డెయిరీల గుప్పిట్లో సర్కారీ భూములు
- ప్రైవేటు కంపెనీలుగా మారి ‘విజయ’ భూములు కాజేసే యత్నాలు
- వందల కోట్ల ఆస్తులు దక్కించుకునే కుట్ర
- జిల్లా కేంద్రంలో 20 ఎకరాలను సొంతం చేసుకున్న కరీంనగర్ పాల సహకార సంస్థ
- హయత్‌నగర్‌లో రూ.720 కోట్ల భూమిపై కన్నేసిన ‘నార్మాక్’
- అంగుళం కూడా వదులుకోం: మంత్రి పోచారం
సాక్షి, హైదరాబాద్: కోట్లాది రూపాయల విలువజేసే ప్రభుత్వ భూములను కాజేసేందుకు కుట్ర జరుగుతోందా..? పాడి పరిశ్రమ సహకార సంఘాలు ఇందుకు ఎత్తులు వేస్తున్నాయా? మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ సొసైటీ (మ్యాక్స్) చట్టాన్ని అడ్డుపెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘విజయ’ డెయిరీ భూములను గుప్పిట పట్టేందుకు యత్నిస్తున్నాయా..? తాజా పరిణామాలు అందుకు అవుననే సమాధానమిస్తున్నాయి! సహకార డెయిరీల కుట్రలపై విజయ డెయిరీ ఇప్పటికే ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది.
హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో కోట్లాది రూపాయల విలువైన భూములను కాజేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను వివరించింది. భూములను కాజేసేందుకే సహకార సంఘాలు... తమ సంస్థలను ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలుగా మార్చుకునేందుకు యత్నిస్తున్నాయని ప్రభుత్వానికి తెలిపింది. ఈ సహకార సంఘాలు ఒక్కసారి కంపెనీ చట్టంలోకి మారిపోతే వాటి పేరిట ఇప్పటిదాకా ఉన్న భూములన్నీ కంపెనీ ఆధీనంలోకి వెళ్తాయి.
అంటే ఇక ఆ భూములపై విజయ డెయిరీకి ఎలాంటి హక్కులు ఉండవన్నమాట! కరీంనగర్ పాల ఉత్పత్తి సహకార సంఘం ఇప్పటికే కంపెనీ చట్టం కింద ప్రైవేట్ లిమిటెడ్‌గా మార్చుకుని దానికి ఉన్న 20 ఎకరాలను సొంతం చేసుకుంది. దీనిపై ప్రభుత్వం న్యాయపోరాటానికి సైతం దిగడం గమనార్హం. మ్యాక్స్ చట్టం తర్వాత జిల్లాల్లోని సహకార డెయిరీ సంఘాలకు అనేక అధికారాలు దఖలు పడ్డాయి. ఈ చట్టాన్ని ఆసరాగా చేసుకొని కరీంనగర్ పాల ఉత్పత్తి సహకార సంస్థ.. ప్రైవేటు కంపెనీ చట్టం కిందకు మారడంతో దానికి జిల్లా కేంద్రంలో ఉన్న 20 ఎకరాల భూమితో పాటు అందులోని యూనిట్లు కూడా ఆ కంపెనీ పరిధిలోకే వెళ్లాయి. దీంతో విజయ డెయిరీ కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
‘‘ప్రభుత్వ రంగ సంస్థ భూములు అప్పనంగా కాజేయడానికి మ్యాక్స్ ను ఉపయోగించుకుంటున్నారు. కచ్చితంగా ఇది అక్రమమే. అటు ప్రభుత్వాన్ని, ఇటు పాడి రైతులను దగాచేయడమే’’ అని విజయ డెయిరీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ‘‘మ్యాక్స్ చట్టం ఆర్టికల్ 2(డీ), 4(3)ఈ ప్రకారం కరీంనగర్ పాల సహకార సంస్థ.. దాని ఆస్తులను ప్రభుత్వానికి అప్పగించాలి. లేదంటే ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవాలి. ఇవేవీ లేకుండా నిబంధనలను తుంగలో తొక్కి ఆ సంస్థ భూములను, పాల యూనిట్లను సొంతం చేసుకుంటోంది’’ అని ఆయన పేర్కొన్నారు.
హయత్‌నగర్‌లో భూమి విలువ రూ.720 కోట్లు
విజయ డెయిరీ కింద హయత్‌నగర్‌లో నార్మాక్(నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తి దారుల సహకార సంస్థ) కింద 72 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి విలువ ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం రూ.720 కోట్లు ఉంటుంది. దీంతోపాటు నార్మాక్‌కు నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో కోట్లాది రూపాయల విలువైన భూములు ఉన్నాయి. నార్మాక్ పరిధిలోని ప్రతి గజం విజయ డెయిరీదే. ఇప్పుడు కంపెనీ చట్టంలోకి మారడం ద్వారా ఈ ఆస్తులు కాజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో విజయ డెయిరీ... నార్మాక్‌ను కంపెనీ చట్టం కిందకు రాకుండా చూడాలంటూ కేంద్రాన్ని కోరింది. కేంద్రం అందుకు సమ్మతించింది. దీన్ని సవాల్ చేస్తూ నార్మాక్ హైకోర్టులో పిటిషన్ వేసింది. కేవలం ఆస్తులను కాజేయడానికే కంపెనీ చట్టం కింద ప్రైవేట్ లిమిటెడ్‌గా మారాలనుకుంటున్నాయని విజయ డెయిరీ వాదించబోతోంది.
ఏపీలో మొదలైన తంతు..
సహకార డెయిరీ సంఘాలు ప్రైవేటు కంపెనీలు గా మారే వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌లో మొదలైంది. విశాఖపట్నం, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు కో-ఆపరేటివ్ పాల ఉత్పత్తి సంస్థలు ఎప్పు డో కంపెనీ చట్టంలోకి వెళ్లిపోయాయి. అవన్నీ కొందరు ప్రముఖులకు సొంత ఆస్తులుగా మారిపోయాయి. వాటి కింద ఉన్న వందల కోట్ల రూపాయల విలువైన భూములు, ఆస్తులను వారే అనుభవిస్తున్నారు. గుంటూరు, నెల్లూరుల్లో డెయిరీ భూములను ఇప్పటికే కొందరు లీజుకు ఇచ్చి కోట్లు సంపాదిస్తున్నారు. మరికొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తె లంగాణలో సహకార సంఘాలు ప్రైవేటు కంపెనీలుగా మారే యత్నాలు మొదలుపెట్టాయి.
శంషాబాద్ ఎందుకో!
విజయ డెయిరీ ఆధ్వర్యంలోని నార్మాక్‌కు హయత్‌నగర్‌లో 72 ఎకరాల భూమి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మెగా డెయిరీ పెట్టదలిస్తే అక్కడ విశాలమైన స్థలం దొరుకుతుంది. అయి తే ప్రభుత్వం దాన్ని పట్టించుకోకుండా శంషాబాద్‌లో 30 ఎకరాలు సేకరించే ప్రయత్నం చేయ డం అధికారవర్గాలను విస్మయానికి గురి చేస్తోం ది. అన్ని సదుపాయాలతో 72 ఎకరాల భూమి అక్కడ అందుబాటులో ఉన్న సంగతిని అధికారులు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.
కాపాడుకుంటాం: మంత్రి పోచారం
విజయ డెయిరీ కింద ఉన్న పాల సహకార సంఘాల ఆస్తులు ప్రభుత్వానివేనని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పారు. ‘‘అవి పూర్తిగా ప్రభుత్వరంగ సంస్థ ఆస్తులు. వాటిని మేం కాపాడుతాం. అంగుళం స్థలం కూడా వదులుకోము. ఇన్ని అవలక్షణాలకు ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా తెచ్చిన మ్యాక్స్ చట్టమే కారణం. విజయ డెయిరీని నిర్వీర్యం చేయడానికి ఆయన ఆ చట్టం తీసుకువచ్చారు’’ అని మంత్రి మండిపడ్డారు.