సాక్షి, కాకినాడ: జిల్లాలో జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో ఇప్పటి వరకు 19,600 మందికి ఎన్టీఆర్ భరోసా కింద వృద్ధులు, వితంతువులకు రూ.వెయ్యి , వికలాంగులకు రూ.1500 వంతున పింఛన్లను పంపిణీ చేసినట్టు కలెక్టర్ నీతూ ప్రసాద్ తెలిపారు. జన్మభూమి-మావూరు కార్యక్రమాల వివరాలను మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో ఆమె వివరించారు. సోమవారం నాటికి జిల్లా వ్యాప్తంగా 9వేల వృద్ధాప్య పింఛన్‌లు, 6,465 వితంతు పింఛన్‌లు, 3,300 వికలాంగ పింఛన్లు, 796 చేనేత పింఛన్‌లు, 227 గీత కార్మికుల పింఛన్లను పంపిణీ చేశామన్నారు. జన్మభూమిలో 2,250 మొక్కలను నాటడంతో పాటు 137 ట్రీగార్డులను పంపిణీ చేసినట్టు చెప్పారు. ఇప్పటి వరకు జన్మభూమి గ్రామ, వార్డు సభల ద్వారా ప్రజల నుంచి 16,525 ఫిర్యాదులు, విజ్ఞాపనలను స్వీకరించినట్టు చెప్పారు.
తొలి దశలో 73 సుజల ప్లాంట్లు
ఎన్టీఆర్ సుజల పథకం కింద జిల్లాలో తొలిదశలో 304 ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నప్పటికీ ఇప్పటివరకు 73 నెలకొల్పగలిగామని కలెక్టర్ నీతూప్రసాద్ వెల్లడించారు. మంగళవారం సాయంత్రం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈ పథకం అమలు పురోగతిపై జెడ్పీ చైర్మన్ నామన రాంబాబుతో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్లాంట్ల ఏర్పాటులో రాష్ర్టంలో తూర్పుగోదావరి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని, ఇదే స్పూర్తితో లక్ష్యాన్నిమించి 700 నుంచి 800 ప్లాంట్లు ఏర్పాటు చేయగలమన్న విశ్వాసం వచ్చిందని చెప్పారు. ఆర్వో ప్లాంట్లు 1500 లీటర్లు వాడితే అందులో 700 లీటర్లుశుద్ధి చేసిన నీరు రాగా, మిగిలిన 800 లీటర్ల నీరు వృధాగా పోకుండా చెట్ల పెంపకానికి, గృహాల్లో ఇతర అవసరాల వినియోగానికి మళ్లించాలని సూచించారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ శ శాంక్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ ఆర్‌పీ నందారావు, ముఖ్యప్రణాళికాధికారి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
జన్మభూమి సభల్లో 19,600 పింఛన్ల పంపిణీ
Published Wed, Oct 8 2014 12:32 AM | Last Updated on Sat, Sep 2 2017 2:29 PM
Advertisement