బిందె నీటిని రూ.2కు కొంటున్నారని పాతికేళ్ల క్రితం పత్రికల్లో వస్తే ‘నీళ్లు కొనాల్సిన పరిస్థితులు దాపురిస్తున్నాయన్న మాట’ అని చాలామంది నోళ్లు నొక్కుకున్నారు. ఆ తర్వాత ఎక్కడికక్కడ వాటర్ బాటిళ్లు వచ్చేశాయి. ప్రస్తుతం ఏ హోటల్‌కు వెళ్లినా నీటిని కొనాల్సిందే. ఉచితంగా మంచినీళ్లు ఇచ్చే పరిస్థితులు దాదాపు ఏ హోటల్, రెస్టారెంట్‌లోనూ కనిపించటం లేదు. ప్రజల ఆర్థి క పరిస్థితులు బాగా మెరుగుపడటంతో సురక్షిత నీటి కోసం ఎంత ఖర్చయినా వెనుకాడటం లేదు.
భారతదేశంలో 2018 వరకూ మినరల్ వాటర్ బాటిళ్ల వ్యాపారం ఏటా రూ.16 వేల కోట్లు ఉండేది. 2022లో రూ.33 వేల కోట్లకు చేరింది. 2023లో రూ.43 వేల కోట్ల బిజినెస్ జరుగుతోందని మార్కెట్ వర్గాల అంచనా. బిస్లరీ, కిన్లే, ఆక్వాఫినా, టాటా వాటర్ ప్లస్, బెయిలీ, రెయిల్ నీర్, ఆక్సీరిచ్ వాటర్ వినియోగం ఎక్కువ. ఇప్పుడు వీటికంటే ఖరీదైన నీరు మార్కెట్‌కు చేరింది. దేశంలో లీటర్ నీళ్ల ధర కనిష్టంగా రూ.20 ఉండగా.. గరిష్టంగా రూ.12 వేల వరకూ ఉంది. జపాన్, జర్మనీతో పాటు దేశాల్లో ఇంతకంటే ఖరీదైన మినరల్ వాటర్ కూడా ఉంది. వీటిని ఆన్‌లైన్‌లో కూడా కొనుగోలు చేయొచ్చు. –సాక్షి ప్రతినిధి, కర్నూలు
ఖరీదైన బ్రాండ్లు ఇవీ
అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని హవాయి సముద్రం నుంచి 3వేల అడుగుల లోతులో నీటిని సేకరించి ప్రాసెస్ చేస్తారు. ఇందులో సముద్రపు మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ‘కోనదీప్’ పేరుతో ఈ నీళ్లు మనదేశంలోనూ దొరుకుతున్నాయి. భారత్‌లో లభిస్తున్న అత్యంత ఖరీదైన నీరు ఇదే. ‘వోస్ ఆర్టేíÙయల్’ అనే మరో కంపెనీ దక్షిణ నార్వే నుంచి నీటిని సేకరిస్తోంది. మంచుకొండలో అతి చివరి పొర నుంచి ఈ నీటిని సేకరిస్తారు.
భారత్‌లోని అత్యంత ఖరీదైన రెస్టారెంట్లు, లాంజ్‌లలో మాత్రమే వీటిని విక్రయిస్తున్నారు. 800 మిల్లీలీటర్ల బాటిల్ ధర రూ.6,600 నుంచి రూ.12వేల వరకూ ఉంది. ‘ఆవా’ పేరుతో మరో కంపెనీ ఆల్కలైన్ వాటర్ ఇస్తోంది. ఇందులో పీహెచ్ 8+ ఉంటుంది. కాల్షియం, మెగ్నీíÙయం లాంటి ఫోర్టీ ఫైడ్ మినరల్స్ కూడా ఇందులో ఉంటాయి. ఆరావళి, తరంగ పర్వతాల నుంచి ఈ నీటిని సేకరిస్తారు. ‘ఈవియన్’ అనే మరో బ్రాండ్ నీటిలో మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి.
మంచుకొండల్లో వర్షం కురిసినప్పుడు మంచుపై పారే నీటిని సేకరిస్తారు. ఇందులో పీహెచ్ 7.2 ఉంటుంది. ఇండియాలో ఎక్కువగా క్రీడాకారులు, సెలబ్రిటీలు ఈ నీటినే వినియోగిస్తున్నారు. టాటా హిమాలయా బ్రాండ్ నీటిని హిమాలయాల్లో శివలేక్ పరిధిలో ఉన్న మంచు పర్వతాల నుంచి సేకరిస్తారు. 100 శాతం స్వచ్ఛమైన నేచురల్ మినరల్స్ ఇందులో ఉంటాయి. ఈ నీటిని సేకరించే ప్రాంతంలో మనుషుల సంచారం, కాలుష్యం ఉండదు. బాక్టీరియా కూడా ఉండదు.
ఫిలికో వాటర్ రూ.1.14 లక్షలు
ప్రపంచంలోని టాప్–10 బ్రాండ్లలో కనిష్టంగా 27 డాలర్ల నుంచి గరిష్టంగా 1,390 వరకు లీటర్ నీటి ధర ఉంది. ఇందులో జపాన్ కంపెనీకి చెందిన ఫిలికో లీటర్ వాటర్ ధర 1,390 డాలర్లు (రూ.1.14 లక్షలు). జర్మనీకి చెందిన నివాస్ ధర1,180 డాలర్లు (రూ.96,760). టాప్ బ్రాండ్లలో కనిష్టంగా ఆ్రస్టేలియాలోని టాస్మానియా కంపెనీ బీఎల్‌వీడీ నీటి ధర 27 డాలర్లు (రూ.2,214).
కొత్తగా వచ్చింది ‘బ్లాక్ వాటర్’
‘ఇవాకస్’ పేరిట మార్కెట్‌లోకి కొత్తగా బ్లాక్‌వాటర్ వచ్చింది. ఇందులో 70పైగా నేచురల్ మినరల్స్ ఉన్నట్టు చెబుతున్నారు. శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఉండటంతో పాటు ఎసిడిటీని తగ్గిస్తుంది. చర్మం ముడతలు పడకుండా మృదువుగా ఉంచుతుందట. వయసు ప్రభావం కన్పించదని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment