సాక్షి, రాజమండ్రి :రాష్ట్ర ప్రభుత్వం గురువారం నుంచి ఈ నెల 20 వరకూ చేపట్టనున్న ‘జన్మభూమి - మాఊరు’ కార్యక్రమానికి జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. తొలిరోజు ఉపాధి హామీ సిబ్బందితో నీరు-చెట్టు అనే కార్యక్రమంపై ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి అందిన ఆదేశాల మేరకు జన్మభూమి ప్రత్యేక బృందాలు బుధవారం ఏర్పాట్లు పూర్తిచేశాయి. ఆయా మండలాలు, మున్సిపాలిటీలతో పాటు రాజమండ్రి, కాకినాడ నగరపాలక సంస్థల్లో బుధవారం ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, క్షేత్ర స్థాయి సిబ్బందికి అవగాహన కల్పించారు.
రోజుకు రూ.25 లక్షలు
గ్రామ స్థాయిలో ‘జన్మభూమి’ నిర్వహణ బాధ్యతలు ఉపాధి హామీ పథకం ఏపీఓలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లపై పడ్డాయి. ఎవరు ఏ బాధ్యతలు నిర్వర్తించాలనే అంశాలపై గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఇటీవల కలెక ్టర్‌కు ఉత్తర్వులు ఇచ్చారు. కార్యక్రమ ప్రచార బాధ్యతలను డ్వామా సహాయ ప్రాజెక్టు డెరైక్టర్లకు అప్పగించారు. ప్రచారానికి భారీగా ఫ్లెక్సీలను రూపొందించి, గ్రామాల్లో ప్రదర్శించాలని నిర్దేశించారు. గ్రామాల్లో ఫొటోల ప్రదర్శనలు, ఫ్లెక్సీల పేరిట సుమారు రూ.25 లక్షల వరకూ ఖర్చు చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రముఖులకు స్వాగతం పలికేందుకు కూడా ఫ్లెక్సీలపై మరో రూ.25 లక్షల వరకూ ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. కార్యక్రమాల ఏర్పాట్లు, ప్రత్యేక వాహనాలు తదితర వాటికి మరో రూ.25 లక్షలు ఖర్చు కాగలదని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆయా కార్యక్రమాలకు మొత్తం రూ.కోటి వరకు ఖర్చు చేస్తున్నట్టు అంచనా. ప్రతీరోజు జిల్లాలోని 1400 గ్రామాల్లో కనీసం రోజుకు రూ.25 లక్షలకు పైగా ఖర్చయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
ఏదో ఒకటి పూర్తి చేయండి
తొలి రోజు ఏదైనా ఒక పనిని చేపట్టి, పూర్తి చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి.. కలెక్టర్‌ను ఆదేశించారు. అలాంటి పనులు గుర్తించి.. గ్రామాల వారీగా జాబితా తయారు చేసుకోవాలని సూచించారు. ఏటిగట్లపై మొక్కలు నాటడం, సామాజిక వనాల కార్యక్రమాలు వంటి వాటికి ప్రాధాన్యమివ్వాలని సూచించారు. గ్రామ కూడళ్లలో శిబిరాలు ఏర్పాటు చేసి.. నీరు- చెట్టు ప్రాధాన్యాన్ని వివరించేలా ఫొటోల ప్రదర్శన ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది.
నేటి నుంచి ‘జన్మభూమి - మాఊరు’
Published Thu, Oct 2 2014 1:27 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement