దవాఖానాల్లో దాహం.. దాహం
- ప్రభుత్వాసుపత్రుల్లో క‘న్నీటి’ కష్టాలు
- పేషెంట్లకు కలుషిత నీరే దిక్కు
- మినరల్ వాటర్ కొనలేని పరిస్థితి
- తీవ్ర ఇబ్బందులు పడుతున్న రోగులు
- పట్టనట్లు వ్యవహరిస్తున్న ఆసుపత్రులు
సాక్షి, సిటీబ్యూరో : నగరంలోని ప్రతిష్టాత్మక ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులు దాహంతో అల్లాడుతున్నారు. ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, నిమ్స్, సుల్తాన్‌బజార్, పేట్లబురుజు ఆస్పత్రులకు సరిపడా మంచి నీరు సరఫరా చేయక పోవడంతో ఖాళీ సీసాలు పట్టుకుని రోగుల బంధువులు రోడ్ల వెంట ఉన్న చలివేంద్రాల వైపు పరుగులు తీస్తున్నారు. కొంతమంది సొంత ఖర్చుతో మినరల్ వాటర్ బాటిళ్లు కొనుగోలు చేస్తుండగా, మరికొందరు ఆస్పత్రుల్లో సరఫరా అవుతున్న మురుగు నీరే సేవిస్తున్నారు. దీంతో ఆయా ఆస్పత్రుల సమీపంలోని దుకాణాల్లో మంచినీటి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా సాగుతోంది. అడపాదడపా సరఫరా అవుతున్న నీరు కూ డా పూర్తిగా కలుషితం అవుతోంది.
మంచినీటిలో ఈ కొలి బ్యాక్టీరియా
ఆరోగ్యం, పరిసరాల పరిశుభ్రత అంశాల్లో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాల్సిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో అప్రమత్తత లోపించింది. కాంట్రాక్టర్ల అవినీతి, అధికారుల నిర్లక్ష్యం వల్ల మంచినీటి ట్యాంకుల్లో చెత్త, మురికి పేరుకు పోతుంది. దీంతో రోగులకు సరఫరా చేస్తున్న మంచి నీటిలో ‘ఈ కోలీ బ్యాక్టీరియా’ ఉన్నట్లు ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం) తాజాగా నిర్వహించిన పరీక్షల్లో వెల్లడైంది. ఈ నీటిని తాగడంతో రోగులతో పాటు వారి వెంట వచ్చిన బంధువులు అనారోగ్యం పాలు కావాల్సి వస్తోందని పేర్కొంది.
రోజుల తరబడి శుభ్రం చేయని సంపులు
రోగులు, వైద్యులు, సిబ్బంది తాగునీటి అవసరాల కోసం ఉస్మానియా ఆసుపత్రిలో 14 సంపులను ఏర్పాటు చేశారు. వీటిలో చా లా వాటికి మూతల్లేవు. చెట్ల ఆకులు, దుమ్ము, ధూళి ట్యాంకుల్లో చేరడంతో నాచు పేరుకుపోతోంది. దీనికి తోడు బోరు నీరు కూడా కలుస్తుంది. ఏడాదైనా వీటిని శుభ్రం చేయకపోవడంతో నీరు కలుషితమవుతోంది. ఇలా కలుషితమైన నీటిని తాగడంతో గత ఏడాది ఇదే ఆసుపత్రిలోని 40 మంది నర్సింగ్ విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. అప్రమత్తమైన అధికారులు అప్పట్లో ట్యాంకులను క్లీన్ చేయించినప్పటికీ, ఆ తర్వాత వీటి నిర్వహణను పూర్తిగా మరిచిపోయారు. తాజాగా ఓ రోగికి చెందిన ఇద్దరు బంధువులు ఈ నీటిని తాగడంతో వాంతులు, విరేచనాలతో ఆసుపత్రిలో చేరారు.
బ్లీచింగ్ కూడా కొరతే
ఛాతీ ఆసుపత్రిలోని మంచినీటి ట్యాంకు పరిసరాలు, వంటగది అపరిశుభ్రంగా ఉన్నాయి. అదేవిధంగా ఎర్రగడ్డ మానసిక చికిత్సా లయంలోని నీటి ట్యాంకుల వద్ద మురుగు నీరు చేరుతుంది. నిలోఫర్, పేట్లబురుజు ప్రసూతి ఆసుపత్రిలో పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. ఇక్కడ సరఫరా అవుతున్న మంచినీటిలో కోలీఫామ్ బ్యాక్టీరియా అధికంగా ఉన్నట్లు ఐపీఎం పరీక్షల్లో తేలింది. ప్రతి ఆరు మాసాలకోసారి బ్లీచింగ్‌తో ట్యాంకులను శుభ్రం చే యడంతో పాటు, ప్రతి నెలా నీటిని పరీక్షించాల్సి ఉంది. కానీ కాంట్రాక్టర్లు వీటిని అసలు పట్టించుకోవడం లేదు. అయితే ఆసుపత్రుల్లో బ్లీచింగ్ లేకపోవడం వల్లే ట్యాంకుల జోలికి వెల్లడం లేదని సిబ్బంది పేర్కొం టుంది. ఫలితంగా అనేక మంది రోగులు, వారి తరుపు బంధువులు వాంతులు, విరేచనాలతో బాధ పడుతూ ఆసుపత్రుల్లో చేరుతున్నారు.