అవినీతి అతని ప్రోటోకాల్!
► రిజిస్ట్రేషన్ శాఖలో ఓ అధికారి దందా
► నెలకు ఇంత ఇవ్వాల్సిందేనని లక్ష్యాలు
► ప్రభుత్వం తరహాలో ప్రతీ ఆఫీసుకు నిర్దేశిస్తున్న వైనం
► డిప్యూటీ సీఎం దృష్టికి మొత్తం అవినీతి వ్యవహారం
► ఈ నేపథ్యంలో సెలవులో వెళ్లేందుకు ప్రయత్నాలు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ప్రతీ నెలా ఎంత మొత్తం ఆదాయం సంపాదించాలో తెలియజేస్తూ రిజిస్ట్రేషన్లశాఖకు ప్రభుత్వం లక్ష్యాలు నిర్దేశించడం మీరు వినే ఉంటారు. అయితే, జిల్లాలో ఒక అధికారి... ఏ ఆఫీసు ఎంత మొత్తం నెలకు ఇవ్వాలో లక్ష్యాలు ఇస్తున్నారు. అంతకంటే తక్కువ మొత్తం తనకు ఇస్తేమీ పనిపడతా* అంటూ హెచ్చరికలు జారీచేస్తున్నారు. పైగా ఇవన్నీ ప్రోటోకాల్ ఖర్చులకంటూ సదరు అధికారి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారంట.
ప్రతీ నెలా కచ్చితంగా జిల్లాలోని రిజిస్ట్రేషన్‌శాఖ సిబ్బంది.. నిర్దేషించిన లక్ష్యం మేరకు సదరు అధికారికి మామూళ్లు సమర్పించుకోవాల్సిందే. అయితే, ఈ మొత్తం వ్యవహారం కాస్తా ఆ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి దృష్టికి వెళ్లింది. ఫలితంగా ఈ నెల మూడో వారం నుంచి సెలవుపై వెళ్లి.. కొత్తగా మంచి ఫోకల్ పోస్టింగు కోసం పైరవీలు ప్రారంభించాలని సదరు అధికారి నిర్ణయించుకున్నట్టు సమాచారం.
సెలవులో వెళ్లే యోచన...!
ఈయనగారి వ్యవహారశైలిపై ఇప్పటికే అనేక ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ నెల మూడో వారంలో సెలవులో వెళ్లాలని ఆయన భావిస్తున్నారు. మరోవైపు లంచాల బాగోతం కాస్తా డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి దృష్టికి కూడా వెళ్లింది. దీంతో ఇక్కడ ఉండటం వల్ల ఏ క్షణం ఏసీబీ అధికారులు దాడులు చేస్తారో అనే ఆందోళన ఆయన్ను వెంటాడుతోందని సమాచారం. ఈ నేపథ్యంలో వేరే జిల్లాలో మంచి పోస్టింగు కోసం సెలవుపై వెళ్లాలని భావిస్తున్నట్టు తెలిసింది. సెలవులో ఉండి మంచి ఫోకల్ పోస్టింగుకు పైరవీలు షురూ చేయాలనేది సదరు అధికారి ఆలోచనగా ఉన్నట్టు సమాచారం. మరోవైపు ఎవరైనా కిందిస్థాయి సిబ్బంది చేస్తున్న అవినీతి వ్యవహారాలను ఈయన దృష్టికి తీసుకవస్తే...ఆ చూద్దాంలే అనే ధోరణిలో వ్యవహరిస్తున్నారు.
బాధ్యతలు అప్పగించడంలోనూ పైరవీలే
రిజిస్ట్రేషన్‌శాఖలో జూనియర్, సీనియర్ అసిస్టెంట్లకు బాధ్యతలు అప్పగించడంలోనూ సదరు అధికారి నిబంధనలు పాటించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీనియర్ అసిస్టెంట్‌కు అప్పగించాల్సిన బాధ్యతలను తనకు నమ్మకస్తుడిగా ఉన్న జూనియర్ అసిస్టెంటుకు అప్పగించరన్న విమర్శలు ఉన్నాయి. తనకు నమ్మకస్తుడిగా ఉన్న వ్యక్తిని నియమించుకోవడం ద్వారా అయినకాడికి దండుకోవచ్చుననేది ఆయన ఆలోచనగా ఉంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే డిప్యూటీ సీఎంకు ఫిర్యాదులు వెళ్లగా సదరు అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఆయనలో ఎలాంటి మార్పురావడం లేదని ఆ శాఖ సిబ్బందే వ్యాఖ్యానిస్తున్నారు.