సమ్మె ఉధృతం
- అత్యవసర సేవలను బహిష్కరించిన జూడాలు
- స్తంభించిన వైద్యసేవలు
- వెనుదిరుగుతున్న రోగులు
సాక్షి, సిటీబ్యూరో: జూనియర్ డాక్టర్ల సమ్మెతో నగరంలో అత్యవసర వైద్యసేవలు స్తంభించిపోయాయి. ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఈఎన్‌టీ, సరోజినిదేవి, సుల్తాన్‌బజార్, పేట్లబురుజు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం అందక రోగులు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. ఆపదలో అత్యవసర విభాగానికి చేరుకున్న క్షతగాత్రులు, హృద్రోగులు, గర్భిణులకు సకాలంలో వైద్యం అందక మృత్యువాత పడుతున్నారు. అత్యసర విభాగాల్లో నిపుణులు లేకపోవడంతో వచ్చిన రోగులకు ఇతర ఆస్పత్రులకు తిప్పిపంపుతున్నారు.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆర్.లక్ష్మణ్ (48) ఉదయం అల్పాహారం తీసుకున్న తర్వాత చాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో బంధువులు చికిత్స కోసం 108లో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తీసుకువచ్చారు. తీరా అక్కడికి చేరుకున్న తర్వాత వైద్యం అందక ఆయన మృతి చెందాడు.
సకాలంలో వైద్యం అందకపోవడం వల్లే రోగి మృతి చెందినట్లు బంధువులు ఆరోపించారు. 107 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 15రోజులుగా సాధారణ విధులను బహిష్కరించిన జూడాలు తాజాగా అత్యవసర సేవలనూ నిలిపివేసిన విషయం తెలిసిందే. గ్రేటర్ నలుమూలల నుంచే కాకుండా తెలంగాణ జిల్లాల నుంచి చికిత్స కోసం గురువారం ఉదయం ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఈఎన్‌టీ, సరోజినిదేవి, సుల్తాన్‌బజార్, పేట్లబురుజు ప్రభుత్వ ఆస్పత్రులకు చేరుకున్న రోగులకు కనీస వైద్యసేవలు అందక పోవడంతో వారు నిరాశతో వెనుతిరుగాల్సి వస్తోంది .
ఓపీ సేవలు అందించడంలో తీవ్ర జాప్యం జరగడంతో రోగులు గంటల తరబడి క్యూలో నిలబడుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టినట్లు ప్రభుత్వం చెప్పుతున్నప్పటికీ ఆచరణలో అవి కన్పించడం లేదు. అత్యవసర విభాగాల్లో యునానీ, ఆయుర్వేద వైద్యులతో పాటు 108 సిబ్బందే రోగులకు వైద్యపరీక్షలు నిర్వహించారు
ఉస్మానియా వైద్య కళాశాలలో...
జూడాల సమస్యలు పరిష్కారించపోతే తమ ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని జూడాల సంఘం అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గురువారం ఉస్మానియా వైద్యకళాశాల ఆవరణలో 18వ రోజు జూడాలు తమ ఆందోళన కొనసాగించారు. రక్తంతో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించి వినూత్న పద్ధతిలో నిరసన తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో పనిచేయాలనే 107 జీవో ప్రతులను వారు హోమగుండంలో వేసి దహనం చేశారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి పెద్ద పెట్టున ప్రభుత్వానికి, డిఎంఈకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.