Ontimitta kodandaramudu
-
ఒంటిమిట్ట కల్యాణోత్సవంలో అపశృతి..
-
ఒంటిమిట్ట : అకాల వర్ష బీభత్సం
సాక్షి, కడప/రాజంపేట: వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి కల్యాణోత్సవం సందర్భంగా తీవ్ర అపశ్రుతి చోటుచేసు కుంది. ఆరాధ్య దైవం కల్యాణాన్ని కళ్లారా చూసి తరిద్దామని వచ్చిన నలుగురు భక్తులు వర్ష బీభత్సానికి మృత్యువాత పడ్డారు. మరో 80 మంది దాకా గాయాల పాలయ్యారు. వీరి లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలి సింది. శ్రీరాముడు–సీతమ్మల వివాహం సందర్భంగా వెలుగులతో కళకళలాడాల్సిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం వరుణదేవుడి ప్రతాపానికి అంధకారంగా మారింది. కుండపోత వర్షం: ఒంటిమిట్ట ఆలయంలో శుక్రవారం స్వామివారి కల్యాణోత్సవాన్ని తిలకించడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. సాయంత్రం 6.30 గంటలకు ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమైంది. వెనువెంటనే ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వాన మొదలైంది. గంటకుపైగా కుండపోత వర్షం కురిసింది. ఒకవైపు విపరీతమైన గాలులు, మరోవైపు ఉరుముల శబ్దాలతో ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొంది. కల్యాణోత్సవం కోసం ఏర్పాటు చేసిన ఫోకస్ లైట్ల స్తంభాలు, డెకరేషన్ లైట్లతో అలంకరించిన బొమ్మలు ఈదురుగాలుల ధాటికి కూలిపోయాయి. చలువ పందిళ్లకు వేసిన టెంట్లు, రేకులు కూడా లేచిపోయాయి. వడగండ్లు రేకులపై పడుతుండడంతో భక్తులు భయకంపితులయ్యారు. కోదండ రామస్వామి ఆలయ పరిసరాల్లో ఉన్న వేపచెట్లు నేలకూలగా, అక్కడే ఉన్న చలువ పందిరి కూలిపోయింది. అధికారులు వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో ఆలయ పరిసరాల్లో అంధకారం నెలకొంది. ప్రాణాలు తీసిన లైట్లు: ఆలయ సమీపంలో కల్యాణోత్సవం వేదిక రేకులు కూలిపోయి నలుగురు మృత్యువాత పడ్డారు. బద్వేలు ఎస్సీ కాలనీకి చెందిన చిన్నయ్య(48) మృతి చెందాడు. ఫోకస్ లైట్లు మీద పడడంతో పోరుమామిళ్లకు చెందిన చెంగయ్య(70) అనే వృద్ధుడు చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఒంటిమిట్టకు చెందిన వెంకట సుబ్బమ్మ(65) అనే భక్తురాలు దక్షిణ గోపురం వద్ద కొయ్యలు మీదపడటంతో మృతి చెందారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం పట్టణానికి చెందిన మీనా(45) రాములోరి కల్యాణానికి వచ్చి గాయపడి, తుదిశ్వాస విడిచారు. వడగళ్ల వానకు రేకులు గాలికి లేచి పడడం, విరిగిన చెట్లు తగలడం, డెకరేషన్ లైట్లు మీదపడడం వంటి కారణాలతో దాదాపు 80 మంది గాయపడ్డారు. అందులో 25 మందిని కడప రిమ్స్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఐదుగురిని తిరుపతికి తరలించినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. సాయంత్రం 6.30 సమయంలో విద్యుత్ నిలిపివేయడంతో అప్పటి నుంచి రాత్రి 9.30 వరకు ఆలయం అంధకారంలోనే ఉండిపోయింది. వానలోనే వచ్చిన సీఎం చంద్రబాబు ప్రత్యేక విమానంలో సాయంత్రం 5.40 గంటలకు కడపకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ల్యాండింగ్ అవుతుండగానే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం మేఘావృతమైంది. భారీగా గాలులు వీచాయి. సీఎంకు స్వాగతం పలుకుతూ దారిపొడవునా ఏర్పాటు చేసిన కటౌట్లు, ఫ్లెక్సీలు నేలకూలాయి.బాబు ఎయిర్‌పోర్టు నుంచి కడప ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌కు చేరుకునే వరకూ గాలి వీస్తూనే ఉంది. ఆయన గెస్ట్‌హౌస్‌లోకి అడుగుపెట్టిన వెంటనే ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం మొదలైంది. చూస్తుండగానే బీభత్సం సృష్టించింది. కడప శివారులో పిడుగులు పడ్డాయి. గెస్ట్‌హౌస్‌లో గంటకుపైగా ఉన్న సీఎం రాత్రి 8 గంటలకు వర్షంలోనే ఒంటిమిట్టకు బయల్దేరారు. చంద్రబాబు దంపతులు ఆలయంలో పూజల అనంతరం కల్యాణవేదిక వద్దకు చేరుకుని స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. ఒంటిమిట్ట ఘటన దురదృష్టకరం: ఆకేపాటి ఒంటిమిట్టలో వర్ష బీభత్సం వల్ల నలుగురు చనిపోవడం దురదృష్టకరమని వైఎస్సార్సీపీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథరెడ్డి అన్నారు. మృతి చెందిన వారికి చెందిన ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. గాయపడిన వారికి కూడా పరిహారం చెల్లించాలన్నారు. వైఎస్ జగన్ సంతాపం అకాల వర్షం, గాలి బీభత్సానికి శుక్రవారం ఒంటిమిట్టలో నలుగురు మృతిచెందడంపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
రామా.. కనుమా..!
రాజంపేట : రెండో అయోధ్యగా ప్రసిద్ధి చెందిన ఒంటిమిట్ట కోదండరామాలయ బ్రహ్మోత్సవాలు ఈ నెల 24 నుంచి జరగనున్నాయి. ఉత్సవాల నిర్వహణ, భక్తులకు సౌకర్యాల కల్పన తదితర అంశాలపై టీటీడీ అధికారులు ఇంత వరకు సమీక్ష నిర్వహించలేదు. 13 రోజుల్లో ఏర్పాట్లు పూర్తి కావాల్సి ఉంది. ఇప్పటి వరకు జిల్లా యంత్రాంగంతో తిరుమల తిరుపతి దేవస్థానం కలిసి చేయాల్సిన వాటిపై చర్చలు లేవు. మరో వైపు శాశ్వత అభివృద్ధి పనుల కన్నా.. బ్రహ్మోత్సవాల సమయంలో తాత్కాలిక పనులు చేపట్టి ఉత్సవాలను పూర్తి చేసుకుని వెళ్లడం పైనే టీటీడీ దృష్టి సారిస్తోంది. తొలిసారిగా టీటీడీ చేపట్టిన ఉత్సవాల సమయంలో.. రామాలయాన్ని రూ.100 కోట్లతో అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో రూ.40 కోట్ల వరకు శాశ్వత, తాత్కాలిక పనులకు వెచ్చించినట్లుగా తెలుస్తోంది. ప్రచారమేదీ?: ఒంటిమిట్ట కోదండ రామాలయం (ఏకశిలానగరం)లో ఈ సారి జరిగే బ్రహ్మోత్సవాలకు ప్రచారం ఊపందుకోలేదు. దీనికి సంబంధించి సమీక్షలు, పోస్టర్ల ఆవిష్కరణలు టీటీడీ ఏడీ బిల్డింగ్‌లో కాకుండా ఏకశిలానగంలో చేసి ఉంటే బాగుండేదని, తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మోత్సవాలకు ప్రచారం జరిగి ఉండేదని జిల్లా వాసులు అభిప్రాయ పడుతున్నారు. తిరుపతిలో అనేక ఆలయాలకు సంబంధించి పోస్టర్ల ఆవిష్కరణ, సమీక్షలు జరుగుతుంటాయి. కాబట్టే ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు పెద్దగా ప్రాచుర్యం లేకుండా పోయిందనే అపవాదును టీటీడీ మూటకట్టుకుంది. ఇప్పటి వరకు ఈఓ సింఘాల్ ఇటు వైపు కన్నెత్తి చూడలేదన్న విమర్శలున్నాయి. టీటీడీ వైఖరిని స్థానిక ప్రజాప్రతినిధులు జీర్ణించుకోలేక పోతున్నారు. తమ భాగస్వామ్యం లేకుండా పోయిందనే ఆవేదన వారిలో నెలకొంది. గత బ్రహ్మోత్సవాలను ఓ సారి పరిశీలిస్తే.. గత బ్రహ్మోత్సవాలతో ఈ సారి ఏర్పాట్లను పోల్చుకుంటే వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. గతంలో బ్రహ్మోత్సవాల పనులకు సంబంధించి టీటీడీ ఈఓ సాంబ శివరావు ఒంటిమిట్టలో జిల్లా యంత్రాంగంతోపాటు టీటీడీ అధికారులను సమన్వయం చేసే విధంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. అప్పట్లో రూ.3.20 కోట్ల వ్యయంతో అన్ని హంగులతో కల్యాణ వేదిక ఏర్పాటు చేశారు. ఈ సారి ఆ వ్యయం రూ.3.50 కోట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయని టీటీడీ అధికారులు భావిస్తున్నారు. ఈ సారైనా అందుబాటలోకి వచ్చేనా..! కోదండరామున్ని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు, యాత్రికులు, పర్యాటకుల కోసం రూ.5 కోట్లతో విడిది సముదాయ భవనం నిర్మించారు. ఈ భవన నిర్మాణాన్ని రూ.3.20 కోట్లతో చేపట్టారు. రూ.1.83 కోట్లతో ఇతర మౌలిక వసతులు కల్పించనున్నారు. గతేడాది టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి శంకు స్థాపన చేశారు. గతేడాది సీఎంతో ప్రారంభించాలనుకున్నారు. కానీ వీలుపడలేదు. దీంతో అందుబాటులోకి రాలేకపోయింది. ఈ సారైనా అందుబాటులోకి తేవాలని భక్తులు కోరుతున్నారు. గత పొరపాట్లను సరిద్దుకునేనా.. 2017 బ్రహ్మోత్సవాల సందర్భంగా చోటు చేసుకున్న పొరపాట్లను టీటీడీ సరిదిద్దుకునేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భక్తులకు సరైన రీతిలో భోజన వసతి కల్పించలేదు. ఆర్టీసీ బస్సులను ఆలయానికి సమీపంలో ఏర్పాటు చేయలేదు. చాలా మంది భక్తులు కల్యాణం చూడలేక వెనుదిరిగారు. వారికి స్వామి కల్యాణానికి సంబంధించిన ముత్యాల తలంబ్రాలు అందలేదు. మరుగుదొడ్లు, మంచినీటి వసతి అంతంత మాత్రంగానే కల్పించారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా టీటీడీ ముందస్తు ప్రణాళికతో ముందుకెళ్లాలని భక్తులు కోరుతున్నారు. ఆ దిశగా జిల్లా యంత్రాంగం సహకారంతో టీటీడీ పూర్తిగా తీసుకుంటేనే బ్రహ్మోత్సవాలు విజయవంతమయ్యే పరిస్థితులు ఉన్నాయని వారు పేర్కొంటున్నారు. -
అరవింద నేత్రుడు.. అందాల రాముడు
ఒంటిమిట్ట : బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఒంటిమిట్ట కోదండరాముడు వటపత్రసాయి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజామున ఆలయంలోని మూలవిరాట్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాల అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన ప్రత్యేక పుష్పాలతో అలంకరించారు. వటపత్ర సాయి అలంకారంలో రాముల వారు పురవీధుల్లో ఊరేగారు. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో బారులుతీరారు. అన్ని సౌకర్యాలతో శ్రీకోదండరామనగర్ కోదండరామాలయ పరిసర ప్రాంతాల్లో ఇళ్లు కోల్పోయిన బాధితులకు అన్ని సౌకర్యాలతో శ్రీకోదండరామనగర్ నిర్మిస్తామని ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి చెప్పారు. ఇళ్లు కోల్పోయిన 86 మంది బాధితులకు చెక్కులు, హామీ పత్రాలను సోమవారం స్థానిక హరిత కల్యాణ మండపంలో కలెక్టర్ కేవీ రమణతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా మేడా మాట్లాడుతూ కోదండరామాలయ పరిసరాల్లో ఇళ్లు కోల్పోయిన వారు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అందమైన కాలనీ నిర్మిస్తామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలను నిలబెట్టుకుంటామన్నారు. చిన్న చిన్న సమస్యలు ఉంటే తమ ద్వారా పరిష్కరించుకోవాలని బాధితులను కోరారు. ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల అనంతరం హౌసింగ్ అధికారులు ఇళ్లు నిర్మించే పనిలో నిమగ్నమవుతారన్నారు. ఆర్అండ్బీ అధికారులు నిర్ణయించిన మొత్తం కంటే వంద శాతం నష్టపరిహారం అదనంగా చెల్లిస్తున్నామని తెలిపారు. నాలుగు నెలల్లో ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. లబ్ధిదారులకు అధికారుల ద్వారానే ఇళ్లు నిర్మించి ఇస్తామని కలెక్టర్ కేవీ రమణ పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన విధంగా కాలనీ ఏర్పాటు చేస్తామని, ఇంటి లోపలి భాగాన్ని లబ్ధిదారులు వారికి ఇష్టమొచ్చిన విధంగా తీర్చిదిద్దుకోవచ్చన్నారు. భక్తులకు ఇక్కట్లు కలుగకుండా ఏర్పాట్లు బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కేవీ రమణ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక హరిత రెస్టారెంట్లో జిల్లా స్థాయి అధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వీఐపీలు, భక్తులకు ప్రత్యేకంగా కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేస్తామన్నారు. కల్యాణోత్సవానికి హాజరయ్యే భక్తులకు భోజనం, నీటి వసతిని కల్పించేందుకు అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తగినన్ని బారికేడ్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. పారిశుద్ధ్యం, నీటి సమస్య తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ అనిల్‌కుమార్‌రెడ్డి, ఏజేసీ చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్డీఓ ప్రభాకర్పిళ్లై పాల్గొన్నారు. ఏర్పాట్లు పరిశీలించిన ఐజీ ఒంటిమిట్ట కోదండరాముని కల్యాణోత్సవ ఏర్పాట్లను రాయలసీమ ఐజీ వేణుగోపాల్‌కృష్ణ సోమవారం సాయంత్రం పరిశీలించారు. కల్యాణోత్సవ ఏర్పాట్లు, బారికేడ్లు, వీఐపీ వసతుల గురించి సీఐ ఉలసయ్య, ఎస్ఐ అరుణ్రెడ్డిలను అడిగి తెలుసుకున్నారు. ఆలయానికి వచ్చే వీఐపీలు, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఒంటిమిట్ట అభివృద్ధికి కృషి ఒంటిమిట్ట మండలం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని టీడీపీ జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి పేర్కొన్నారు. సీఎం బహిరంగ సభ జరిగే హైస్కూల్ ప్రాంగణాన్ని ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డితో కలిసి సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పరిచే యోచనలో ఉన్నామన్నారు. ముఖ్యంగా ఒంటిమిట్ట చెరువుకు నీరు తెప్పించి మండల ప్రజల తాగు, సాగునీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు. ముఖ్యమంత్రి చేత సోమశిల వెనుకజలాల నుంచి ఒంటిమిట్ట చెరువుకు నీరు తెప్పించే శిలాఫలకానికి 2వ తేదిన శంకుస్థాపన చేయనున్నట్లు వారు తెలిపారు. ఒంటిమిట్టను పర్యాటకంగా కూడా అన్ని విధాలా అభివృద్ధి పరుస్తామన్నారు. అనంతరం వారు ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్లు పరిశీలించారు. -
అంతా రామమయం..
