ఒంటిమిట్టలో కూలిపోయిన చలువ పందిరి
సాక్షి, కడప/రాజంపేట: వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి కల్యాణోత్సవం సందర్భంగా తీవ్ర అపశ్రుతి చోటుచేసు కుంది. ఆరాధ్య దైవం కల్యాణాన్ని కళ్లారా చూసి తరిద్దామని వచ్చిన నలుగురు భక్తులు వర్ష బీభత్సానికి మృత్యువాత పడ్డారు. మరో 80 మంది దాకా గాయాల పాలయ్యారు. వీరి లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలి సింది. శ్రీరాముడు–సీతమ్మల వివాహం సందర్భంగా వెలుగులతో కళకళలాడాల్సిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం వరుణదేవుడి ప్రతాపానికి అంధకారంగా మారింది.
కుండపోత వర్షం: ఒంటిమిట్ట ఆలయంలో శుక్రవారం స్వామివారి కల్యాణోత్సవాన్ని తిలకించడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. సాయంత్రం 6.30 గంటలకు ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమైంది. వెనువెంటనే ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వాన మొదలైంది. గంటకుపైగా కుండపోత వర్షం కురిసింది. ఒకవైపు విపరీతమైన గాలులు, మరోవైపు ఉరుముల శబ్దాలతో ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొంది. కల్యాణోత్సవం కోసం ఏర్పాటు చేసిన ఫోకస్ లైట్ల స్తంభాలు, డెకరేషన్ లైట్లతో అలంకరించిన బొమ్మలు ఈదురుగాలుల ధాటికి కూలిపోయాయి. చలువ పందిళ్లకు వేసిన టెంట్లు, రేకులు కూడా లేచిపోయాయి. వడగండ్లు రేకులపై పడుతుండడంతో భక్తులు భయకంపితులయ్యారు. కోదండ రామస్వామి ఆలయ పరిసరాల్లో ఉన్న వేపచెట్లు నేలకూలగా, అక్కడే ఉన్న చలువ పందిరి కూలిపోయింది. అధికారులు వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో ఆలయ పరిసరాల్లో అంధకారం నెలకొంది.
ప్రాణాలు తీసిన లైట్లు: ఆలయ సమీపంలో కల్యాణోత్సవం వేదిక రేకులు కూలిపోయి నలుగురు మృత్యువాత పడ్డారు. బద్వేలు ఎస్సీ కాలనీకి చెందిన చిన్నయ్య(48) మృతి చెందాడు. ఫోకస్ లైట్లు మీద పడడంతో పోరుమామిళ్లకు చెందిన చెంగయ్య(70) అనే వృద్ధుడు చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఒంటిమిట్టకు చెందిన వెంకట సుబ్బమ్మ(65) అనే భక్తురాలు దక్షిణ గోపురం వద్ద కొయ్యలు మీదపడటంతో మృతి చెందారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం పట్టణానికి చెందిన మీనా(45) రాములోరి కల్యాణానికి వచ్చి గాయపడి, తుదిశ్వాస విడిచారు. వడగళ్ల వానకు రేకులు గాలికి లేచి పడడం, విరిగిన చెట్లు తగలడం, డెకరేషన్ లైట్లు మీదపడడం వంటి కారణాలతో దాదాపు 80 మంది గాయపడ్డారు. అందులో 25 మందిని కడప రిమ్స్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఐదుగురిని తిరుపతికి తరలించినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. సాయంత్రం 6.30 సమయంలో విద్యుత్ నిలిపివేయడంతో అప్పటి నుంచి రాత్రి 9.30 వరకు ఆలయం అంధకారంలోనే ఉండిపోయింది.
వానలోనే వచ్చిన సీఎం చంద్రబాబు
ప్రత్యేక విమానంలో సాయంత్రం 5.40 గంటలకు కడపకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ల్యాండింగ్ అవుతుండగానే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం మేఘావృతమైంది. భారీగా గాలులు వీచాయి. సీఎంకు స్వాగతం పలుకుతూ దారిపొడవునా ఏర్పాటు చేసిన కటౌట్లు, ఫ్లెక్సీలు నేలకూలాయి.బాబు ఎయిర్‌పోర్టు నుంచి కడప ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌కు చేరుకునే వరకూ గాలి వీస్తూనే ఉంది. ఆయన గెస్ట్‌హౌస్‌లోకి అడుగుపెట్టిన వెంటనే ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం మొదలైంది. చూస్తుండగానే బీభత్సం సృష్టించింది. కడప శివారులో పిడుగులు పడ్డాయి. గెస్ట్‌హౌస్‌లో గంటకుపైగా ఉన్న సీఎం రాత్రి 8 గంటలకు వర్షంలోనే ఒంటిమిట్టకు బయల్దేరారు. చంద్రబాబు దంపతులు ఆలయంలో పూజల అనంతరం కల్యాణవేదిక వద్దకు చేరుకుని స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు.
ఒంటిమిట్ట ఘటన దురదృష్టకరం: ఆకేపాటి
ఒంటిమిట్టలో వర్ష బీభత్సం వల్ల నలుగురు చనిపోవడం దురదృష్టకరమని వైఎస్సార్‌సీపీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి అన్నారు. మృతి చెందిన వారికి చెందిన ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. గాయపడిన వారికి కూడా పరిహారం చెల్లించాలన్నారు.
వైఎస్ జగన్ సంతాపం
అకాల వర్షం, గాలి బీభత్సానికి శుక్రవారం ఒంటిమిట్టలో నలుగురు మృతిచెందడంపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment