సుజలం విఫలం | Campaign promise Government neglated | Sakshi
Sakshi News home page

సుజలం విఫలం

Published Sat, Mar 19 2016 5:02 AM | Last Updated on Thu, May 24 2018 2:05 PM

సుజలం విఫలం - Sakshi

సుజలం విఫలం

మినరల్ వాటర్‌కు నోచుకోని గ్రామాలు
ఎన్నికల హామీని గాలికొదిలేసిన ప్రభుత్వం
డిప్యూటీ సీఎం ప్రారంభించిన మూడు ప్లాంట్లూ మూత
కరెంటు బిల్లులు చెల్లించక సరఫరా నిలిపివేత
జిల్లాలో ఏర్పాటు చేసిన ప్లాంట్లు 25
ప్రస్తుతం మిగిలినవి 2 మాత్రమే

 
 సాక్షి ప్రతినిధి, కర్నూలు: ప్రతి గ్రామానికీ మినరల్ వాటర్ అందిస్తామని ఎన్నికల సమయంలో వాగ్దానం చేసిన అధికార పార్టీ.. ఎన్నికల తర్వాత ఆ హామీని అటకెక్కించింది. ఎన్టీఆర్ సుజల పథకం కింద ఇప్పటివరకు జిల్లాలో 25 ఆర్‌ఓ ప్లాంట్లను మాత్రమే ఏర్పాటు చేసింది. అయితే, ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్లలో ఏకంగా 23 మూతపడగా.. కేవలం 2 ప్లాంట్లు మాత్రమే నడుస్తున్నాయి. డిప్యూటీ సీఎం సొంత నియోజకవర్గం పత్తికొండలో ఆయన చేతుల మీదుగా ప్రారంభించిన మూడు ప్లాంట్లు మూతపడటం గమనార్హం. వాస్తవానికి జిల్లాలోని అన్ని గ్రామాలకు మినరల్ వాటర్ అందించాలంటే 889 ఆర్‌ఓ ప్లాంట్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం రూ.44.45 కోట్లు అవసరమని అంచనా. అయితే, కేవలం 25 ప్రారంభించి.. ఇందులోనూ ప్రైవేటు సంస్థల నిధులు, దాతల ద్వారా ప్రారంభించినవే అధికం. వీటికి కరెంటు బిల్లులు ఇవ్వలేక.. ఏకంగా ప్లాంట్లనే మూతపడేశారు. మొత్తంగా జిల్లాలో ఎన్టీఆర్ సుజల పథకం కాస్తా పడకేసింది.

 ఒత్తిడితెచ్చి మరీ ఏర్పాటు చేసి...
వాస్తవానికి ఆర్‌ఓ ప్లాంట్ల ఏర్పాటు కోసం అధికారులు మొదట్లో నానా హైరానా పడ్డారు. కచ్చితంగా ఏర్పాటు చేయాల్సిందేనన్న ఆదేశాల నేపథ్యంలో ప్రైవేటు సంస్థల మీద ఒత్తిడి తెచ్చి మరీ ఏర్పాటు చేశారు. అయితే, వీటి నిర్వహణ మాత్రం ప్రభుత్వం గాలికి వదిలేసింది. ఆర్‌ఓ ప్లాంట్ల ఏర్పాటు కోసం దాతలు కేవలం గది ఏర్పాటు చేసుకుంటే సరిపోతుందని... మినరల్ వాటర్ యంత్ర పరికరాలను ప్రభుత్వమే సమకూరుస్తుందని అధికారులు హామీనిచ్చారు. దీంతో ప్రైవేటు సంస్థలు తమ స్థలాల్లో ఆర్‌ఓ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకొచ్చారు. తీరా ప్లాంటు ఏర్పాటైన తర్వాత.. దీనిని స్థానిక పంచాయతీకి అప్పగించాలని చెప్పడంతో మా స్థలాన్ని కూడా పంచాయతీకి ఎలా అప్పగిస్తామంటూ వాపోయారు. ప్రభుత్వం ఇచ్చిన యంత్ర పరికరాలు తీసుకెళ్లాలని ప్రైవేటు సంస్థలు కాస్తా తేల్చిచెప్పడంతో జిల్లాలో పలు చోట్ల ప్లాంట్లు మూతపడిన పరిస్థితి ఏర్పడింది.
 
 డిప్యూటీ సీఎం ప్రారంభించినా..
పత్తికొండ నియోకవర్గంలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి స్వయంగా మూడు ఆర్‌ఓ పాంట్లను ప్రారంభించారు. ఇందులో ఏ ఒక్కటీ పనిచేయడం లేదు. మూడు ప్లాంట్లు కూడా మూతపడ్డాయి. బిల్లులు కట్టకపోవడంతో కరెంటు సరఫరా నిలిపేశారు. ఫలితంగా గ్రామాలకు మంచినీరు అందించే ప్రక్రియ కాస్తా మూలకుచేరింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్లాంట్లదీ ఇదే పరిస్థితి.
 
 ప్రచారానికే పరిమితం:
 ఎన్టీఆర్ సుజల రక్షిత మంచినీటి పథకం ప్రచారానికే పరిమితమైంది. రూ.2లకే 20 లీటర్ల మంచినీటిని అందిస్తామని ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకాన్ని అమలు చేయలేకపోయారు. గ్రామంలో 2 వేలకు పైగా జనాభా కలుషితమైన నీటిని తాగి రోగాలబారిన పడుతోంది.  రామలింగ, హుళేబీడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement