వాటర్ ప్లాంట్లకు తాళం
Published Fri, Jan 10 2014 1:17 AM | Last Updated on Sat, Sep 2 2017 2:26 AM
సాక్షి, చెన్నై: రాష్ట్ర రాజధాని నగరంలో మినరల్ వాటర్ క్యాన్ల సరఫరా ఆగింది. 250 మినరల్ వాటర్ ప్లాంట్లకు తాళం వేస్తూ పర్యావరణ ట్రిబ్యునల్ ఆదేశాలు వెలువరించింది. ట్రిబ్యునల్ తీర్పును నిరసిస్తూ యాజమాన్యాలు ఆందోళన బాట పట్టడంతో క్యాన్ల ధరకు రెక్కలు రానున్నాయి. లారీల ద్వారా తాగు నీటిని సరఫరా చేయడానికి నీటి పారుదల శాఖ చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో ఇటీవల మినరల్ వాటర్ క్యాన్ల వాడకం పెరుగుతోంది. ఇళ్లలోనూ, కార్యాలయాలు, హోటళ్లలో తాగునీరుగా మినరల్ వాటర్ క్యాన్లను ఉపయోగిస్తున్నారు.
దీంతో రాష్ట్రంలో పుట్టగొడుగుల్లా మినరల్ వాటర్ ఉత్పత్తి సంస్థలు పుట్టుకొచ్చాయి. ప్రభుత్వ అనుమతితో కొన్నిసంస్థలు శుద్ధీకరించిన నీటిని అందిస్తుండగా, మరి కొన్ని సంస్థలు ధనార్జనే ధ్యేయంగా శుద్ధీకరించకుండానే ముందుకు సాగుతున్నాయి. చెన్నైలో ప్రతి ఇంటా తప్పనిసరిగా వాటర్ క్యాన్లను ఉపయోగించాల్సిన పరిస్థితి. దీంతో నగర శివారుల్లో కోకొల్లలుగా వెలసిన మినరల్ వాటర్ ప్లాంట్లు పోటీ పడి విక్రయాలు చేస్తున్నాయి. అయితే, శుద్ధీకరించకుండా క్యాన్ల విక్రయం, భూగర్భజలాల దోపిడీపై పర్యావరణ ట్రిబ్యునల్ ఇటీవల దృష్టి కేంద్రీకరించింది. రాష్ట్రంలో సాగుతున్న నీటి వ్యాపారంపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
నివేదిక: దీంతో అధికారులు రాష్ట్రవ్యాప్తంగా జల దోపిడీకి పాల్పడుతూ సొమ్ములు చేసుకుంటున్న మినరల్ వాటర్ క్యాన్ సంస్థలపై పడ్డారు. అనుమతులు లేవని గుర్తించి కొన్ని సంస్థలను సీజ్ చేశారు. ఈ వ్యవహారంతో గతంలో యాజమాన్యాలు ఆందోళన బాట పట్టడంతో చెన్నై మహానగరంలో వాటర్ క్యాన్ల సరఫరా ఆగింది. బ్లాక్ మార్కెట్లో రూ.వంద నుంచి రూ.150 వరకు పలికారుు. ఎట్టకేలకు కొరడా ఝుళిపించిన అధికారులు పూర్తి స్థాయిలో పరిశీలనల అనంతరం నివేదిక సిద్ధం చేశారు. ఈ నివేదికను గురువారం పర్యావరణ ట్రిబ్యునల్ ముందు ఉంచారు.
రాష్ట్ర ప్రజా పనుల శాఖ అధికారి రామన్ నేతృత్వంలోని బృందం సమర్పించిన నివేదికను ట్రిబ్యునల్ పరిశీలించింది. రాష్ట్ర వ్యాప్తంగా 857 మినరల్ వాటర్ క్యాన్ల ఉత్పత్తి సంస్థలు ఉన్నట్టు తేల్చారు. 252 సంస్థలకు బోరు బావుల ద్వారా నీటిని తోడుకునే అనుమతి ఉందని, అయితే, అదే సంస్థల పరిధిలో ఉన్న మరో 527 సంస్థలకు అనుమతులు లేవని స్పష్టం చేశారు. చెన్నైలో 33 సంస్థలు మెట్రో వాటర్ బోర్డు నీటిని ఉపయోగించుకుంటున్నాయని వివరించారు. నివేదికను పరిశీలించినానంతరం ఆ 252 సంస్థలకు తాళం వేయాలని ఆదేశించారు. దీంతో ఆ సంస్థలతో పాటుగా 527 సంస్థల్లో వాటర్ క్యాన్ల ఉత్పత్తి ఆగింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 13కు ట్రిబ్యునల్ వాయిదా వేసింది. అంత వరకు ఆ సంస్థలకు తాళం వేయాల్సిందేనని ఆదేశాలు వెలువడటంతో మినరల్ వాటర్ క్యాన్ల యాజమానుల సంఘాన్ని ఆందోళనలో పడేసింది.
ఆగిన సరఫరా: ట్రిబ్యునల్ తీర్పుతో ఆయా సంస్థల్లో క్యాన్ల ఉత్పత్తి ఆగింది. వాటర్ క్యాన్ల సరఫరాను నిలుపుదల చేస్తూ యాజమాన్య సంఘం నాయకుడు ఎల్ లోకేష్ ప్రకటించారు. అన్ని సంస్థలు ఉత్పత్తిని నిలుపుదల చేసి ఆందోళన బాట పట్టినట్లు తెలిపారు. అన్ని రకాల అనుమతులతో తాము క్యాన్లను సరఫరా చేస్తుంటే, కొత్తగా మెలికలు పెట్టడం, సంబంధం లేని సంస్థలను తమకు అంట కట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అనుమతులు లేని సంస్థలపై చర్యలు తీసుకోవాలని, అయితే, అనుమతులు ఉన్న సంస్థలకు తాళం వేయడాన్ని తప్పుబడుతున్నామన్నారు. తాము ఆందోళన బాట పట్టిన దృష్ట్యా, ఇక వాటర్ క్యాన్ల సరఫరా ఆగినట్టేనని ప్రకటించారు. వీరి ఆందోళన పుణ్యమా నగరంలో వాటర్ క్యాన్లకు డిమాండ్ ఏర్పడబోతుంది. చాపకింద నీరులా వాటర్ క్యాన్ల సరఫరా జరగడం తథ్యమని, అదే సమయంలో ధర పెరగడం ఖాయం అని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లారీల ద్వారా సరఫరా: వాటర్ క్యాన్ల సరఫరా ఆగడంతో లారీల ద్వారా తాగునీటిని ప్రజలకు సరఫరా చేయడానికి మెట్రో వాటర్ బోర్డు నిర్ణయించింది. ఆగమేఘాలపై ఇందుకు తగ్గ చర్యలు తీసుకుంటున్నారు. నగర శివారుల్లోని వ్యవసాయ బావులను అద్దెకు తీసుకుని రోజుకు నాలుగు కోట్ల లీటర్ల తాగునీటిని అందించడంతో పాటుగా, నైవేలిలో అదనపు బోరు బావుల ఏర్పాటుకు నిర్ణయించారు.
Advertisement
Advertisement