రాజంపేట/ఒంటిమిట్ట : ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ధ్వజారోహణం కన్నుల పండువగా సాగింది. భక్తుల రామ నామ స్మరణతో ఆలయ పరిసరాలు ప్రతిధ్వనించాయి. స్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించారు. ధ్వజ స్తంభం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు డిప్యూటీ సీఎంకు అలయంలో వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి ఆయనకు కోదండరాముని చిత్రపటాన్ని అందజేశారు. తొలిసారిగా అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తున్న కోదండరాముని బ్రహ్మోత్సవాల్లో శనివారం శ్రీరామ, పోతన జయంతిని ఘనంగా నిర్వహించారు. దేవాదాయ శాఖ కమిషనర్ అనురాధ, కలెక్టరు కేవీ రమణ, జిల్లా ఎస్పీ నవీన్ గులాఠి, రాజంపేట ఆర్డీవో ప్రభాకర్పిళ్లై పర్యవేక్షణలో ఆలయంలో ఉత్సవాలు కొనసాగుతున్నాయి. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనువాస్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వరదరాజులరెడ్డి, పసుపులేటి బ్రహ్మయ్య, విజయమ్మ తదితరులు శనివారం నాటి కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు జిల్లా నలుమూల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి విచ్చేశారు. రూ.25 కోట్లతో రామాలయాభివృద్ధి రూ.25 కోట్లతో ఒంటిమిట్ట రామాలయాన్ని తొలి దశలో అభివృద్ధి చేస్తామని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి చెప్పారు. పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం ఆయనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తిరుమల స్థాయిలో ఒంటిమిట్ట ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. ప్రభుత్వ లాంచనాలతో ఉత్సవాలు నిర్విహ స్తుండటం వల్ల ఒంటిమిట్ట ఆలయానికి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు దక్కిందన్నారు. ఈ జిల్లా అంటే సీఎంకు ప్రేమాభిమానం ఉందన్నారు. తిరుమల నుంచి దేవుని కడప వరకు ఆలయాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిందని వివరించారు. ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు, ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోదండ రామున్ని వేడుకున్నానని చెప్పారు. రాబోయే రోజుల్లో భక్తులు ఒంటిమిట్ట కోదండరామాలయం వద్ద బస చేసేలా సౌకర్యాలు కల్పిస్తామన్నారు. సోమశిల వెనుక జలాలను ఒంటిమిట్ట చెరువుకు రప్పించే కార్యక్రమానికి 2వ తే దీన శిలాఫలకం ఆవిష్కరణ ఉంటుందని చెప్పారు. సామాన్య భక్తులకు తప్పని ఇక్కట్లు శ్రీరామనవమి సందర్భంగా ఆలయానికి వీఐపీల తాకిడి అధికమైంది. డిప్యూటీ సీఎం, రాష్ట్ర మంత్రి కామినేనితోపాటు అధికార పార్టీకి చెందిన నేతలు అధిక సంఖ్యలో రావడంతో గర్భగుడి వద్ద తోపులాట చోటు చేసుకుంది. వీఐపీల తాకిడితో సామాన్య భక్తులకు ఇక్కట్లు ఎదురయ్యాయి. చిన్నపిల్లలు, వృద్ధులు అల్లాడిపోయారు. ఆలయం లోపల పలువురు రాజకీయ నేతలు ఎవరంతకు వారు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఒక దశలో విధి నిర్వహణలో ఉన్న పోలీసులను సైతం లెక్కచేయని పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఆలయానికి తొలిసారిగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు రావడంతో వేలాదిగా వచ్చే భక్తులకు ఏ విధంగా స్వామి వారి దర్శనం కల్పించాలనే విషయంలో నిర్వహణ లోపం కొట్టిచ్చినట్లు కన్పించింది. రెవెన్యూ, దేవదాయ శాఖ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో పోలీసులు కూడా నిస్సహాయ స్థితిలో ఉండిపోవాల్సి వచ్చింది. క్యూ సిస్టమ్ సరిగా లేదని, స్వామిని కనులారా దర్శించుకునే భాగ్యం కల్పించాలని సామాన్య భక్తులు కోరుతున్నారు. ఆలయం వెలుపల, లోపల అసౌకర్యంగా క్యూలు ఏర్పాటు చేశారు. గర్భగుడి ఆలయం ప్రధాన ముఖ ద్వారం వద్ద నుంచి (పైకి)క్యూ లోపలికి వెళుతుంది. అక్కడే భక్తులు పడరాని కష్టాలు పడ్డారు. ఎర్రని ఎండకు పిల్లలు, వృద్ధులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ప్రముఖులు వచ్చిన సందర్భంలో కూడా సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనం భాగ్యం కలిగించే దిశగా దేవదాయ శాఖ చర్యలు చేపట్టాల్సి ఉంది. భక్తులు పాద రక్షలు బయట వదిలి పెట్టేందుకు తగిన ఏర్పాట్లు చేయలేదు. ఆలయ మండపం వద్ద కాకుండా ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసి.. ప్రసాద వితరణ చేస్తే బావుంటుంది. 2వ తేదీ కల్యాణోత్సవం నాటికైనా ఈ లోపాలను అధిగమిస్తే బావుంటుందని భక్తులు పేర్కొంటున్నారు.