మినరల్ వాటర్ పంపిణీ సాధ్యమేనా!
ఏలూరు :గ్రామాలకు శుద్ధి చేసిన నీటిని పూర్తిస్థాయిలో ఇవ్వలేని ప్రభుత్వానికి మినరల్ వాటర్ ఇవ్వటం సాధ్యమైవుతుందా అనే అనుమానాలు వెన్నాడుతున్నాయి. నీటి వ్యాపారంలో తెలుగు తమ్ముళ్లకు తలుపులు బార్లా తీసి నిర్వహణ బాధ్యతలను అప్పగించటానికే ఎన్టీఆర్ సుజల స్రవ ంతి పథకాన్ని టీడీపీ తెరపైకి తీసుకొచ్చిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకాల ద్వారా శుద్ధి చేసిన నీటిని జనాభా నిష్పత్తిలో ఏ గ్రామాలోను ఇవ్వలేకపోతున్నారు. ఇందుకుగాను వనరులు పెంపు కోసం ప్రయత్నాలు చేస్తున్నా అవి గ్రామీణుల గొంతులను పూర్తిగా తడపటం లేదు. జిల్లాలో 2వేల 158 నివాసిత ప్రాంతాలకుగాను 1,292 ప్రాంతాలకు మాత్రమే పూర్తిస్థాయిలో తాగునీటిని అందిస్తున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పాక్షికంగా నీరందుతున్న గ్రామాలు 790 ఉన్నాయి.
సురక్షిత నీటి వనరులు లేని గ్రామాలు 76 ఉన్నాయి. 11 సమగ్ర మంచినీటి పథకాల నిర్వహణ ద్వారా సుమారు 100 గ్రామాలకు సురక్షిత నీరందిస్తున్నారు. ఇంకా పూర్తికాని మంచినీటి ప్రాజెక్టులు 15 వరకు ఉండగా, వాటికి చేయాల్సిన ఖర్చు రూ.150 కోట్ల పైమాటే. ఈ పథకాల నిర్మాణం ఏళ్ల తరబడి సాగుతూనే ఉంది. వీటి నిర్మాణాల్లో జాప్యం కారణంగా ప్రతి ఏటా వేసవిలో నీటి ఎద్దడితో 170 గ్రామాల వరకు అల్లాడుతున్నాయి. అలాంటి గ్రామాలకు మోక్షం కలిగించే నిర్ణయాలే మీ తీసుకోకుండా గ్రామాల్లో ఎన్టీఆర్ సుజల స్రవంతి కింద రూ.2లకే 20 లీటర్లను అందిస్తామని ప్రభుత్వం నమ్మబలుకుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయాలంటే స్థలం కావాలి. ఒక్కొక్క ప్లాంటు ఏర్పాటుకు కనీసం రూ.20లక్షల వ్యయమవుతుంది. ఇంత చేసి వీటిని ఏర్పాటుచేస్తే అందరికీ మినరల్ వాటర్ ఇవ్వటం సాధ్యమా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
పుట్టగొడుగుల్లా వెలిసిన ప్లాంట్ల మాటేమిటి?
జిల్లాలో 884 గ్రామ పంచాయతీలలో సుమారు 350కు పైగా మినరల్ వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. వీటి ఏర్పాటుకు చాలా చోట్ల విరాళాల రూపంలో నిధులు సమీకరించారు. వాటర్‌ప్లాంట్ల నిర్వాహకులు ఐదేళ్లపాటు వాటిపై వ్యాపారం చేసుకున్న తర్వాత వాటిని పంచాయతీలకు వదిలేసి వెళ్లాలన్న నిబంధన ఉంది. ఈ ప్లాంట్ల నిర్వహ ణను తనిఖీ చేయాల్సిన ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. వాటర్ ప్లాంట్ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా నీటిని విక్రయిస్తూ ప్రజలను దోచుకుంటున్నారన్న విమర్శలున్నాయి. మూడేసి ప్లాంట్లు ఉన్న పంచాయతీలు కూడా ఉన్నాయి.
కాగా ప్రభుత్వం మినరల్ వాటర్ అందించేందుకు కొత్తగా ప్లాంట్లు ఏర్పాటు చేస్తుందా? ఉన్న వాటినే తన అధీనంలోకి తీసుకుంటుందా? అనే విషయాలు చర్చనీయాంశమయ్యాయి. ఆర్వో ప్లాంటు జిల్లాలో ఎన్ని ఉన్నాయి, వాటి స్థితిగ తులు, ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్యాల్లో నడుస్తాయా? దీనికి చెల్లించే విద్యుత్ టారిఫ్ వివరాలను ఓ ఫ్రొఫార్మాలో అందించాలని ప్రభుత్వం నుంచి సర్క్యులర్ జిల్లా గ్రామీణ నీటిసరఫరా విభాగం( ఆర్ డబ్ల్యుఎస్) అధికారులకు అందిందని విశ్వసనీయ సమాచారం. వారు వివరాలు సేకరిస్తున్నారు. సుజల స్రవంతి పథకం అమలుపై ఈనెల 30న మంత్రి వర్గ ఉపసంఘం 13 జిల్లాల్లోని ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఈలు, ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనుంది. ఆ రోజు మార్గదర్శకాలను ఖరారు చేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.