
రాయలసీమ రైతుల కష్టాలకు ముఖ్యమంత్రి అసమర్థతే కారణం
తెలంగాణ అక్రమ ప్రాజెక్టులపై నోరెత్తలేని నిస్సహాయత
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజం
నెల్లూరు(బారకాసు): రాయలసీమ లిఫ్ట్‌కు సీఎంగా వైఎస్ జగన్ శ్రీకారం చుడితే, చంద్రబాబు సమాధి కడుతున్నారని వైఎస్సార్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. నెల్లూరులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీమ రైతుల కన్నీటి కష్టాలకు బాబు స్వార్థ రాజకీయాలే కారణమని.. నీటి పంపకాలలో అన్యాయం జరుగుతున్నా తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశి్నంచలేని అసమర్థుడు అని ధ్వజమెత్తారు. తానూ రాయలసీమకు చెందినవాడినేనని, 15 ఏళ్లు సీఎంగా చేశానని చెప్పుకోవడమే తప్ప, రైతాంగానికి చంద్రబాబు ఒక్క మేలు కూడా తలపెట్టలేదన్నారు. శ్రీశైలంలో 800 అడుగుల నుంచి రోజుకు 3 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు
హెడ్ రెగ్యులేటర్ దిగువన కుడి ప్రధాన కాల్వలోకి ఎత్తిపోసేందుకు గత ప్రభుత్వం నిర్ణయించిందని.. హక్కుగా దక్కిన నీటిని వాడుకోవడానికి రూ.3,825 కోట్లతో 2020 మే 5న రాయలసీమ లిఫ్ట్ నిరి్మంచేందుకు ఆమోదం తెలిపిందన్నారు. తద్వారా చెన్నైకి 15 టీఎంసీలు, ప్రాజెక్టుల కింద 9.6 లక్షల ఎకరాలకు నీరివ్వాలనేది లక్ష్యంగా చెప్పారు.
సీమ లిఫ్ట్‌ను అడ్డుకునేందుకు చంద్రబాబు అడుగడుగునా కుట్రలకు పాల్పడ్డారని, ఎన్జీటీ (చెన్నై) బెంచ్‌లో తెలంగాణ టీడీపీ నేతలతో పిటిషన్ వేయించారని తెలిపారు. హక్కుగా కేటాయించిన 44 వేల క్యూసెక్కులను వాడుకుంటున్నామని ఈఏసీ ఎదుట సమర్థంగా వాదించలేక కూటమి ప్రభుత్వం చేతులెత్తేసిందని కాకాణి మండిపడ్డారు. శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టం 798 అడుగుల్లోనే తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తి పేరుతో నీటిని తోడేస్తోందని.. 800 అడుగులకు చేరగానే సాగుకు విడుదల చేసుకుంటున్నారని, అయినా చంద్రబాబు ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శించారు.
వైఎస్ జగన్‌కు పేరొస్తుందనే..
రాయలసీమ లిఫ్ట్ పూర్తయితే వైఎస్ జగన్‌కు పేరొస్తుందనే కుట్రతో, రైతుల జీవితాలను చంద్రబాబు పణంగా పెట్టారని కాకాణి మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్ పనులను కొనసాగించినా బాబు కిమ్మనలేదని విమర్శించారు. స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రాజెక్టులను తాకట్టు పెడుతున్న చంద్రబాబు.. రైతుల దృష్టి మళ్లించేందుకు బనకచర్ల పేరతో కొత్త డ్రామాకు తెరతీశారని కాకాణి పేర్కొన్నారు.
ఓవైపు పోలవరం నీటిని బనకచర్లకు తీసుకెళ్తామని, సముద్రంలోకి వృథాగా పోయే బదులు సీమకు తీసుకెళ్తామంటే అభ్యంతరం చెప్పొద్దని తెలంగాణకు సూచిస్తున్నారని తెలిపారు. మరోవైపు తన శిష్యుడు, తెలంగాణ సీఎం రేవంత్ ద్వారా అభ్యంతరాలు లేవనెత్తేలా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ప్రచారం కోసమే చంద్రబాబు ఈ ప్రాజెక్టును వాడుకుంటున్నారని, అంతే తప్ప.. ప్రాజెక్ట్‌ల విషయంలో ఆయనకు మొదటి నుంచి చిత్తశుద్ధి లేదని కాకాణి ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment