సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లాలోని మినరల్ వాటర్ ప్లాంట్లు ప్రజల పాలిట శాపంగా మారాయి. వినియోగదారులను రోగాల బారిన పడేస్తున్నాయి. అధికారుల నియంత్రణ కరువవడం.. వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ మినరల్ వాటర్ పేరిట జనరల్ వాటర్ సరఫరా చేస్తున్నారు. భారత ప్రమాణాల సంస్థ(బీఎస్‌ఐ) నిబంధనలు విస్మరించిన నిర్వాహకులు.. అధికారులతో కుమ్మక్కై వ్యాపారం జోరుగా సాగిస్తున్నారు. వర్షాకాలం, వేసవికాలం, శీతాకాలం ఇలా కాలాలతో సంబంధం లేకుండా ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, భైంసా, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్‌తోపాటు జిల్లాలో మంచినీళ్ల వ్యాపారం సాగుతోంది. 200 వరకు ప్లాంట్లు ఉన్నా కేవలం ఏడింటికే బీఎస్‌ఐ అనుమతి ఉంది. ఈ ప్లాంట్లలో మాత్రమే ఐఎస్‌ఐ ప్రమాణాలు పాటిస్తుండగా, నిబంధనలు విస్మరించిన వ్యాపారులపై చర్యలు తీసుకోవడానికి అధికారులు వెనుకంజ వేస్తున్నారు.
ఐఎస్‌ఐ ప్రమాణాలు ఇవే..
మినరల్ వాటర్ ప్లాంట్ నిర్వహించాలంటే ఐఎస్‌ఐ నిబంధనలు పాటించాలి. బీఎస్‌ఐ అనుమతి తీసుకోవాలి.
వాటర్ ప్లాంట్‌లో మైక్రోబయాలజిస్టు, కెమిస్టులు ఉండాలి. వీరు శుద్ధి చేసిన ప్రతి బ్యాచ్‌కు చెందిన నీటిలోని పీహెచ్‌ను పరీక్షిస్తూ ఉండాలి. పీహెచ్ 7 కంటే తగ్గితే కిడ్నీ సమస్యలు వస్తాయని బీఎస్‌ఐ, వైద్యులు పేర్కొంటున్నారు.
* నీటిలో పూర్తిగా కరిగి ఉండే లవణాలు(టీడీఎస్) కూడా పరీక్షించాలి.
* కొత్తగా ఒక వాటర్ ప్లాంటు ఏర్పాటు చేస్తే కనీసం పది గదులు ఉండేలా చూడాలి. ఇందులోనే నీటి పరీక్ష చేసే ల్యాబ్, పరికరాల కోసం రెండు గదులు కేటాయించాలి.
* ఫిల్లింగ్ సెక్షన్, ఆర్‌వో పద్ధతిలో 3 వేల లీటర్ల కెపాసిటీ డ్రమ్ములు ఏర్పాటు చేయాలి. శుద్ధి చేసిన నీటిని నిల్వ చేసేందుకు 304 గ్రేడ్ స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేసిన డ్రమ్ములు వాడాలి. శుద్ధి చేసిన నీటిని ఓజోనైజేషన్ చేయాలి.
*మినరల్ వాటర్‌ను క్యానులోకి పట్టే ముందు అల్ట్రావైరస్ రేస్‌తో శుద్ధి చేయాలి. నీటిని క్యాన్‌లోకి పట్టిన తర్వాత రెండు రోజులపాటు భద్రపరిచి, మార్కెట్లోకి పంపాలని బీఎస్‌ఐ నిబంధనలు సూచిస్తున్నాయి.
* నీటిని సరఫరా చేసే క్యానులకు ప్రతిసారి పొటాషియం పర్మాంగనేట్ లేదా హైపోసొల్యూషన్‌తో కెమికల్ క్లీనింగ్ చేయాలి. సీలుపై నీటిని శుద్ధి చేసిన తేదీ, బ్యాచ్ ను వేయాలి.
* నీటిని క్యానులలో నింపేవారు చేతులకు తొడుగులు ధరించాలి.
* శానిటరీ అధికారులు ప్రతినెలా నీటిని తనిఖీ చేసి నివేదికను ఐఎస్‌ఐకి పంపాలి.
{పతి ఏడాది ఐఎస్‌ఐ గుర్తింపును రెన్యువల్ చేసుకోవాలి.
భూగర్భ జలాలే శ్రేయస్కరం
జిల్లాలో నిర్వహిస్తున్న ప్లాంట్లలో చాలామంది ప్రమాణాలు పాటించడం లేదు. అధికారులను మచ్చిక చేసుకుని చిన్నచిన్న గదుల్లో ప్లాంట్లు నిర్వహిస్తున్నారు. నీటిని నిల్వ చేసే క్యాన్లను శుభ్రం చేయకుండానే సరఫరా చేస్తున్నారు. అనుమతి ఉన్న ఏడింటిలో మినహాయిస్తే మిగతా ప్లాంట్లలో మైక్రోబయాలజిస్టు, కెమిస్టులు అందుబాటులో ఉండటం లేదు. పీహెచ్, టీడీఎస్ పరీక్షలు జరగడం లేదు. శానిటరీ అధికారులు మామూళ్లకు రుచిమరిగి తనిఖీలు చేయడం లేదు. కొన్ని సంస్థలకు ఐఎస్‌ఐ సర్టిఫికెట్లు ఉన్నా ఏటా రెన్యూవల్ చేయించుకోవడం లేదు. వాటర్ ప్లాంట్ల నిర్వాహకులు కచ్చితంగా భూగర్భజలాలు ఉపయోగించాలి. అయితే కొందరు ఇతర ప్రాంతాల నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకువచ్చి వినియోగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా వుండగా ఒక లీటరు శుద్ధ జలం తయారీకి మూడు లీటర్ల నీరు వృథా అవుతోంది. ఈ క్రమంలో భూగర్భజలాలు విరివిగా తీయడం వల్ల ప్లాంట్లు ఉన్న ప్రాంతంలో భూగర్భ నీటినిల్వలు పడిపోతున్నాయి. ఈ విషయాన్ని చుట్టూ పక్కల ఉండే ప్రజలు ఫిర్యాదు చేస్తున్నా అక్రమంగా నిర్వహిస్తున్న ప్లాంట్లపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.
ఏటా రూ.3 కోట్లపైనే పన్ను ఎగవేత
బీఎస్‌ఐ అనుమతి లేకుండా మినరల్ వాటర్ ప్లాంట్ల నిర్వాహకులు జిల్లాలో ఏటా రూ.3 కోట్లకు పైగా ప్రభుత్వానికి పన్ను ఎగవేస్తున్నారు. మినరల్ వాటర్‌పై కూడా 12.5 శాతం పన్ను చెల్లించాల్సి ఉండగా, సేవ ముసుగులో వాటర్ ప్లాంట్ల నిర్వాహకులు పన్నులు చెల్లించడం లేదు. బీఎస్‌ఐ అనుమతి ఉంటే ప్లాంటు నిర్వాహకుడు ఏటా రూ.90,260 చెల్లించి రెన్యువల్ చేయించుకోవాలి. రూ.32,205 వాటర్ టెస్టింగ్ కోసం చెల్లించాలి. మరో రూ.27,500 వరకు ఇతర ఖర్చులు అవుతాయి. అయితే జిల్లాలో ప్రస్తుతం ఏడు ప్లాంట్లు మినహాయిస్తే ఎక్కడా ఈ పద్ధతి పాటించడం లేదు. ఏటా ప్రభుత్వానికి, ప్రజలకు పెద్దమొత్తంలో నష్టం జరుగుతున్నా అధికారులకు చీమకుట్టినట్టయిన లేదు.
ఇదిలా వుండగా నీటి ఎద్దడిని ఆసరాగా చేసుకొని వాటర్ ప్లాంట్ల యజమానులు పోటాపోటీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. 20 లీటర్ల నీటికి రూ.15 నుంచి రూ.25 వరకు విక్రయిస్తున్నారు. వాస్తవంగా 20 లీటర్ల నీరు శుద్ధి చేయడానికి రూ.1 నుంచి రూ.2 ఖర్చవుతుంది. ట్రాన్స్‌పోర్టు చార్జీలు మినహా ఎలాంటి పన్నులు, ఖర్చులు లేకున్నా అధిక ధరలు వసూలు చేయడంపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు ‘మామూలు’గా తీసుకుంటుండటంపై విమర్శలు వస్తున్నాయి.
మాయాజలం
Published Thu, Oct 24 2013 3:28 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement