పర్యావరణ పరిరక్షణతో పాటూ ప్లాస్టిక్ ద్వారా కలుగుతున్న కాలుష్యాన్ని నివారించే దిశగా నగరంలోని హోటల్స్‌లో పలు మార్పు చేర్పులు చేపట్టారు. ఇందులో భాగంగా హోటల్‌లో తాగునీటిని అందించడానికి వినియోగిస్తున్న ప్లాస్టిక్ సీసాలను పూర్తిగా తొలగించి వాటి స్థానంలో గాజు సీసాలను వినియోగించాలని నిర్ణయించారు. నగరంలోని ఆతిథ్యరంగంలో మంచి మార్పునకు ఇది దోహదం చేయనుంది.
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం హోటళ్లలో అతిథులకు ప్లాస్టిక్ సీసాల్లో నీరు సరఫరా చేస్తున్నారు. అయితే ఒకసారి వాడేసిన ప్లాస్టిక్ బాటిళ్లను తిరిగి కొత్తగా మార్చి వినియోగించలేక పోవడం ఒక ఎత్తయితే మరోవైపు వినియోగించిన వాటిని ధ్వంసం చేయడం కూడా ఎంతో క్లిష్టమైన, కష్టసాధ్యమైన పని. దీంతో ఇవి తీవ్రస్థాయి పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్నాయి. వీటిని నియంత్రించడానికి గాజు బాటిళ్లు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి. ఈ గ్లాస్ బాటిళ్లను వాడేసినప్పటికీ తిరిగి మళ్లీ వినియోగించడం సాధ్యమవుతుండడంతో సిటీలోని కొన్ని హోటల్స్ వీటినే ఎంచుకుంటున్నాయి.
ఆటోమేటిక్‌గా.. ఆరోగ్యకరంగా..
దీని కోసం తక్కువ మానవ ప్రమేయంతో పూర్తిగా ఆటోమేటిక్‌గా నడిచే ఓ అత్యాధునిక వాటర్ ప్లాంట్‌ను హోటల్స్‌లో అమర్చుకుంటున్నారు. తద్వారా హోటల్ అవసరాలకు సరిపడా పూర్తిగా శుభ్రపరచబడిన ఆల్కలైన్ మినరల్ వాటర్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ఆల్కలైన్ మినరల్ వాటర్ మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వీరు చెబుతున్నారు.
పూర్తి ఐఓటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) టెక్నాలజీ ఆధారంగా పనిచేసే ఈ యంత్రం తన ఫిల్టర్ వినియోగాన్ని పూర్తిగా నియంత్రిస్తూ అత్యంత శుభ్రమైన తాగు నీటిని అందిస్తుంది. ఇలా తయారు చేసిన తాగు నీటిని మళ్లీ తిరిగి వినియోగించే వీలున్న రీ యూజబుల్ గాజు సీసాల ద్వారా అతిథులకు అందజేస్తున్నారు. నాలుగు దశలలో ఈ వాటర్ ప్లాంట్ పని చేస్తుంది.
ముందుగా సాధారణ తాగు నీటిని పూర్తిగా శుభ్రపరచి సురక్షితమైన ఆల్కలైన్ మినరల్ వాటర్‌గా తయారు చేస్తుంది. అనంతరం యంత్రంలో ప్రవేశ పెట్టిన తాగునీటి గాజు సీసాలను పరిశుభ్రపరచి, పూర్తిగా పొడిగా మార్చిన తర్వాత వాటిలో ఈ ఆల్కలైన్ మినరల్ వాటర్‌ను నింపుతారు. ఇలా నింపిన గ్లాసు బాటిల్స్‌ను హోటల్‌లోని గెస్ట్ రూమ్‌లు ఇతరత్రా ప్రదేశాలలో తాగు నీటిగా వినియోగించడానికి అందిస్తారు.
రోజుకు 1500 బాటిళ్ల నీరు ఉత్పత్తి...
ఆకార్ హోటల్స్ గ్రూప్ పూర్తి పర్యావరణ హితంగా హోటల్స్‌ను మార్చాలని నిర్ణయించింది. అందులో భాగంగానే ప్లాస్టిక్ బాటిళ్ల నివారణకు గాను మా హోటల్‌లో సరికొత్త వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశాం. దీని ద్వారా రోజూ 1500 గ్లాసు బాటిళ్ల నీటిని అంటే సుమారు 300 లీటర్లను అతిథులకు సరఫరా చేయవచ్చు. అలానే కాలం చెల్లిన వాటిని రీ సైకిల్ చేసి సరికొత్త బాటిళ్ల తయారీలో వినియోగించవచ్చు.
–సౌమిత్రి పహారి, జీఎం, హోటల్ మెర్క్యుర్ హైదరాబాద్ కెసీపీ
Comments
Please login to add a commentAdd a comment