ముందుకు వచ్చే వారితో కలిసి గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు
ఐదేళ్లలో 17,500 కి.మీ మేర సీసీ రోడ్లు, 10,000 కి.మీ డ్రైనేజ్ కాల్వలు నిర్మిస్తాం
పంచాయతీరాజ్‌కు ఇవ్వాల్సిన రూ.990 కోట్లు వెంటనే విడుదల చేస్తాం: సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: జన్మభూమి 2.0 కార్యక్రమాన్ని వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభించనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర సచివాలయంలో మంగళవారం ఆయన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ శాఖలపై సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖలో తీసుకున్న పలు నిర్ణయాలను సంబంధిత శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ వివరించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘జన్మభూమి 2.0 కార్యక్రమంలో భాగంగా గ్రామాల అభివృద్ధికి ముందుకు వచ్చే వారితో కలిసి పల్లెల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతాం.
గ్రామాల్లో వచ్చే ఐదేళ్లలో 17,500 కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్లు, 10 వేల కిలోమీటర్ల మేర డ్రైనేజీ కాల్వలు నిర్మిస్తాం. ఇందులో ఏడాదికి ఎంత చొప్పున పనులు చేయగలరో అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకోవాలి. పంచాయతీరాజ్ శాఖకు ఇవ్వాల్సిన రూ.990 కోట్లను వెంటనే ఆర్థిక శాఖ నుంచి విడుదల చేస్తాం. జల్‌జీవన్ మిషన్ పథకం అమలు కోసం రాష్ట్ర వాటా కింద రూ.500 కోట్లు విడుదల చేస్తాం.
కేంద్రం ఇచ్చే నిధులను కూడా సద్వినియోగం చేసుకుని ఇంటింటికీ తాగునీరు అందిస్తాం’ అని చెప్పారు. ఉపాధి హామీ పథకం నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో 2,500 కిలోమీటర్ల మేర బీటీ రోడ్లు, 5 లక్షల ఫామ్‌పాండ్స్ తవ్వకాలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో అడవుల్లో టూరిజం అభివృద్ధికి చర్యలు చేపట్టాలని అటవీ, పర్యావరణ శాఖ అధికారులను చంద్రబాబు ఆదేశించారు.
సాంప్రదాయేతర విద్యుత్‌కు ఏపీనే కేంద్రం
సాంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తికి రాష్ట్రంలో అనేక అవకాశాలున్నాయని వాటిని సది్వనియోగం చేసుకుంటే దేశంలోనే సాంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తికి ఆంధ్రప్రదేశే అతిపెద్ద కేంద్రం అవుతుందని సీఎం అన్నారు. నూతన ఇంధన పాలసీ–ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 పై సంబంధిత శాఖాధికారులతో సీఎం సమీక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment