Deputy Chief Minister KE Krishna Murthy
-
సీఎం లెక్క.. 42 శాతం అవినీతి
ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సాక్షి, విజయవాడ బ్యూరో/హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లెక్కల ప్రకారం రెవెన్యూశాఖలో 42 శాతం అవినీతి ఉందని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి వెల్లడించారు. అయితే శాఖ మొత్తం అవినీతిమయం అని కాకుండా ఇంకా 58 శాతం నిజాయితీగా పనిచేస్తున్న కోణంలో చూడాలని వ్యాఖ్యానించారు. రెవెన్యూ శాఖలో అందరూ ‘మహాత్మా గాంధీ’లే ఉండరని, ఇంత పెద్ద వ్యవస్థలో అక్కడక్కడ లోపాలు ఉంటాయని స్పష్టం చేశారు. రెవెన్యూ మొత్తం అవినీతిమయమనే ప్రచారం చేయడం సరికాదన్నారు. విజయవాడలోని మురళీ ఫార్చ్యూన్ హోటల్లో గురువారం సర్వే సెటిల్మెంట్శాఖ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం కేఈ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు బుధవారం నిర్వహించిన రెవెన్యూ సమీక్షా సమావేశాన్ని కూడా కొన్ని పత్రికలు వక్రీకరించాయని పేర్కొన్నారు. రెవెన్యూ అవినీతిపై కథనాలు రాసినందుకే సీఎం ఆ సమావేశాన్ని నిర్వహించారంటూ కొందరు కాలర్ ఎగరేస్తున్నారని వ్యాఖ్యానించారు. -
వలస నేత.. ఎదురీత!
► నియోజకవర్గ ఇన్‌చార్జ్‌తో కుదరని సమోధ్య ► మంత్రులకు ఫిర్యాదు ► రాజీ అంటే పార్టీ నుంచిబయటకే అంటూ హెచ్చరిక ► సీఎం వద్ద పంచాయితీ చేస్తామని బుజ్జగింపు ► టీడీపీలో భగ్గుమన్న విభేదాలు సాక్షి ప్రతినిధి, కర్నూలు: అభివృద్ధి కోసమంటూ ఇటీవలే పార్టీ మారిన ఎమ్మెల్యే అతను. అయితే ఆ నియోజకవర్గంలో టీడీపీ ఇన్చార్జ్కు అతనికి పొసగలేదు. పలు మార్లు వారు బహిరంగంగానే విమర్శలు దిగారు. ఈ నేపథ్యంలో పార్టీలో ఇమడలేక వలసనేత ఎదురీదాల్సి వస్తోంది. ఆదివారం కర్నూలులో నిర్వహించిన సమావేశంలో తన ఆవేదనను మంత్రుల ఎదుట వెళ్లగక్కారు. ‘‘ఆయనతో రాజీ అంటే నేను ఒప్పుకునేదే లేదు. అవసరమైతే పార్టీ నుంచి బయటకైనా వెళతాను కానీ కలిసి పనిచేసే ప్రశ్నేలేదు. ఆయన, ఆయన కుమారుడిపై పెట్టిన ఎస్సీ, ఎస్టీ కేసు వ్యవహారంలో నా ప్రమేయం లేదు. వేరే వాళ్లు పెట్టారు’’ అని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, జిల్లా ఇన్చార్జీ మంత్రి అచ్చెన్నాయుడుల సమక్షంలో పార్టీ మారిన ఓ ఎమ్మెల్యే ఖరాఖండిగా తేల్చిచెప్పారు. మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యే ఏ మాత్రం సమన్వయం లేకుండా ఇంకా ప్రతిపక్షంగానే వ్యవహరిస్తున్నారని మరో నేత ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మంత్రులు జోక్యం చేసుకుని.. ముఖ్యమంత్రి సమక్షంలో పంచాయితీ చేస్తామని ఇరువురి నేతలను బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఇరువురి నేతలు మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా సమావేశం నుంచి వెళ్లిపోయారు. పార్టీలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలతో పాటు జిల్లా అధికారులతో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, మంత్రి అచ్చెన్నాయుడులు ప్రభుత్వ అతిథి గృహంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. గతం నుంచి పార్టీలో ఉన్న నేతలు, తాజాగా పార్టీలో చేరిన నేతల మధ్య సయోధ్య కుదర్చడంతో పాటు అధికారులు చెప్పిన పనులు చేసే విధంగా చేసేందుకు ఉద్దేశించిన సమావేశంలో సయోధ్య ఏ మాత్రమూ కుదరలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి. అయితే, అధికారులపై మాత్రం పార్టీ నేతలు చేసిన ఫిర్యాదులపై సదరు అధికారులను పిలిపించి చెప్పిన పనులు చేయాల్సిందేనని ఇన్చార్జీ మంత్రి గట్టిగా మందలించినట్టు తెలిసింది. మాకు తెలియకుండానే బదిలీలా...! ఈ సమావేశంలో ప్రధానంగా ఉద్యోగుల బదిలీలపైనా చర్చ జరిగినట్టు సమాచారం. విద్యుత్‌శాఖలో తమకు తెలియకుండానే ఇంజినీర్లను బదిలీ చేశారని దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్ధ (ఎస్పీడీసీఎల్) ఎస్ఈని పిలిచి నిలదీశారు. ప్రధానంగా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కొద్ది మందిని మార్చాలని గంగుల ప్రభాకర్ రెడ్డి కోరినట్టు తెలిసింది. అదేవిధంగా కోడుమూరు నియోజకవర్గంలో తనకు తెలియకుండా కొంతమందిని మర్చారని పార్టీ ఇన్చార్జీ ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఇక నంద్యాల నియోజకవర్గంలో అధికారులు మాట వినడం లేదని..ఆయన మాటలు వినాల్సిన అవసరం లేదని జిల్లా బాధ్యుడే చెబుతున్నారని ఇన్చార్జీ మంత్రి దృష్టికి ఇంకో నేత ఫిర్యాదు చేసినట్టు సమాచారం. అంతకు ముందు జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలోనూ ఇదే తరహాలో ఒకరికొకరు ఫిర్యాదు చేసుకున్నట్లు తెలిసింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ విజయమోహన్, జేసీ హరికిరణ్, ఎస్పీ రవికృష్ణతో పాటు అధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి, పార్టీ నేతలు బీసీ జనార్దన్ రెడ్డి, భూమా నాగిరెడ్డి, గంగుల ప్రభాకర్ రెడ్డి, విష్ణువర్దన్ రెడ్డి, మీనాక్షి నాయుడు, ఎస్వీ మోహన్ రెడ్డి, మణిగాంధీ, కేఈ ప్రతాప్, వీరభద్రగౌడు తదితరులు పాల్గొన్నారు. అయితే, ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం సోదరుడు, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ దూరంగా ఉన్నారు. -
రాష్ట్రాభివృద్ధికి సహకరించని కేంద్రం
ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి ఓర్వకల్లు: రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సరైన సహకారం అందించడం లేదని ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి ఆరోపించారు. బుధవారం సాయంత్రం స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రెండో విడత రుణ మాఫీ ఉపశమన అర్హత కార్డుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హామీల అమలుకు కేంద్ర ప్రభుత్వం సరైన ప్రోత్సాహం అందించడం లేదన్నారు. మీ ఇంటికి మీ భూమి కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు జిల్లాలో 80 శాతం భూ సమస్యలను పరిష్కరించామన్నారు. అయినా రెవెన్యూ అధికారులపై ఆరోపణలు వస్తున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. రెవెన్యూ శాఖలో అవినీతి, అక్రమాలను అరికట్టేందుకు తగుచర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయమోహన్‌ను ఆదేశించారు. ఎమ్మెల్యే గౌరుచరిత మాట్లాడుతూ.. ఈ ఏడాది జిల్లాలో వర్షాలు సకాలంలో పడ్డాయని, రైతులు వ్యవసాయంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని రకాల సబ్సిడీ పథకాలను అన్నదాతలకు సకాలంలో అందజేయాలని కోరారు. జిలా ్లకలెక్టర్ విజయమోహన్ మాట్లాడుతూ.. రెండో విడత జిల్లాలో 2.73 లక్షల మంది రైతులకు రూ.251 కోట్లు రుణ మాఫీ అయిందన్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి ఏరాసు ప్రతాప్‌రెడ్డి, రాష్ట్ర మహిళా సాధికార సంస్థ ప్రతినిధురాలు విజయభారతి, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, జేసీ-2 రామస్వామి, ఆర్డీఓ రఘుబాబు, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు మోహన్‌రెడ్డి, మండల కన్వీనర్ గోవిందరెడ్డి, గ్రామ సర్పంచ్ పెద్దయ్య, ఏవో మధుమతి, ఎంపీడీఓ మాధవీలత, తహశీల్దార్ రామాంజులు నాయక్ తదితరులు పాల్గొన్నారు. పారదర్శంగా బదిలీలు కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో బదిలీల ప్రక్రియను పారదర్శకంగా చేపట్టామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఇ కృష్ణమూర్తి తెలిపారు. బుధవారం విజయవాడ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బదిలీలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేఈ మాట్లాడుతూ ఎలాంటి అనుమానాలకు తావులేకుండా బదిలీలు చేపట్టామన్నారు. జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ మాట్లాడుతూ.. ఉప ముఖ్యమంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి, ఎమ్మెల్యేలతో చర్చించి, వారి అభిప్రాయాలు తీసుకొని బదిలీలు నిర్వహించామన్నారు. వీడియోకాన్ఫరెన్స్‌లో జేసీ హరికిరణ్, డీఆర్ఓ గంగాధర్‌గౌడు, డ్వామా పీడీ పుల్లారెడ్డి, డీఆర్డీఏ పీడీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
నీదా..నాదా!
జెడ్పీ పీఠం ► టీడీపీలో మరో వివాదం ► తెరపైకి జెడ్పీ చైర్మన్ పదవి ఒప్పందం ► నేతలను కలుస్తున్న వైస్ చైర్పర్సన్ పుష్పావతి ► అటువంటి ఒప్పందం లేదంటున్న జెడ్పీ చైర్మన్ ► తాను ఖర్చు చేసిన మొత్తం వాపస్ ఇస్తే ఇస్తానని కొత్త మెలిక సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార పార్టీలో మరో లొల్లి తెరమీదకు వచ్చింది. రాజ్యసభ సీటు విషయంలో రేగిన రగడ కాస్తా చల్లారకముందే... జెడ్పీ చైర్మన్ పీఠంపై చర్చ మొదలయ్యింది. మొదట్లో చేసుకున్న ఒప్పందం మేరకు తనకు రెండేళ్ల తర్వాత జెడ్పీ చైర్మన్ పీఠాన్ని అప్పగించాలని నందవరం జెడ్పీటీసీ సభ్యురాలు, జెడ్పీ వైస్ చైర్మన్ పుష్పావతి కోరుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆమె టీడీపీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణి రెడ్డిని కలిసి విన్నవించినట్టు తెలిసింది. త్వరలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తితో పాటు రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌లను కూడా కలవనున్నట్లు సమాచారం. మరోవైపు అటువంటి ఒప్పందమేదీ లేదని ప్రస్తుత జెడ్పీ చైర్మన్ రాజశేఖర్ తన అనుచరుల వద్ద వాదిస్తున్నట్టు తెలిసింది. అయితే... తాను ఖర్చు పెట్టిన డబ్బులను ఇస్తే పదవిని ఇప్పుడే వదులుకుంటానని రాజశేఖర్ అంటున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మొదట్లో కుదిరిన ఒప్పందం మేరకు ఖర్చు పెట్టిన మొత్తం ఇవ్వాలన్న నిబంధనేదీ లేదని వైస్ చైర్మన్ వర్గీయులు వాదిస్తున్నారు. మొత్తం మీద అధికార పార్టీలో మరో పదవి లొల్లి షురూ అయ్యిందన్నమాట. జూలై 7 డెడ్‌లైన్ జిల్లాలో అధికార పార్టీకి జిల్లా పరిషత్ ఎన్నికల్లో మెజార్టీ రాలేదు. అయినప్పటికీ పదవులు, డబ్బు ఆశచూపి చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. అందులో భాగంగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినప్పటికీ పార్టీ మారి ఏకంగా చైర్మన్ పీఠాన్ని రాజశేఖర్ దక్కించుకున్నారు. దీనిపై అప్పట్లోనే అధికార పార్టీలో అసంతృప్తి రాజుకుంది. నేరుగా పార్టీ టికెట్లపై గెలిచిన తమను కాదని... వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి పదవి ఎలా ఇస్తారని వాదించారు. అయితే, ప్రస్తుతం కేవలం రెండేళ్ల కాలపరిమితికి మాత్రమే ఆయన జెడ్పీ చైర్మన్‌గా ఉంటారని పార్టీ నేతలు బుజ్జగించారు. రెండేళ్ల తర్వాత మిగిలిన మూడేళ్ల కాలానికి చైర్మన్ పీఠాన్ని అప్పగిస్తామని వైస్ చైర్మన్‌గా ఉన్న పుష్పావతికి పార్టీ నేతలు అప్పట్లో హామీనిచ్చారని ఈమె వర్గీయులు పేర్కొంటున్నారు. ఈ ఒప్పందం మేరకు జూలై 7తో రెండేళ్ల కాలపరిమితి ముగియనున్నందున... జూలై 8 నుంచి తనకు పీఠం అప్పగించాలని ఆమె కోరుతున్నారు. ఈ నేపథ్యంలో నేతలందరినీ కలుస్తున్నట్టు తెలిసింది. -
అవినీతి అతని ప్రోటోకాల్!
► రిజిస్ట్రేషన్ శాఖలో ఓ అధికారి దందా ► నెలకు ఇంత ఇవ్వాల్సిందేనని లక్ష్యాలు ► ప్రభుత్వం తరహాలో ప్రతీ ఆఫీసుకు నిర్దేశిస్తున్న వైనం ► డిప్యూటీ సీఎం దృష్టికి మొత్తం అవినీతి వ్యవహారం ► ఈ నేపథ్యంలో సెలవులో వెళ్లేందుకు ప్రయత్నాలు సాక్షి ప్రతినిధి, కర్నూలు: ప్రతీ నెలా ఎంత మొత్తం ఆదాయం సంపాదించాలో తెలియజేస్తూ రిజిస్ట్రేషన్లశాఖకు ప్రభుత్వం లక్ష్యాలు నిర్దేశించడం మీరు వినే ఉంటారు. అయితే, జిల్లాలో ఒక అధికారి... ఏ ఆఫీసు ఎంత మొత్తం నెలకు ఇవ్వాలో లక్ష్యాలు ఇస్తున్నారు. అంతకంటే తక్కువ మొత్తం తనకు ఇస్తేమీ పనిపడతా* అంటూ హెచ్చరికలు జారీచేస్తున్నారు. పైగా ఇవన్నీ ప్రోటోకాల్ ఖర్చులకంటూ సదరు అధికారి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారంట. ప్రతీ నెలా కచ్చితంగా జిల్లాలోని రిజిస్ట్రేషన్‌శాఖ సిబ్బంది.. నిర్దేషించిన లక్ష్యం మేరకు సదరు అధికారికి మామూళ్లు సమర్పించుకోవాల్సిందే. అయితే, ఈ మొత్తం వ్యవహారం కాస్తా ఆ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి దృష్టికి వెళ్లింది. ఫలితంగా ఈ నెల మూడో వారం నుంచి సెలవుపై వెళ్లి.. కొత్తగా మంచి ఫోకల్ పోస్టింగు కోసం పైరవీలు ప్రారంభించాలని సదరు అధికారి నిర్ణయించుకున్నట్టు సమాచారం. సెలవులో వెళ్లే యోచన...! ఈయనగారి వ్యవహారశైలిపై ఇప్పటికే అనేక ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ నెల మూడో వారంలో సెలవులో వెళ్లాలని ఆయన భావిస్తున్నారు. మరోవైపు లంచాల బాగోతం కాస్తా డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి దృష్టికి కూడా వెళ్లింది. దీంతో ఇక్కడ ఉండటం వల్ల ఏ క్షణం ఏసీబీ అధికారులు దాడులు చేస్తారో అనే ఆందోళన ఆయన్ను వెంటాడుతోందని సమాచారం. ఈ నేపథ్యంలో వేరే జిల్లాలో మంచి పోస్టింగు కోసం సెలవుపై వెళ్లాలని భావిస్తున్నట్టు తెలిసింది. సెలవులో ఉండి మంచి ఫోకల్ పోస్టింగుకు పైరవీలు షురూ చేయాలనేది సదరు అధికారి ఆలోచనగా ఉన్నట్టు సమాచారం. మరోవైపు ఎవరైనా కిందిస్థాయి సిబ్బంది చేస్తున్న అవినీతి వ్యవహారాలను ఈయన దృష్టికి తీసుకవస్తే...ఆ చూద్దాంలే అనే ధోరణిలో వ్యవహరిస్తున్నారు. బాధ్యతలు అప్పగించడంలోనూ పైరవీలే రిజిస్ట్రేషన్‌శాఖలో జూనియర్, సీనియర్ అసిస్టెంట్లకు బాధ్యతలు అప్పగించడంలోనూ సదరు అధికారి నిబంధనలు పాటించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీనియర్ అసిస్టెంట్‌కు అప్పగించాల్సిన బాధ్యతలను తనకు నమ్మకస్తుడిగా ఉన్న జూనియర్ అసిస్టెంటుకు అప్పగించరన్న విమర్శలు ఉన్నాయి. తనకు నమ్మకస్తుడిగా ఉన్న వ్యక్తిని నియమించుకోవడం ద్వారా అయినకాడికి దండుకోవచ్చుననేది ఆయన ఆలోచనగా ఉంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే డిప్యూటీ సీఎంకు ఫిర్యాదులు వెళ్లగా సదరు అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఆయనలో ఎలాంటి మార్పురావడం లేదని ఆ శాఖ సిబ్బందే వ్యాఖ్యానిస్తున్నారు. -
సుజలం విఫలం
►మినరల్ వాటర్‌కు నోచుకోని గ్రామాలు ►ఎన్నికల హామీని గాలికొదిలేసిన ప్రభుత్వం ►డిప్యూటీ సీఎం ప్రారంభించిన మూడు ప్లాంట్లూ మూత ►కరెంటు బిల్లులు చెల్లించక సరఫరా నిలిపివేత ►జిల్లాలో ఏర్పాటు చేసిన ప్లాంట్లు 25 ►ప్రస్తుతం మిగిలినవి 2 మాత్రమే సాక్షి ప్రతినిధి, కర్నూలు: ప్రతి గ్రామానికీ మినరల్ వాటర్ అందిస్తామని ఎన్నికల సమయంలో వాగ్దానం చేసిన అధికార పార్టీ.. ఎన్నికల తర్వాత ఆ హామీని అటకెక్కించింది. ఎన్టీఆర్ సుజల పథకం కింద ఇప్పటివరకు జిల్లాలో 25 ఆర్ఓ ప్లాంట్లను మాత్రమే ఏర్పాటు చేసింది. అయితే, ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్లలో ఏకంగా 23 మూతపడగా.. కేవలం 2 ప్లాంట్లు మాత్రమే నడుస్తున్నాయి. డిప్యూటీ సీఎం సొంత నియోజకవర్గం పత్తికొండలో ఆయన చేతుల మీదుగా ప్రారంభించిన మూడు ప్లాంట్లు మూతపడటం గమనార్హం. వాస్తవానికి జిల్లాలోని అన్ని గ్రామాలకు మినరల్ వాటర్ అందించాలంటే 889 ఆర్ఓ ప్లాంట్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం రూ.44.45 కోట్లు అవసరమని అంచనా. అయితే, కేవలం 25 ప్రారంభించి.. ఇందులోనూ ప్రైవేటు సంస్థల నిధులు, దాతల ద్వారా ప్రారంభించినవే అధికం. వీటికి కరెంటు బిల్లులు ఇవ్వలేక.. ఏకంగా ప్లాంట్లనే మూతపడేశారు. మొత్తంగా జిల్లాలో ఎన్టీఆర్ సుజల పథకం కాస్తా పడకేసింది. ఒత్తిడితెచ్చి మరీ ఏర్పాటు చేసి... వాస్తవానికి ఆర్ఓ ప్లాంట్ల ఏర్పాటు కోసం అధికారులు మొదట్లో నానా హైరానా పడ్డారు. కచ్చితంగా ఏర్పాటు చేయాల్సిందేనన్న ఆదేశాల నేపథ్యంలో ప్రైవేటు సంస్థల మీద ఒత్తిడి తెచ్చి మరీ ఏర్పాటు చేశారు. అయితే, వీటి నిర్వహణ మాత్రం ప్రభుత్వం గాలికి వదిలేసింది. ఆర్ఓ ప్లాంట్ల ఏర్పాటు కోసం దాతలు కేవలం గది ఏర్పాటు చేసుకుంటే సరిపోతుందని... మినరల్ వాటర్ యంత్ర పరికరాలను ప్రభుత్వమే సమకూరుస్తుందని అధికారులు హామీనిచ్చారు. దీంతో ప్రైవేటు సంస్థలు తమ స్థలాల్లో ఆర్ఓ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకొచ్చారు. తీరా ప్లాంటు ఏర్పాటైన తర్వాత.. దీనిని స్థానిక పంచాయతీకి అప్పగించాలని చెప్పడంతో మా స్థలాన్ని కూడా పంచాయతీకి ఎలా అప్పగిస్తామంటూ వాపోయారు. ప్రభుత్వం ఇచ్చిన యంత్ర పరికరాలు తీసుకెళ్లాలని ప్రైవేటు సంస్థలు కాస్తా తేల్చిచెప్పడంతో జిల్లాలో పలు చోట్ల ప్లాంట్లు మూతపడిన పరిస్థితి ఏర్పడింది. డిప్యూటీ సీఎం ప్రారంభించినా.. పత్తికొండ నియోకవర్గంలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి స్వయంగా మూడు ఆర్ఓ పాంట్లను ప్రారంభించారు. ఇందులో ఏ ఒక్కటీ పనిచేయడం లేదు. మూడు ప్లాంట్లు కూడా మూతపడ్డాయి. బిల్లులు కట్టకపోవడంతో కరెంటు సరఫరా నిలిపేశారు. ఫలితంగా గ్రామాలకు మంచినీరు అందించే ప్రక్రియ కాస్తా మూలకుచేరింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్లాంట్లదీ ఇదే పరిస్థితి. ప్రచారానికే పరిమితం: ఎన్టీఆర్ సుజల రక్షిత మంచినీటి పథకం ప్రచారానికే పరిమితమైంది. రూ.2లకే 20 లీటర్ల మంచినీటిని అందిస్తామని ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకాన్ని అమలు చేయలేకపోయారు. గ్రామంలో 2 వేలకు పైగా జనాభా కలుషితమైన నీటిని తాగి రోగాలబారిన పడుతోంది. రామలింగ, హుళేబీడ -
‘తమ్ముడి’ పెత్తనం!
టీడీపీలో అధికార దుర్వినియోగం పరాకాష్టకు చేరింది. ఒక్కరికి పదవి దక్కితే చాలు.. కుటుంబ సభ్యులంతా పెత్తనం చెలాయించొచ్చు. ఎలాంటి హోదా లేకపోయినా అధికారులను ముప్పుతిప్పలు పెట్టొచ్చు. తాజాగా ఓ ‘తమ్ముడు’ తన ఇల్లు కేంద్రంగా సమీక్ష నిర్వహించిన తీరు అధికార వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. గురువారం డోన్ పట్టణంలోని తన ఇంట్లో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రతాప్ మండల అధికారులతో సమావేశం నిర్వహించారు. డోన్ మున్సిపల్ కమిషనర్ రమేష్‌బాబు, చైర్పర్సన్ గాయత్రిదేవి, ఆర్‌డబ్ల్యుఎస్ డీఈ మల్లిఖార్జున, హౌసింగ్ డీఈ రాధాకృష్ణమూర్తి, ఎంపీడీఓ క్యాథరిన్, వ్యవసాయశాఖ ఏడీ నర్సిరెడ్డి, ఏఓ బాలవర్దిరాజు హాజరయ్యారు. కార్యకర్తలు ఆ పనీ.. ఈ పనీ నేతకు చెప్పడం, ఆయన అధికారులకు ఆదేశాలు ఇవ్వడం చూస్తే ఏ స్థాయిలో ఆయన పెత్తనం చెలాయిస్తున్నారో అర్థమవుతోంది. పది రోజుల క్రితం సబ్ డివిజన్ స్థాయి అధికారులతో.. అంతకు ముందు తన అన్న ఏర్పాటు చేసిన జలవనరుల శాఖ సమీక్షలోనూ ఆయన హవా చాటుకున్నారు. ఆయనకు ఎలాంటి హోదా లేకపోయినా అధికారులు పదేపదే ఆ ఇంటి గడప తొక్కాల్సి వస్తుండటం గమనార్హం. ప్రజలు ఓట్లేసి పట్టం కట్టిన ఎమ్మెల్యేను కాదని.. ఆ నాయకుడు అధికారులను తన చెప్పుచేతల్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తుండటం విమర్శల పాలవుతోంది. -
అంతా రామమయం..
రాజంపేట/ఒంటిమిట్ట : ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ధ్వజారోహణం కన్నుల పండువగా సాగింది. భక్తుల రామ నామ స్మరణతో ఆలయ పరిసరాలు ప్రతిధ్వనించాయి. స్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించారు. ధ్వజ స్తంభం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు డిప్యూటీ సీఎంకు అలయంలో వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి ఆయనకు కోదండరాముని చిత్రపటాన్ని అందజేశారు. తొలిసారిగా అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తున్న కోదండరాముని బ్రహ్మోత్సవాల్లో శనివారం శ్రీరామ, పోతన జయంతిని ఘనంగా నిర్వహించారు. దేవాదాయ శాఖ కమిషనర్ అనురాధ, కలెక్టరు కేవీ రమణ, జిల్లా ఎస్పీ నవీన్ గులాఠి, రాజంపేట ఆర్డీవో ప్రభాకర్పిళ్లై పర్యవేక్షణలో ఆలయంలో ఉత్సవాలు కొనసాగుతున్నాయి. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనువాస్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వరదరాజులరెడ్డి, పసుపులేటి బ్రహ్మయ్య, విజయమ్మ తదితరులు శనివారం నాటి కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు జిల్లా నలుమూల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి విచ్చేశారు. రూ.25 కోట్లతో రామాలయాభివృద్ధి రూ.25 కోట్లతో ఒంటిమిట్ట రామాలయాన్ని తొలి దశలో అభివృద్ధి చేస్తామని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి చెప్పారు. పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం ఆయనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తిరుమల స్థాయిలో ఒంటిమిట్ట ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. ప్రభుత్వ లాంచనాలతో ఉత్సవాలు నిర్విహ స్తుండటం వల్ల ఒంటిమిట్ట ఆలయానికి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు దక్కిందన్నారు. ఈ జిల్లా అంటే సీఎంకు ప్రేమాభిమానం ఉందన్నారు. తిరుమల నుంచి దేవుని కడప వరకు ఆలయాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిందని వివరించారు. ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు, ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోదండ రామున్ని వేడుకున్నానని చెప్పారు. రాబోయే రోజుల్లో భక్తులు ఒంటిమిట్ట కోదండరామాలయం వద్ద బస చేసేలా సౌకర్యాలు కల్పిస్తామన్నారు. సోమశిల వెనుక జలాలను ఒంటిమిట్ట చెరువుకు రప్పించే కార్యక్రమానికి 2వ తే దీన శిలాఫలకం ఆవిష్కరణ ఉంటుందని చెప్పారు. సామాన్య భక్తులకు తప్పని ఇక్కట్లు శ్రీరామనవమి సందర్భంగా ఆలయానికి వీఐపీల తాకిడి అధికమైంది. డిప్యూటీ సీఎం, రాష్ట్ర మంత్రి కామినేనితోపాటు అధికార పార్టీకి చెందిన నేతలు అధిక సంఖ్యలో రావడంతో గర్భగుడి వద్ద తోపులాట చోటు చేసుకుంది. వీఐపీల తాకిడితో సామాన్య భక్తులకు ఇక్కట్లు ఎదురయ్యాయి. చిన్నపిల్లలు, వృద్ధులు అల్లాడిపోయారు. ఆలయం లోపల పలువురు రాజకీయ నేతలు ఎవరంతకు వారు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఒక దశలో విధి నిర్వహణలో ఉన్న పోలీసులను సైతం లెక్కచేయని పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఆలయానికి తొలిసారిగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు రావడంతో వేలాదిగా వచ్చే భక్తులకు ఏ విధంగా స్వామి వారి దర్శనం కల్పించాలనే విషయంలో నిర్వహణ లోపం కొట్టిచ్చినట్లు కన్పించింది. రెవెన్యూ, దేవదాయ శాఖ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో పోలీసులు కూడా నిస్సహాయ స్థితిలో ఉండిపోవాల్సి వచ్చింది. క్యూ సిస్టమ్ సరిగా లేదని, స్వామిని కనులారా దర్శించుకునే భాగ్యం కల్పించాలని సామాన్య భక్తులు కోరుతున్నారు. ఆలయం వెలుపల, లోపల అసౌకర్యంగా క్యూలు ఏర్పాటు చేశారు. గర్భగుడి ఆలయం ప్రధాన ముఖ ద్వారం వద్ద నుంచి (పైకి)క్యూ లోపలికి వెళుతుంది. అక్కడే భక్తులు పడరాని కష్టాలు పడ్డారు. ఎర్రని ఎండకు పిల్లలు, వృద్ధులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ప్రముఖులు వచ్చిన సందర్భంలో కూడా సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనం భాగ్యం కలిగించే దిశగా దేవదాయ శాఖ చర్యలు చేపట్టాల్సి ఉంది. భక్తులు పాద రక్షలు బయట వదిలి పెట్టేందుకు తగిన ఏర్పాట్లు చేయలేదు. ఆలయ మండపం వద్ద కాకుండా ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసి.. ప్రసాద వితరణ చేస్తే బావుంటుంది. 2వ తేదీ కల్యాణోత్సవం నాటికైనా ఈ లోపాలను అధిగమిస్తే బావుంటుందని భక్తులు పేర్కొంటున్నారు. -
రాజమండ్రిలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి
కోటగుమ్మం: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూశాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి విశాఖపట్నం పర్యటన ముగించుకుని బుధవారం మధ్యాహ్నం రాజమండ్రి వచ్చారు. మధురపూడి నుంచి విమానంలో హైదరాబాద్ వెళ్లేందుకు ఇక్కడకు వచ్చిన నగరంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారు. తర్వాత అతిథి గృహంలోని భోజనం చేసి అనంతరం మధురపూడి వెళ్లారు. ఈ సందర్భంగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. మంత్రిని కలిసి హుదూద్ తుపాను సహాయక కార్యక్రమాలపై చర్చించారు.