ఒంటిమిట్ట కోదండరామాలయం
రాజంపేట : రెండో అయోధ్యగా ప్రసిద్ధి చెందిన ఒంటిమిట్ట కోదండరామాలయ బ్రహ్మోత్సవాలు ఈ నెల 24 నుంచి జరగనున్నాయి. ఉత్సవాల నిర్వహణ, భక్తులకు సౌకర్యాల కల్పన తదితర అంశాలపై టీటీడీ అధికారులు ఇంత వరకు సమీక్ష నిర్వహించలేదు. 13 రోజుల్లో ఏర్పాట్లు పూర్తి కావాల్సి ఉంది. ఇప్పటి వరకు జిల్లా యంత్రాంగంతో తిరుమల తిరుపతి దేవస్థానం కలిసి చేయాల్సిన వాటిపై చర్చలు లేవు. మరో వైపు శాశ్వత అభివృద్ధి పనుల కన్నా.. బ్రహ్మోత్సవాల సమయంలో తాత్కాలిక పనులు చేపట్టి ఉత్సవాలను పూర్తి చేసుకుని వెళ్లడం పైనే టీటీడీ దృష్టి సారిస్తోంది. తొలిసారిగా టీటీడీ చేపట్టిన ఉత్సవాల సమయంలో.. రామాలయాన్ని రూ.100 కోట్లతో అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇందులో రూ.40 కోట్ల వరకు శాశ్వత, తాత్కాలిక పనులకు వెచ్చించినట్లుగా తెలుస్తోంది.
ప్రచారమేదీ?: ఒంటిమిట్ట కోదండ రామాలయం (ఏకశిలానగరం)లో ఈ సారి జరిగే బ్రహ్మోత్సవాలకు ప్రచారం ఊపందుకోలేదు. దీనికి సంబంధించి సమీక్షలు, పోస్టర్ల ఆవిష్కరణలు టీటీడీ ఏడీ బిల్డింగ్‌లో కాకుండా ఏకశిలానగంలో చేసి ఉంటే బాగుండేదని, తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మోత్సవాలకు ప్రచారం జరిగి ఉండేదని జిల్లా వాసులు అభిప్రాయ పడుతున్నారు. తిరుపతిలో అనేక ఆలయాలకు సంబంధించి పోస్టర్ల ఆవిష్కరణ, సమీక్షలు జరుగుతుంటాయి. కాబట్టే ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు పెద్దగా ప్రాచుర్యం లేకుండా పోయిందనే అపవాదును టీటీడీ మూటకట్టుకుంది. ఇప్పటి వరకు ఈఓ సింఘాల్ ఇటు వైపు కన్నెత్తి చూడలేదన్న విమర్శలున్నాయి. టీటీడీ వైఖరిని స్థానిక ప్రజాప్రతినిధులు జీర్ణించుకోలేక పోతున్నారు. తమ భాగస్వామ్యం లేకుండా పోయిందనే ఆవేదన వారిలో నెలకొంది.
గత బ్రహ్మోత్సవాలను ఓ సారి పరిశీలిస్తే..
గత బ్రహ్మోత్సవాలతో ఈ సారి ఏర్పాట్లను పోల్చుకుంటే వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. గతంలో బ్రహ్మోత్సవాల పనులకు సంబంధించి టీటీడీ ఈఓ సాంబ శివరావు ఒంటిమిట్టలో జిల్లా యంత్రాంగంతోపాటు టీటీడీ అధికారులను సమన్వయం చేసే విధంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. అప్పట్లో రూ.3.20 కోట్ల వ్యయంతో అన్ని హంగులతో కల్యాణ వేదిక ఏర్పాటు చేశారు. ఈ సారి ఆ వ్యయం రూ.3.50 కోట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయని టీటీడీ అధికారులు భావిస్తున్నారు.
ఈ సారైనా అందుబాటలోకి వచ్చేనా..!
కోదండరామున్ని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు, యాత్రికులు, పర్యాటకుల కోసం రూ.5 కోట్లతో విడిది సముదాయ భవనం నిర్మించారు. ఈ భవన నిర్మాణాన్ని రూ.3.20 కోట్లతో చేపట్టారు. రూ.1.83 కోట్లతో ఇతర మౌలిక వసతులు కల్పించనున్నారు. గతేడాది టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి శంకు స్థాపన చేశారు. గతేడాది సీఎంతో ప్రారంభించాలనుకున్నారు. కానీ వీలుపడలేదు. దీంతో అందుబాటులోకి రాలేకపోయింది. ఈ సారైనా అందుబాటులోకి తేవాలని భక్తులు కోరుతున్నారు.
గత పొరపాట్లను సరిద్దుకునేనా..
2017 బ్రహ్మోత్సవాల సందర్భంగా చోటు చేసుకున్న పొరపాట్లను టీటీడీ సరిదిద్దుకునేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భక్తులకు సరైన రీతిలో భోజన వసతి కల్పించలేదు. ఆర్టీసీ బస్సులను ఆలయానికి సమీపంలో ఏర్పాటు చేయలేదు. చాలా మంది భక్తులు కల్యాణం చూడలేక వెనుదిరిగారు. వారికి స్వామి కల్యాణానికి సంబంధించిన ముత్యాల తలంబ్రాలు అందలేదు. మరుగుదొడ్లు, మంచినీటి వసతి అంతంత మాత్రంగానే కల్పించారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా టీటీడీ ముందస్తు ప్రణాళికతో ముందుకెళ్లాలని భక్తులు కోరుతున్నారు. ఆ దిశగా జిల్లా యంత్రాంగం సహకారంతో టీటీడీ పూర్తిగా తీసుకుంటేనే బ్రహ్మోత్సవాలు విజయవంతమయ్యే పరిస్థితులు ఉన్నాయని వారు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment