‘తమ్ముడి’ పెత్తనం!
టీడీపీలో అధికార దుర్వినియోగం పరాకాష్టకు చేరింది. ఒక్కరికి పదవి దక్కితే చాలు.. కుటుంబ సభ్యులంతా పెత్తనం చెలాయించొచ్చు. ఎలాంటి హోదా లేకపోయినా అధికారులను ముప్పుతిప్పలు పెట్టొచ్చు. తాజాగా ఓ ‘తమ్ముడు’ తన ఇల్లు కేంద్రంగా సమీక్ష నిర్వహించిన తీరు అధికార వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. గురువారం డోన్ పట్టణంలోని తన ఇంట్లో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రతాప్ మండల అధికారులతో సమావేశం నిర్వహించారు. డోన్ మున్సిపల్ కమిషనర్ రమేష్‌బాబు, చైర్‌పర్సన్ గాయత్రిదేవి, ఆర్‌డబ్ల్యుఎస్ డీఈ మల్లిఖార్జున, హౌసింగ్ డీఈ రాధాకృష్ణమూర్తి, ఎంపీడీఓ క్యాథరిన్, వ్యవసాయశాఖ ఏడీ నర్సిరెడ్డి, ఏఓ బాలవర్దిరాజు హాజరయ్యారు.
కార్యకర్తలు ఆ పనీ.. ఈ పనీ నేతకు చెప్పడం, ఆయన అధికారులకు ఆదేశాలు ఇవ్వడం చూస్తే ఏ స్థాయిలో ఆయన పెత్తనం చెలాయిస్తున్నారో అర్థమవుతోంది. పది రోజుల క్రితం సబ్ డివిజన్ స్థాయి అధికారులతో.. అంతకు ముందు తన అన్న ఏర్పాటు చేసిన జలవనరుల శాఖ సమీక్షలోనూ ఆయన హవా చాటుకున్నారు. ఆయనకు ఎలాంటి హోదా లేకపోయినా అధికారులు పదేపదే ఆ ఇంటి గడప తొక్కాల్సి వస్తుండటం గమనార్హం. ప్రజలు ఓట్లేసి పట్టం కట్టిన ఎమ్మెల్యేను కాదని.. ఆ నాయకుడు అధికారులను తన చెప్పుచేతల్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తుండటం విమర్శల పాలవుతోంది.