కేవలం రెండు రూపాయలకే ప్రతి పల్లెకు 20 లీటర్ల మినరల్ వాటర్ అందజేస్తామని ఎన్నికల ప్రచారంలో టీడీపీ ఇచ్చిన హామీ.
ఒంగోలు: కేవలం రెండు రూపాయలకే ప్రతి పల్లెకు 20 లీటర్ల మినరల్ వాటర్ అందజేస్తామని ఎన్నికల ప్రచారంలో టీడీపీ ఇచ్చిన హామీ. ఈ పథకానికి పెట్టిన పేరు ‘ఎన్టీఆర్ సుజల పథకం’. చంద్రబాబు ప్రకటించిన అయిదు సంతకాల్లో ఇది కూడా ఒకటి. జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 818, మున్సిపాల్టీల్లో 98 ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకు వ్యయం కనీసంగా రూ.32 కోట్లు అవుతుందని భావిస్తున్నారు.
నిర్మాణం ఇలా...
ఈ పథకాన్ని ప్రారంభించేందుకు సంబంధిత ఆవాస ప్రాంతంలో ఏదో ఒక ప్రభుత్వ భవనం లేదా కమ్యూనిటీ హాలులో దీన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే దానికి తప్పనిసరిగా కరెంటు సౌకర్యం ఉండాలి. అక్టోబరు 2వ తేదీ అంటే గాంధీ జయంతి నాటికి ప్రతి మండలానికి కనీసం ఒక ప్లాంట్ నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశాలు అందాయి. కానీ చేతిలో దాతలు ఇచ్చే పైకం మాత్రం లేదు. ప్రతి గంటకు వెయ్యి లీటర్లను శుద్ధిచేసే ప్లాంట్‌కు కనీసంగా రూ.3 లక్షలు ఖర్చు అవుతుంది.
ఇంత పెద్ద మొత్తంలో విరాళాలు సేకరించాలంటే బిగ్‌షాట్సే లక్ష్యంగా పెట్టుకోవాలి. ప్రభుత్వంలోని పలు కీలకమైన విభాగాలకు ఈ బాధ్యత అప్పగిస్తున్నారు. ముఖ్యంగా గ్రానైట్ వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు, వీటిని పర్యవేక్షించే శాఖాధికారులను అప్రమత్తం చేశారు. ఇక వ్యాపారులపై కూడా కన్ను పడింది. ఏదో ఓ లొసుగు బయటకు తీసి విరాళాల ఒత్తిడి తేవడానికి పక్కా ప్లాన్ తయారు చేసుకున్నారు టీడీపీ నేతలు. డబ్బు ఒకరిది ... డాబు మరొకరిది ... ఇదేమి పథకమంటూ ఇప్పటికే ఒత్తిడికి గురవుతున్న అజ్ఞాత దాతలు మదనపడుతున్నారు.