
డేంజర్ వాటర్ !
- గుర్తింపులేని మినరల్ వాటర్ తాగితే రోగాలబారిన పడటం ఖాయం
- టీడీఎస్ స్థాయిని గణనీయంగా తగ్గిస్తున్న ప్లాంట్ల నిర్వాహకులు
- ముప్పని తెలిసినా చోద్యం చూస్తున్న ప్రజారోగ్య శాఖ అధికారులు
ఇదిగో! ఈ ఫొటో చూడండి ! మినరల్ వాటర్‌కోసం క్యూలో ఎలా నిలుచున్నారో! భూగర్భజలం మంచిది కాదని, మినరల్ వాటర్ ‘సురక్షితమని’ వీరి భావన. వాస్తవానికి మినరల్ వాటర్ సేవిస్తే...అనారోగ్యానికి దగ్గర పడుతున్నట్లే ! ఎందుకంటే మినరల్ వాటర్‌లో శరీర సమతుల్యతకు అవసరమైన మూలకాలను పూర్తిగా తొలగించి ఏమాత్రం పనికిరాని నీళ్లను ‘మినరల్’వాటర్ పేరుతో సేవిస్తున్నారు. భవిష్యత్తులో తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.
సాక్షి, చిత్తూరు: కలుషిత నీటి భయంతో ఫిల్టర్ నీటిని సేవిస్తున్న లక్షలాది ప్రజలకు గుర్తింపు లేని మినరల్ వాటర్ ఫిల్టర్ ప్లాంట్లు మరో ముప్పును తెచ్చి పెడుతున్నాయి. శుద్ధి చేసిన క్యాన్, బాటిల్, ప్యాకెట్ ద్వారా విక్రయిస్తున్న నీటిని తాగితే రోగాలు త థ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందులో కరిగిన ఘన పదార్థాల శాతాన్ని (టీడీఎస్- టోటల్ డిసాల్వ్‌డ్ సాలిడ్స్) అతి స్వల్ప మోతాదుకు తగ్గించడమే అందుకు ప్రధాన కారణం.
దీర్ఘకాలం ఈ నీటిని తాగితే మూత్రపిండాలు, హృదయ సంబంధిత వ్యాధులు, రక్తపోటు తప్పదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. జిల్లాలోని పట్టణ, పల్లె ప్రాంతాల్లో వందల సంఖ్యలో మినరల్ వాటర్ ప్లాంట్లు వెలిశాయి. వీటిలో పట్టుమని పది మినహా ప్లాంట్లన్నీ భారతీయ ప్రమాణాల సంస్థ(బీఐఎస్) గుర్తింపు లేకుండా వెలిసిన వే ! బీఐఎస్ సూచించిన 60 రకాల నాణ్యతా ప్రమాణాలు యథేచ్ఛగా ఉల్లంఘనకు గురవుతున్నా ప్రజారోగ్య అధికారులుగానీ, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ సంస్థలు కానీ మొద్దునిద్ర వీడడం లేదు.
స్వచ్ఛమైన నీరు అంటే..
హైడ్రోజన్, ఆక్సిజన్ మాత్రమే ఉన్న నీటిని స్వచ్ఛమైన నీరుగా వ్యవహరిస్తారు. దీన్ని శుద్ధజలం (డిస్టిల్డ్ వాటర్)గా పిలుస్తారు. ఈ నీటిని కర్మాగారాలకు వాడతారు. తాగేనీటిలో శరీరానికి అవసరమైన ఘన పదార్థాలు సరైన మోతాదులో ఉండటం తప్పనిసరి. కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వంటి ఉపయోగకర ఘనపదార్థాలను మనం నీటి ద్వారానే గ్రహిస్తూ ఉంటాం.
పట్టణీకరణ, పారిశ్రామికీకరణ నేపథ్యంలో భూగర్భజలాలు కలుషితమై సీసం, పాదరసం, ఫ్లోరిన్ లాంటి హానికర మూలకాలు కూడా తాగేనీటిలో కరిగి ఉన్నాయి. వీటిని తొలగించి శరీరానికి అవసరమైన మూలకాలను సరైన మోతాదులో ఉండేలా భూగర్భజలాలను శుద్ధి చేయాలి. కానీ చాలామంది ఈ ప్రక్రియను సరిగా నిర్వహించడం లేదు. హానికారకాలను తొలగించే ప్రక్రియలో భాగంగా చాలా ఫిల్టర్లు టీడీఎస్‌లను నామమాత్రపు స్థాయికి తగ్గిస్తున్నాయి. దీంతో తాగేనీటి ద్వారా శరీరం గ్రహించాల్సిన అవసరమైన మూలకాల మోతాదు గణనీయంగా తగ్గుతోంది. దీంతో ఇప్పటికిప్పుడు ప్రమాదం లేకపోయినా, దీర్ఘకాలంలో శరీరంలో ఘనపదార్థాల సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉంది. తాగేనీటిలో టీడీఎస్ మోతాదు కనీసం 80-150 మధ్య ఉండటం మంచిదని ప్రపంచ ఆరోగ్యసంస్థ సహా పలు సంస్థలు చెబుతున్నాయి. బోరుబావులు, మున్సిపాలిటీ ద్వారా అందే శుద్ధజలమే ఆరోగ్యానికి మంచిది.
టీడీఎస్ అంటే..
నీటిలో పూర్తిగా కరిగిన ఘన పదార్థాల శాతాన్ని టీడీఎస్‌గా వ్యవహరిస్తారు. లీటరు నీటిలో ఎన్ని మిల్లీగ్రాముల ఘన పదార్థాలు కరిగి ఉన్నాయో దీని ఆధారంగా లెక్కిస్తారు. ఉదాహరణకు ఓ ప్రాంతంలోని బోరు లేదా కొళాయి నుంచి సేకరించిన నీటిలో 500 టీడీఎస్ ఉందంటే ఈ నీటిలో లీటరుకు 500 మిల్లీగ్రాముల ఘనపదార్థాలు ఉన్నాయని అర్థం.
అక్రమాలు ఇలా..
ప్రస్తుతం పోటీని తట్టుకునేందుకు భూగర్భజలాలను ఎక్కువ మోతాదులో ఫిల్టర్ చేస్తున్నారు. దీంతో మినరల్స్ పూర్తిగా బయటకు వెళ్లిపోతున్నాయి. కొన్ని ప్లాంట్లలో రుచి కోసం కొన్ని రసాయనాలను కూడా ఉపయోగిస్తున్నారు. బీఐఎస్ ప్రమాణాల ప్రకారం ప్రతి ప్లాంటులో అధునాతన ప్రయోగశాల ఉండాలి. శుద్ధి చేసిన నీటిలో టీడీఎస్‌తో పాటు ఇతర వివరాలను రోజూ పరీక్షించి నమోదు చేసేందుకు ఓ బయోకెమిస్ట్ ఉండాలి. ఇవి ఉంటేనే మినరల్ ప్లాంటు ఏర్పాటుకు పబ్లిక్‌హెల్త్ అధికారులు అనుమతి ఇవ్వాలి. ఇవేవీ ఫిల్టర్ ప్లాంట్లలో కనిపించవు. ఈ క్రమంలో కనిపించే వాటర్ ప్యాకెట్, క్యాన్లలోని మినరల్ వాటర్ శుద్ధమైందని భావిస్తే ముప్పును కొని తెచ్చుకున్నట్లే!
తెలుసుకోండిలా..
నీటిలో టీడీఎస్ తెలుసుకునేందుకు ప్రత్యేకమైన పరికరాలు మార్కెట్లో లభిస్తున్నాయి. వీటి ధర *500-1000 వరకూ ఉంటుంది. సాధారణంగా మార్కెట్లో లభించే ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌నే చాలామంది మినరల్ వాటర్‌గా వ్యవహరిస్తారు. కానీ మినరల్ వాటర్ ప్రత్యేకమైంది. కొన్ని ముఖ్యమైన బ్రాండెడ్ కంపెనీలు మాత్రమే దీనిని తయారు చేస్తున్నాయి... సిసలైన మినరల్ వాటర్ ఎన్ని ప్లాంట్లలో దొరుకుతుంటుందో? ఎలాంటి నీళ్లు సేవిస్తున్నారో అర్థమై ఉంటుంది కదా!