్‌లో నార్మాక్(నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తి దారుల సహకార సంస్థ) కింద 72 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి విలువ ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం రూ.720 కోట్లు ఉంటుంది. దీంతోపాటు నార్మాక్‌కు నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో కోట్లాది రూపాయల విలువైన భూములు ఉన్నాయి. నార్మాక్ పరిధిలోని ప్రతి గజం విజయ డెయిరీదే. ఇప్పుడు కంపెనీ చట్టంలోకి మారడం ద్వారా ఈ ఆస్తులు కాజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో విజయ డెయిరీ... నార్మాక్ను కంపెనీ చట్టం కిందకు రాకుండా చూడాలంటూ కేంద్రాన్ని కోరింది. కేంద్రం అందుకు సమ్మతించింది. దీన్ని సవాల్ చేస్తూ నార్మాక్ హైకోర్టులో పిటిషన్ వేసింది. కేవలం ఆస్తులను కాజేయడానికే కంపెనీ చట్టం కింద ప్రైవేట్ లిమిటెడ్‌గా మారాలనుకుంటున్నాయని విజయ డెయిరీ వాదించబోతోంది. ఏపీలో మొదలైన తంతు.. సహకార డెయిరీ సంఘాలు ప్రైవేటు కంపెనీలు గా మారే వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌లో మొదలైంది. విశాఖపట్నం, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు కో-ఆపరేటివ్ పాల ఉత్పత్తి సంస్థలు ఎప్పు డో కంపెనీ చట్టంలోకి వెళ్లిపోయాయి. అవన్నీ కొందరు ప్రముఖులకు సొంత ఆస్తులుగా మారిపోయాయి. వాటి కింద ఉన్న వందల కోట్ల రూపాయల విలువైన భూములు, ఆస్తులను వారే అనుభవిస్తున్నారు. గుంటూరు, నెల్లూరుల్లో డెయిరీ భూములను ఇప్పటికే కొందరు లీజుకు ఇచ్చి కోట్లు సంపాదిస్తున్నారు. మరికొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తె లంగాణలో సహకార సంఘాలు ప్రైవేటు కంపెనీలుగా మారే యత్నాలు మొదలుపెట్టాయి. శంషాబాద్ ఎందుకో! విజయ డెయిరీ ఆధ్వర్యంలోని నార్మాక్‌కు హయత్‌నగర్‌లో 72 ఎకరాల భూమి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మెగా డెయిరీ పెట్టదలిస్తే అక్కడ విశాలమైన స్థలం దొరుకుతుంది. అయి తే ప్రభుత్వం దాన్ని పట్టించుకోకుండా శంషాబాద్‌లో 30 ఎకరాలు సేకరించే ప్రయత్నం చేయ డం అధికారవర్గాలను విస్మయానికి గురి చేస్తోం ది. అన్ని సదుపాయాలతో 72 ఎకరాల భూమి అక్కడ అందుబాటులో ఉన్న సంగతిని అధికారులు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. కాపాడుకుంటాం: మంత్రి పోచారం విజయ డెయిరీ కింద ఉన్న పాల సహకార సంఘాల ఆస్తులు ప్రభుత్వానివేనని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పారు. ‘‘అవి పూర్తిగా ప్రభుత్వరంగ సంస్థ ఆస్తులు. వాటిని మేం కాపాడుతాం. అంగుళం స్థలం కూడా వదులుకోము. ఇన్ని అవలక్షణాలకు ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా తెచ్చిన మ్యాక్స్ చట్టమే కారణం. విజయ డెయిరీని నిర్వీర్యం చేయడానికి ఆయన ఆ చట్టం తీసుకువచ్చారు’’ అని మంత్రి మండిపడ్డారు. -
విజయ డెయిరీకి తెలంగాణ బోర్డు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ డెయిరీ డెవలప్మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ (విజయ డెయిరీ)కు ఐదుగురు తెలంగాణ సభ్యులతో బోర్డును ఏర్పాటు చేస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పర్సన్ ఇన్చార్జిగా పశుసంవర్థక, పాల అభివృద్ధి, మత్స్యశాఖ ముఖ్యకార్యదర్శి ఉంటారు. మరో నలుగురు పర్సన్ ఇన్చార్జి సభ్యులుగా వ్యవహరిస్తారు. కమిటీ అవసరమైన నిర్ణయాలు తీసుకుంటుంది.