మా హీరో బావకు మామంచి మెడిసిన్! | Our good Medicine to Bava our hero! | Sakshi
Sakshi News home page

మా హీరో బావకు మామంచి మెడిసిన్!

Published Wed, Jul 2 2014 12:31 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

మా హీరో బావకు మామంచి మెడిసిన్! - Sakshi

మా హీరో బావకు మామంచి మెడిసిన్!

సరదాగా...
చాలా రోజుల తర్వాత మా బావ దిగులుగా బజార్లో తిరుగుతూ కనిపించాడు.
 ‘‘తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి. ఏ లోటూ లేకుండా బతుకుతున్నావు.  ఇంకా ఏంటి, ఇంకా ఏం కావాలి బావా నీకు?’’ అని అడిగా.
 ‘‘ఏం బతుకులే... మొన్న ఆసుపత్రికి పోతే పరామర్శకు ఎవరూ రాలేదు. నా కోరిక ఏమిటంటే... నాకు జలుబు చేసి హాస్పిటల్‌కు వెళ్లానని తెలియగానే... ఆసుపత్రి ముందు ఇసకేస్తే రాలనంతగా జనం పోగవ్వాలి. కిటకిటలాడిపోతున్న ఆ జనసందోహమంతా ముక్తకంఠంతో ‘అన్నా... ఆసుపత్రిలో చేరావా అన్నా? డాక్టర్... డాక్టర్... ఏమైంది మా అన్నకు? ఒక్కసారి మా అన్నను మాకు చూపించండి డాక్టర్’ అంటూ అరవాలి. పోలీసులు బారికేడ్లు కట్టి ముందుకు నెడుతున్నా తోసుకొస్తున్న జనం... ‘పోనివ్వండి... మా అన్నను చూడాలి. డాక్టర్... ముక్కు మార్పిడి సర్జరీ చేయాల్సి వస్తే నా ముక్కు తీస్కోండి డాక్టర్...’ అంటూ జనం అరవాలి. నా జలుబు తగ్గాలంటూ సర్వమత ప్రార్థనలు జరగాలి.

 నా అభిమానుల్లో ఒకరు కర్చిఫ్‌ల లాట్‌ను లారీ మీద వేసుకురావాలి. ‘వదలండి... ఈ కర్చిఫ్‌లను మా అన్నకు ఇవ్వనివ్వండి’ అంటూ ఆ అభిమాని విలవిలలాడుతూ డాక్టర్లనూ, పోలీసులనూ ప్రాధేయపడుతుండాలి. దాంతో డాక్టర్లు నన్ను చక్రాల కుర్చీలో కూర్చోబెట్టి ఆసుపత్రి బాల్కనీ మీద నుంచి నావాళ్లకు చూపించాలి. నేనెంత ట్రై చేసినా ఇది కుదరడం లేదురా’’ అంటూ వాపోయాడు.
 
‘‘హీరోలా కనిపించడం కోసం మరి నువ్వేదో ఇతోధిక కృషి, అత్యధిక శ్రమా చేస్తున్నావటగా, ఏమిటవి?’’ అని అడిగా.
 ‘‘ఇంట్లో అటు మొక్కలకూ, ఇటు కుక్కలకూ మినరల్ వాటర్ పోస్తున్నా. మొన్న మా పెంపుడు కోడికి కాలు బెణికి కుంటుతుంటే... నా హీరోయిన్ అయిన మీ అక్క ముందు దానికి జండూబామ్ రాశా. దీనికి నా ఇంటి హీరోయిన్ అయిన మీ అక్క నావైపు ఆరాధనగా చూడాలి కదా! కానీ ఇవేం పనులంటూ ముక్కచివాట్లు పెట్టింది’’ అన్నాడు బావ.
       
 ఒకే ఒక్క మాటతో మా బావ హీరో అయ్యేలాగా, పనిలోపనిగా ఆయన కోరిక కూడా తీరేలా చేశాం. ఓ ఫ్రెండ్ సలహా మేరకు మా బావతో గొడవపడ్డట్టు నటించాం. మా అక్కను మా ఇంటికి తీసుకెళ్లాం. మాకు సలహా ఇచ్చిన ఫ్రెండే మా బావ దగ్గరికి వెళ్లి ‘నీ పెళ్లాన్ని నువ్వు తెచ్చుకో’’ అంటూ  రెచ్చగొట్టాడు. దాంతో మా బావ వచ్చి మా అక్కను హీరోలా లాక్కెళ్లాడు. మా అక్క కోసం మేమంతా బావ మాట వింటామని ఆయనకు మాటిచ్చాం. ఆ రోజునుంచి మా బావతో మేం తరచూ అంటున్న మాట... ‘‘మన రెండు కుటుంబాలనూ కలిపిన  హీరోవు బావా నువ్వు’’. ఈ మాటే మా పాలిట తారక మంత్రం... మా బావ పాలిట మాంఛి మెడిసిన్. తెలుగు సినిమాలు అంతగా తెలియని మాకు ఆ తర్వాత  తెలిసిందేమిటంటే... ఇలా సయోధ్య లేకుండా కొట్టుకునే రెండు కుటుంబాలను కలపడం అన్నది హీరోలే చేస్తారట!    - యాసీన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement