సీఎం లెక్క.. 42 శాతం అవినీతి
ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి
సాక్షి, విజయవాడ బ్యూరో/హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లెక్కల ప్రకారం రెవెన్యూశాఖలో 42 శాతం అవినీతి ఉందని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి వెల్లడించారు. అయితే శాఖ మొత్తం అవినీతిమయం అని కాకుండా ఇంకా 58 శాతం నిజాయితీగా పనిచేస్తున్న కోణంలో చూడాలని వ్యాఖ్యానించారు. రెవెన్యూ శాఖలో అందరూ ‘మహాత్మా గాంధీ’లే ఉండరని, ఇంత పెద్ద వ్యవస్థలో అక్కడక్కడ లోపాలు ఉంటాయని స్పష్టం చేశారు. రెవెన్యూ మొత్తం అవినీతిమయమనే ప్రచారం చేయడం సరికాదన్నారు.
విజయవాడలోని మురళీ ఫార్చ్యూన్ హోటల్‌లో గురువారం సర్వే సెటిల్‌మెంట్‌శాఖ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం కేఈ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు బుధవారం నిర్వహించిన రెవెన్యూ సమీక్షా సమావేశాన్ని కూడా కొన్ని పత్రికలు వక్రీకరించాయని పేర్కొన్నారు. రెవెన్యూ అవినీతిపై కథనాలు రాసినందుకే సీఎం ఆ సమావేశాన్ని నిర్వహించారంటూ కొందరు కాలర్ ఎగరేస్తున్నారని వ్యాఖ్యానించారు.