![Center has already provided two tranches of assistance under PM Kisan](/styles/webp/s3/article_images/2025/02/16/farmer_0.jpg.webp?itok=dr_0NFNu)
అన్నదాతకు సున్నం..
ప్రతి రైతుకు రూ.20 వేలు పెట్టుబడి సాయం ఇస్తామని కూటమి హామీ
ఆ మేరకు 53.58 లక్షల మంది రైతులకు రూ.10,717 కోట్లు జమ చేయాలి
అధికారంలోకి వచ్చాక పీఎం కిసాన్‌తో కలిపి ఇస్తామని వెల్లడి
ఆ లెక్కనైనా ఈపాటికి రూ.7,502 కోట్లు ఇవ్వాలి
కేంద్రం రెండు విడతల పీఎం కిసాన్ సాయం విడుదల
మూడో విడత సాయానికీ కేంద్రం సిద్ధం
ఇప్పటికీ పైసా విదల్చని రాష్ట్ర ప్రభుత్వం
మార్గదర్శకాలు కూడా రూపొందించని చంద్రబాబు సర్కారు
సాక్షి, అమరావతి: 2014లో అధికారంలోకి వచ్చాక హామీలు అమలు చేయకుండా రైతులు సహా అన్ని వర్గాల ప్రజలను నిలువునా వంచించిన చంద్రబాబు.. ఇప్పుడూ అదే పనిలో ఉన్నారు. అప్పట్లో రైతు రుణాలు మాఫీ చేస్తామంటూ ఓట్లేయించుకొని, నిలువునా ముంచగా.. ఇప్పుడు అన్నదాత సుఖీభవ పథకం కింద పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పి, రైతులను మరోసారి నిలువునా వంచించారు. ఈ పథకం కింద ప్రతి రైతుకు రూ.20 వేల పెట్టుబడి సాయం అందిస్తామన్న హామీని చంద్రబాబు అటకెక్కించేశారు.
అధికారంలోకి రాగానే పథకాన్ని అమలు చేస్తామని ఎన్నికల్లో కూటమి నేతలు చెప్పారు. అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత మాట మార్చేశారు. పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సాయంతో కలిపి పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పారు. పీఎం కిసాన్ కింద ఇప్పటికే కేంద్రం రెండు విడతలు సాయం అందజేసింది. చంద్రబాబు సర్కారు పైసా ఇవ్వలేదు.
మూడో విడత పీఎం కిసాన్‌తో కలిపి ఇస్తామని సంక్రాంతి పండుగ వేళ సీఎం చంద్రబాబు ప్రకటించారు. కేంద్రం మూడో విడత పీఎం కిసాన్ సాయానికి ఏర్పాట్లు చేస్తోంది. అయినా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతకు సాయమందించే దిశగా ఒక్క అడుగు కూడా వేయలేదు. మిగిలిన పథకాల మాదిరిగానే ఈ పథకాన్ని కూడా ఈ ఏడాది పూర్తిగా ఎగ్గొడితే మేలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తాజా పరిణామాలు చెబుతున్నాయి.
ఎగ్గొట్టడమే మేలన్న భావనలో ప్రభుత్వం
వాస్తవంగా చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని అర్హత పొందిన 53.58 లక్షల మంది రైతులకు రూ.20 వేల చొప్పున రూ.10,717 కోట్లు జమ చేయాలి. అధికారంలోకి వచ్చాక పీఎం కిసాన్ సాయంతో కలిపి ఇస్తామని చెప్పారు. ఆ లెక్కన చూసినా ఈపాటికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.7,502 కోట్లు జమ చేయాలి. ఓ వైపు గద్దెనెక్కిన నాలుగో రోజే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ తొలి విడత సాయం జమ చేసింది.
రెండు విడతల్లో 41.84 లక్షల మందికి రూ.1,661.50 కోట్లు అందజేసింది. మూడో విడతలో మరో రూ.840 కోట్లు జమ చేయబోతోంది. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఒక్క పైసా జమ చేయలేదు. 2024–25 బడ్జెట్‌లో ఈ పథకానికి కేవలం రూ.1000 కోట్లు విదిల్చిన చంద్రబాబు ప్రభుత్వం.. పథకం అమలుపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. కనీసం మార్గదర్శకాలు రూపొందించలేదు.
పీఎం కిసాన్ సాయం రూ.2 వేలతో పాటు ఈ ఏడాది అన్నదాత సుఖీభవ కింద రూ.2 వేలు ఇస్తే సరిపోతుందని తొలుత భావించారు. అలా ఇస్తే విమర్శలు వెల్లువెత్తుతాయన్న భావనతో తల్లికి వందనం, మత్స్యకార భరోసా మాదిరిగా అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా ఈ ఏడాది పూర్తిగా ఎగ్గొట్టడమే మేలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా చెబుతున్నారు. 2025–26 సీజన్ నుంచే పీఎం కిసాన్‌తో కలిపి 3 విడతల్లో అమలు చేయాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్టుగా చెబుతున్నారు.
చెప్పిన దానికంటే ఎక్కువగా ఇచ్చిన జగన్
ప్రజలకు మేలు చేయడంలో వైఎస్ జగన్‌కి ఉన్న చిత్తశుద్ధి చంద్రబాబు ప్రభుత్వానికి లేదని రైతులు అంటున్నారు. వైఎస్ జగన్ ఇచ్చిన మాటకంటే మిన్నగా తొలి ఏడాది నుంచే వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా 3 విడతల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందించిన విషయాన్ని రైతులు గుర్తు చేసుకుంటున్నారు.
ఐదేళ్లలో 53.58 లక్షల మందికి రూ.34,288.17 కోట్లు జమ చేసి వైఎస్ జగన్ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా నిలిచింది. టీడీపీ కూటమి ప్రభుత్వం మాత్రం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అటకెక్కించేస్తుండడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ ఏడాది పెట్టుబడిసాయం లేనట్టే..
అన్నతాద సుఖీభవ కింద ప్రతి రైతుకు రూ.20 వేలు పెట్టుబడి సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. 9 నెలలు గడుస్తున్నా పైసా కూడా విదల్చలేదు. ఈ ఏడాది ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు కని్పంచడం లేదు. – ఎం.హరిబాబు, ప్రధాన కార్యదర్శి, ఏపీ కౌలు రైతుల సంఘం
Comments
Please login to add a commentAdd a comment