అర్లి(టి)లో చలినుంచి రక్షణకు పశువులపై కప్పిన గోనె దుప్పట్లు
పడిపోయిన కనిష్ట ఉష్ణోగ్రత
రాష్ట్రమంతటా సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పతనమయ్యాయి. చాలాచోట్ల సాధారణం కంటే సగటున 2 డిగ్రీ సెల్సియస్ నుంచి 4 డిగ్రీ సెల్సియస్ తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదివారం రాష్ట్రంలో అత్యంత తక్కువగా ఆదిలాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 4.7డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. ఇక్కడ ఈ సమయంలో నమోదు కావాల్సిన సాధారణ ఉష్ణోగ్రత కంటే 8.1 డిగ్రీలు తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం.
పటాన్‌చెరు, హకీంపేట్, హనుమకొండ, మెదక్, నిజామాబాద్, రామగుండం, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో సాధారణం కంటే 4డిగ్రీ సెల్సియస్‌కు పైబడి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఒక్కసారిగా నెలకొన్న వాతావరణ పరిస్థితులతో ఉష్ణోగ్రతలు పతనమైనట్టు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సైతం సాధారణం కంటే తక్కువగానే నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రానికి ఈశాన్య దిశనుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తున్నాయి. రానున్న రెండ్రోజులు ఉదయం పూట పొగమంచు ఏర్పడుతుందని, దీంతో జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ సూచించింది.
రానున్న మూడురోజులు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటె 4డిగ్రీల వరకు తక్కువగా నమోదు కావొచ్చని వాతావరణ శాఖ సూచించింది. అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదై ప్రాంతాలు ఆదిలాబాద్ : 4.7 డిగ్రీలు, అర్లి : 6.3డిగ్రీలు, తండ్ర: 6.6 డిగ్రీలు, తిర్యాణి: 6.7 డిగ్రీలు, కొహిర్: 6.8డిగ్రీలు, జుక్కల్: 7.6డిగ్రీలు, కొట్‌గిరి: 7.7 డిగ్రీలు, శివంపేట్: 8 డిగ్రీలు, మల్లాపూర్: 8 డిగ్రీలు, మోమీన్‌పేట్: 8.2 డిగ్రీ సెల్సియస్ చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment