రాజంపేట/ఒంటిమిట్ట : ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ధ్వజారోహణం కన్నుల పండువగా సాగింది. భక్తుల రామ నామ స్మరణతో ఆలయ పరిసరాలు ప్రతిధ్వనించాయి. స్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించారు. ధ్వజ స్తంభం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు డిప్యూటీ సీఎంకు అలయంలో వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.
ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి ఆయనకు కోదండరాముని చిత్రపటాన్ని అందజేశారు. తొలిసారిగా అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తున్న కోదండరాముని బ్రహ్మోత్సవాల్లో శనివారం శ్రీరామ, పోతన జయంతిని ఘనంగా నిర్వహించారు. దేవాదాయ శాఖ కమిషనర్ అనురాధ, కలెక్టరు కేవీ రమణ, జిల్లా ఎస్పీ నవీన్ గులాఠి, రాజంపేట ఆర్డీవో ప్రభాకర్‌పిళ్లై పర్యవేక్షణలో ఆలయంలో ఉత్సవాలు కొనసాగుతున్నాయి. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, రాష్ట్ర
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనువాస్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వరదరాజులరెడ్డి, పసుపులేటి బ్రహ్మయ్య, విజయమ్మ తదితరులు శనివారం నాటి కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు జిల్లా నలుమూల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి విచ్చేశారు.
రూ.25 కోట్లతో రామాలయాభివృద్ధి
రూ.25 కోట్లతో ఒంటిమిట్ట రామాలయాన్ని తొలి దశలో అభివృద్ధి చేస్తామని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి చెప్పారు. పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం ఆయనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తిరుమల స్థాయిలో ఒంటిమిట్ట ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. ప్రభుత్వ లాంచనాలతో ఉత్సవాలు నిర్విహ స్తుండటం వల్ల ఒంటిమిట్ట ఆలయానికి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు దక్కిందన్నారు.
ఈ జిల్లా అంటే సీఎంకు ప్రేమాభిమానం ఉందన్నారు. తిరుమల నుంచి దేవుని కడప వరకు ఆలయాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిందని వివరించారు. ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు, ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోదండ రామున్ని వేడుకున్నానని చెప్పారు. రాబోయే రోజుల్లో భక్తులు ఒంటిమిట్ట కోదండరామాలయం వద్ద బస చేసేలా సౌకర్యాలు కల్పిస్తామన్నారు. సోమశిల వెనుక జలాలను ఒంటిమిట్ట చెరువుకు రప్పించే కార్యక్రమానికి 2వ తే దీన శిలాఫలకం ఆవిష్కరణ ఉంటుందని చెప్పారు.
సామాన్య భక్తులకు తప్పని ఇక్కట్లు
శ్రీరామనవమి సందర్భంగా ఆలయానికి వీఐపీల తాకిడి అధికమైంది. డిప్యూటీ సీఎం, రాష్ట్ర మంత్రి కామినేనితోపాటు అధికార పార్టీకి చెందిన నేతలు అధిక సంఖ్యలో రావడంతో గర్భగుడి వద్ద తోపులాట చోటు చేసుకుంది. వీఐపీల తాకిడితో సామాన్య భక్తులకు ఇక్కట్లు ఎదురయ్యాయి. చిన్నపిల్లలు, వృద్ధులు అల్లాడిపోయారు. ఆలయం లోపల పలువురు రాజకీయ నేతలు ఎవరంతకు వారు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు.
ఒక దశలో విధి నిర్వహణలో ఉన్న పోలీసులను సైతం లెక్కచేయని పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఆలయానికి తొలిసారిగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు రావడంతో వేలాదిగా వచ్చే భక్తులకు ఏ విధంగా స్వామి వారి దర్శనం కల్పించాలనే విషయంలో నిర్వహణ లోపం కొట్టిచ్చినట్లు కన్పించింది. రెవెన్యూ, దేవదాయ శాఖ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో పోలీసులు కూడా నిస్సహాయ స్థితిలో ఉండిపోవాల్సి వచ్చింది. క్యూ సిస్టమ్ సరిగా లేదని, స్వామిని కనులారా దర్శించుకునే భాగ్యం కల్పించాలని సామాన్య భక్తులు కోరుతున్నారు.
ఆలయం వెలుపల, లోపల అసౌకర్యంగా క్యూలు ఏర్పాటు చేశారు. గర్భగుడి ఆలయం ప్రధాన ముఖ ద్వారం వద్ద నుంచి (పైకి)క్యూ లోపలికి వెళుతుంది. అక్కడే భక్తులు పడరాని కష్టాలు పడ్డారు. ఎర్రని ఎండకు పిల్లలు, వృద్ధులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ప్రముఖులు వచ్చిన సందర్భంలో కూడా సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనం భాగ్యం కలిగించే దిశగా దేవదాయ శాఖ చర్యలు చేపట్టాల్సి ఉంది. భక్తులు పాద రక్షలు బయట వదిలి పెట్టేందుకు తగిన ఏర్పాట్లు చేయలేదు. ఆలయ మండపం వద్ద కాకుండా ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసి.. ప్రసాద వితరణ చేస్తే బావుంటుంది. 2వ తేదీ కల్యాణోత్సవం నాటికైనా ఈ లోపాలను అధిగమిస్తే బావుంటుందని భక్తులు పేర్కొంటున్నారు.
అంతా రామమయం..
Published Sun, Mar 29 2015 3:44 AM | Last Updated on Thu, May 24 2018 2:05 PM
Advertisement
Advertisement