ఒంటిమిట్ట : బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఒంటిమిట్ట కోదండరాముడు వటపత్రసాయి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజామున ఆలయంలోని మూలవిరాట్‌లకు ప్రత్యేక పూజలు, అభిషేకాల అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన ప్రత్యేక పుష్పాలతో అలంకరించారు. వటపత్ర సాయి అలంకారంలో రాముల వారు పురవీధుల్లో ఊరేగారు. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో బారులుతీరారు.
అన్ని సౌకర్యాలతో శ్రీకోదండరామనగర్
కోదండరామాలయ పరిసర ప్రాంతాల్లో ఇళ్లు కోల్పోయిన బాధితులకు అన్ని సౌకర్యాలతో శ్రీకోదండరామనగర్ నిర్మిస్తామని ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి చెప్పారు. ఇళ్లు కోల్పోయిన 86 మంది బాధితులకు చెక్కులు, హామీ పత్రాలను సోమవారం స్థానిక హరిత కల్యాణ మండపంలో కలెక్టర్ కేవీ రమణతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా మేడా మాట్లాడుతూ కోదండరామాలయ పరిసరాల్లో ఇళ్లు కోల్పోయిన వారు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అందమైన కాలనీ నిర్మిస్తామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలను నిలబెట్టుకుంటామన్నారు.
చిన్న చిన్న సమస్యలు ఉంటే తమ ద్వారా పరిష్కరించుకోవాలని బాధితులను కోరారు. ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల అనంతరం హౌసింగ్ అధికారులు ఇళ్లు నిర్మించే పనిలో నిమగ్నమవుతారన్నారు. ఆర్‌అండ్‌బీ అధికారులు నిర్ణయించిన మొత్తం కంటే వంద శాతం నష్టపరిహారం అదనంగా చెల్లిస్తున్నామని తెలిపారు. నాలుగు నెలల్లో ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. లబ్ధిదారులకు అధికారుల ద్వారానే ఇళ్లు నిర్మించి ఇస్తామని కలెక్టర్ కేవీ రమణ పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన విధంగా కాలనీ ఏర్పాటు చేస్తామని, ఇంటి లోపలి భాగాన్ని లబ్ధిదారులు వారికి ఇష్టమొచ్చిన విధంగా తీర్చిదిద్దుకోవచ్చన్నారు.
భక్తులకు ఇక్కట్లు కలుగకుండా ఏర్పాట్లు
బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కేవీ రమణ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక హరిత రెస్టారెంట్‌లో జిల్లా స్థాయి అధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
వీఐపీలు, భక్తులకు ప్రత్యేకంగా కంపార్ట్‌మెంట్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. కల్యాణోత్సవానికి హాజరయ్యే భక్తులకు భోజనం, నీటి వసతిని కల్పించేందుకు అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తగినన్ని బారికేడ్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. పారిశుద్ధ్యం, నీటి సమస్య తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ అనిల్‌కుమార్‌రెడ్డి, ఏజేసీ చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్డీఓ ప్రభాకర్‌పిళ్లై పాల్గొన్నారు.
ఏర్పాట్లు పరిశీలించిన ఐజీ
ఒంటిమిట్ట కోదండరాముని కల్యాణోత్సవ ఏర్పాట్లను రాయలసీమ ఐజీ వేణుగోపాల్‌కృష్ణ సోమవారం సాయంత్రం పరిశీలించారు. కల్యాణోత్సవ ఏర్పాట్లు, బారికేడ్లు, వీఐపీ వసతుల గురించి సీఐ ఉలసయ్య, ఎస్‌ఐ అరుణ్‌రెడ్డిలను అడిగి తెలుసుకున్నారు. ఆలయానికి వచ్చే వీఐపీలు, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.
ఒంటిమిట్ట అభివృద్ధికి కృషి
ఒంటిమిట్ట మండలం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని టీడీపీ జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి పేర్కొన్నారు. సీఎం బహిరంగ సభ జరిగే హైస్కూల్ ప్రాంగణాన్ని ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డితో కలిసి సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పరిచే యోచనలో ఉన్నామన్నారు.
ముఖ్యంగా ఒంటిమిట్ట చెరువుకు నీరు తెప్పించి మండల ప్రజల తాగు, సాగునీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు. ముఖ్యమంత్రి చేత సోమశిల వెనుకజలాల నుంచి ఒంటిమిట్ట చెరువుకు నీరు తెప్పించే శిలాఫలకానికి 2వ తేదిన శంకుస్థాపన చేయనున్నట్లు వారు తెలిపారు. ఒంటిమిట్టను పర్యాటకంగా కూడా అన్ని విధాలా అభివృద్ధి పరుస్తామన్నారు. అనంతరం వారు ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్లు పరిశీలించారు.