గిరిజనులకు మినరల్ వాటర్ | mineral water Tribal | Sakshi
Sakshi News home page

గిరిజనులకు మినరల్ వాటర్

Published Thu, Oct 2 2014 2:05 AM | Last Updated on Sat, Sep 2 2017 2:14 PM

mineral water Tribal

 సాక్షి, ఏలూరు: రాష్ట్రంలోని కొండకోనల్లో నివసించే గిరిజనులందరికీ మినరల్ వాటర్ అందించేందుకు ఏజెన్సీ ప్రాంతాల్లో వాటర్ గ్రిడ్‌లను నెలకొల్పడానికి సమగ్ర ప్రణాళికను రూపొందిస్తున్నట్టు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ బి.ఉదయలక్ష్మి తెలిపారు. ఏలూరు ఇరిగేషన్ అతిథి గృహంలో బుధవారం ఐటీడీఏ అధికారులతో గిరిజన హాస్టల్స్ అభివృద్ధి, సురక్షిత తాగునీరు సరఫరా తదితర అంశాలపై ఆమె సమీక్షించారు. ప్రభుత్వం ఈ ఏడాది గిరిజనుల కోసం రూ.100 కోట్లకు పైగా నిధులు వెచ్చించడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో సురక్షిత తాగునీరు సరఫరా, పూర్తిస్థాయి అక్షరాస్యత సాధించే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. మారుమూల కొండ ప్రాంతాల్లో వాటర్ గ్రిడ్ల ఏర్పాటుచేసే విషయంలో సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నామని తెలి పారు. రాష్ట్రంలో పాడేరు, పార్వతీపురం, రంపచోడవరం, కోటరామచంద్రపురం తదితర ఏజెన్సీ ప్రాంతాల్లో తాగునీటి పరిస్థితులు, సురక్షిత నీటి సరఫరాకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా దృష్టి పెట్టామన్నారు.
 
 రెసిడెన్షియల్ స్కూల్స్‌గా గిరిజన హాస్టల్స్
 గిరిజన హాస్టల్స్‌ను ద శలవారీగా రెసిడెన్షియల్ స్కూల్స్‌గా మార్చి కార్పొరేట్ విద్య అందిస్తామని ఆమె చెప్పారు. పోటీ పరీక్షలకు గిరిజన యువతను సన్నద్ధం చేయడమే తమ లక్ష్యమన్నారు. గతేడాది ఇద్దరు గిరిజన విద్యార్థులు ఐఐటీకి, 35 మంది నిట్‌కు ఎంపికయ్యారని చెప్పారు. ఒకటో తరగతి నుంచి పీజీ వరకు స్కాలర్‌షిప్‌లు అందిస్తూ వారిలో పోటీతత్వాన్ని పెంపొందిస్తున్నామన్నారు. జిల్లా ఏజెన్సీలో గిరిజన హాస్టల్స్‌ను ఆశ్రమ పాఠశాలలుగా తీర్చిదిద్దడానికి చేపట్టిన ప్రణాళికల మ్యాప్‌లను ఉదయలక్ష్మి పరిశీలించారు. ఐటీడీఏ పీవో రామచంద్రారెడ్డి, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement