కీళ్లనొప్పులతో బాధపడుతున్న రోగులకు నిమ్స్‌లో నిలువుకాళ్ల జపం తప్పట్లేదు. ఓపీ టోకెన్ కోసం అర్ధరాత్రి 2 గంటలకే ఆస్పత్రికి చేరుకుని క్యూలైన్‌లో నిలబడాల్సి వస్తోంది. నొప్పుల బాధను దిగమింగుకుని గంటల తరబడి క్యూలైన్‌లో నిలబడ్డా.. తీరా ఓపీ వేళకు నిరాశే మిగులుతోంది. రోగుల నిష్పత్తికి తగినంత మంది వైద్యులు లేకపోవడమే ఇందుకు కారణమని చెబుతున్నారు.
సాక్షి, హైదరాబాద్
దేశంలోనే ప్రత్యేక గుర్తింపు
నిమ్స్ ఆస్పత్రికి కీళ్ల నొప్పులతో బాధపడే రోగులు రోజుకు దాదాపు 150 మందికిపైగా వస్తుంటారు. అయితే 60 మంది రోగులకు మించి వైద్య సేవలు అందించలేని పరిస్థితి అక్కడ నెలకొంది. కీళ్లనొప్పుల బాధితుల కోసం 1994లో ప్రత్యేకంగా రుమటాలజీ ఓపీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రొఫెసర్ జి.నరసింహులు ఆస్ట్రేలియాకు వెళ్లి ప్రత్యేక శిక్షణ పొంది వచ్చారు. అప్పటివరకు ప్రైవేటులో ఎక్కడా రుమటాలజీ వైద్యుల్లేకపోవడంతో ఆస్పత్రికి రోగుల తాకిడి పెరిగింది. దీంతో 2001లో రుమటాలజీ విభాగం కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. అయితే రోగుల నిష్పత్తికి తగినంత మంది వైద్యులు లేకపోవడంతో మరింత మంది స్పెషలిస్టులను తయారు చేసేందుకు 2005లో డీఎం రుమటాలజీ కోర్సు ఏర్పాటు చేయగా, 2007లో దీనికి గుర్తింపు లభించింది. అనేక పరిశోధనలు, మెరుగైన వైద్యసేవలు, అత్యుత్తమ వైద్యవిద్య బోధనతో దేశంలోనే ఓ వెలుగు వెలిచిన రుమటాలజీ విభాగం ప్రస్తుతం కనీస వైద్యసేవలు అందించలేకపోతోంది.
ఒక్కొక్కరూ వీడిపోవడంతో
ప్రొఫెసర్ నరసింహులు కూడా పదవీ విరమణ చేసిన తర్వాత రోగుల నిష్పత్తికి తగ్గట్లు ఆ విభాగాన్ని అభివృద్ధి చేయకపోవడం, అంతర్గత కుమ్ములాటలు, నిమ్స్‌తో పోలిస్తే కార్పొరేట్ ఆస్పత్రుల్లో వేతనాలు రెట్టింపు స్థాయిలో ఉండటంతో వైద్యులు ఒక్కొక్కరుగా ఆస్పత్రిని వీడారు. ఇప్పటివరకు ఇక్కడ 45 మంది వరకు రుమటాలజీ సూపర్ స్పెషాలిటీ కోర్సు పూర్తిచేయగా, వీరి సేవలను వినియోగించుకోవడంలో పాలక మండలి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఉస్మానియా, గాంధీ సహా జిల్లా కేంద్రాల్లోనూ రుమటాలజీ వైద్యుల్లేకపోవడం, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఈ చికిత్సలు ఖరీదు కావడం, కార్పొరేట్ ఆస్పత్రులతో పోలిస్తే నిమ్స్‌లో మరింత మెరుగైన వైద్యం అందుతుందనే నమ్మకంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు. 2011 వరకు ఐదుగురు ఫ్యాకల్టీ వైద్యులు ఉండేవారు. ప్రస్తుతం ఇద్దరికి పడిపోయింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓపీ వేళలు కొనసాగుతుండటం, రోగుల నిష్పత్తికి తగినంత మంది వైద్యులు లేకపోవడంతో రోజుకు సగటున 60 మందికి మించి చూడలేకపోతున్నారు. ఎలాగైనా ఇక్కడ వైద్యం చేయించుకోవాలనే ఆశతో అర్ధరాత్రి రెండు గంటలకే ఓపీ కౌంటర్‌కు చేరుకుంటున్నారు. తీరా ఉదయం టోకెన్లు దొరక్క తీవ్ర నిరాశతో వెనుదిరుగుతున్నారు.
ఖాళీ పోస్టులు భర్తీ చేయకపోవడం వల్లే..
కీళ్లవాతం బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రోగుల నిష్పత్తికి తగినంత మంది వైద్యుల్లేరు. ఢిల్లీలోని ఎయిమ్స్ సహా కింగ్‌జార్జ్, కోల్‌కతా, చండీగఢ్, వేల్లూర్, ముంబై, నిమ్స్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ల నుంచి ఏటా 45 మంది మాత్రమే సూపర్ స్పెషాలిటీ వైద్యులు బయటికి వస్తున్నారు. రుమటాలజీలో సూపర్ స్పెషాలిటీ పూర్తి చేసిన వైద్యులకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో భారీ డిమాండ్ ఉంది. వేతనం కూడా నిమ్స్‌లో కన్నా రెట్టింపు ఉంది. పాలకులు ఖాళీ పోస్టులను భర్తీ చేయకపోవడం, రోగుల నిష్పత్తికి తగినంత మంది వైద్యులు లేకపోవడం వల్ల నిమ్స్ సహా ఇతర ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేస్తున్న కొందరిపైనే భారం పడుతోంది.
–ప్రొఫెసర్ జి.నరసింహులు, విశ్రాంత వైద్యుడు, నిమ్స్
Comments
Please login to add a commentAdd a comment