సుజలం..అపహాస్యం
కాతేరు (రాజమండ్రి రూరల్) :ప్రజాప్రతినిధుల తీరు కారణంగా ఎన్‌టీఆర్ సుజల పథకం ప్రజల మధ్య అపహాస్యంపాలైంది. రాజమండ్రి రూరల్ మండలం కాతేరు గ్రామంలో ఇప్పటికే రూ.2కు 20 లీటర్ల మంచినీరు ఇస్తున్న పథకానికి.. ‘ఎన్‌టీఆర్ సుజల’గా పేరు పెట్టి ప్రారంభించడమే కాకుండా.. రూ.2కే మంచినీరు ఇస్తామంటూ ప్రజాప్రతినిధులు చెప్పడంతో ప్రజలు ముక్కున వేలు వేసుకునే పరిస్థితి ఏర్పడింది.2012లోనే ప్రారంభమైన పథకంకాతేరు ప్రజలకు సురక్షిత మంచినీరు అందించే ఉద్దేశ్యంతో బీజేపీ రాష్ట్ర నాయకుడు కంటిపూడి సర్వారాయుడు రూ.10 లక్షలతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. కంటిపూడి లక్ష్మణరావు అండ్ చెరుకూరి సత్యనారాయణమూర్తి మెమోరియల్ ట్రస్టు పేరుతో దీని నిర్మాణం చేపట్టి 2012 ఆగస్ట్ 13న ప్రారంభించారు. అప్పటినుంచీ గ్రామస్తులకు రూ.2కే 20 లీటర్ల మంచినీరు అందిస్తున్నారు. కొద్ది నెలల క్రితం ఈ పథకాన్ని గ్రామ పంచాయతీకి అప్పగించారు. అప్పటినుంచీ దీనిని గ్రామస్తులు వినియోగించుకుంటున్నారు.
పేరు మార్చి మళ్లీ ప్రారంభం
కాతేరులో మంగళవారం ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమం జరిగింది. దీనికిముందు కంటిపూడి లక్ష్మణరావు అండ్ చెరుకూరి సత్యనారాయణమూర్తి మెమోరియల్ ట్రస్టు స్థాపించిన వాటర్‌ప్ల్లాంట్‌కు ‘ఎన్‌టీఆర్ సుజల పథకం’ అంటూ ఫ్లెక్సీ తగిలించారు. గుమ్మానికి చకాచకా రిబ్బన్ కట్టేశారు. శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ చైతన్యరాజు, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరుల సమక్షంలో రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ ఈ పథకాన్ని మరోసారి ప్రారంభించారు. ఈ తతంగం చూసి గ్రామస్తులు నివ్వెరపోయారు. రెండున్నరేళ్లుగా మంచినీరందిస్తున్న ప్లాంట్‌కు ఎన్‌టీఆర్ సుజల పథకం పేరు పెట్టి మళ్లీ ప్రారంభించడమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. సురక్షిత మంచినీరు లభ్యం కాక కాతేరులోని మిలిటరీ కాలనీ, శాంతినగర్, దేవీనగర్, రావుగారు బిల్డింగ్స్ తదితర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటువంటిచోట్ల ‘సుజల’ ప్లాంట్ ఏర్పాటు చేసి ఉంటే బాగుండేదని బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి యానాపు యేసు అన్నారు.