సుజలమేదీ!
మొక్కుబడిగా ఎన్టీఆర్ సుజల పథకం
రూ.2కే 20 లీటర్ల నీరు హామీకి మంగళం
పట్టించుకోని ప్రభుత్వం ముందుకు రాని దాతలు
మంచి నీరందక రోగాల బారిన జనం
చాలా గ్రామాల్లో ఫ్లోరైడ్ నీళ్లే దిక్కు
‘‘తాగునీటిని వారం రోజు ల పాటు నిల్వ ఉంచుకుని తాగడం వల్లే రోగాలు వస్తాయి. నీటిని నిల్వ ఉంచుకుని వాడుకోకూడదు’’ అని వైద్యులతోపాటు సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చెబుతున్నారు.
చిత్తూరు : ప్రతిరోజూ స్వచ్ఛమైన మంచి నీటిని అందిస్తే ప్రజలు ఆ నీటినే సేవించేవారు. కానీ జిల్లాలో వారం రోజుల కొకమారు మాత్రమే ప్రజలకు తాగునీరు అందుతోంది. దొరికిన నీటిని నిల్వ ఉంచుకుని జాగ్రత్తగా వాడుకోవాల్సి వస్తోంది.
ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా ప్రజ లందరికీ రూ.2లకే 20 లీటర్ల స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తానని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించి ఏడాది ముగుస్తోంది. ఈ పథకం ద్వారా తాగునీరు పూర్తిస్థాయిలో సరఫరా చేయడం లేదు. జిల్లాలో తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు ప్రాంతాల్లో ఫ్లోరైడ్ నీరే దిక్కు. చివరకు ఆ ప్రాంతాల్లో కూడా సుజలం అందడం లేదు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కుప్పంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. తొలుత ప్రభుత్వమే ప్రజలకు స్వచ్ఛమెన నీటిని అందిస్తుందని ప్రకటించారు. ఇప్పుడు మాట మార్చారు. ఎన్టీఆర్ సుజల పథకానికి ఒక్కపైసా నిధులు కూడా వెచ్చించేందుకు ప్రభుత్వం ససేమిరా అంటోంది. దాతలు ముందుకొస్తే తప్ప ఈ పథకాన్ని కొనసాగించలేమని తేల్చి చెప్పింది. దాతలు నామమాత్రంగా కూడా ముందుకు రాకపోవడంతో ఈ పథకం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉండిపోయింది. ఇప్పటివరకు జిల్లాలో కుప్పంలో 18 ప్లాంట్లు, చిత్తూరులో 3, శ్రీకాళహస్తిలో 4, నగరిలో 2, పలమనేరు, పుంగనూరు, సత్యవేడు, చంద్రగిరి నియోజకవర్గాల్లో ఒక్కొక్కటి చొప్పున ఎన్టీఆర్ సుజల పథకం ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కుప్పం మినహా మిగిలిన ప్రాంతాల్లో ఈ ప్లాంట్లు పూర్తిస్థాయిలో నడిచే పరిస్థితి లేకుండా పోయింది. గంటకు 500 లీటర్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్ ఏర్పాటుకు రూ.1.5లక్షలు ఖర్చు కాగా, 2వేల లీటర్ల సామర్థ్యం ప్లాంట్‌కు రూ.3.5లక్షలు వెచ్చించాల్సి ఉంది. పెద్ద ప్లాంట్లు కాకుండా చిన్న చిన్న ప్లాంట్ల ఏర్పాటు చేసేందుకైనా దాతలను వెతకమని అధికారులను ఆదేశించింది. దీంతో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో చిన్న చిన్న పారిశ్రామికవేత్తలతో పాటు ఆర్థిక సామర్థ్యం కలిగిన వారితో పలుమార్లు సమావేశాలు నిర్వహించి ఒప్పించే ప్రయత్నం చేశారు. అయితే ఎవరూ ముందుకు రాలేదు. పైగా ఎన్టీఆర్ పేరు పెట్టుకుని ప్రభుత్వం ఖర్చు పెట్టకుండా మేమెందుకు నిధులు ఖర్చు పెట్టాలంటూ కొందరు అధికారులను నిలదీశారు.
దీంతో ఈ పథకం అటకెక్కింది. ఫ్లోరైడ్ ప్రాంతాల్లో మొదటి ప్రాధాన్యత కింద వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆ తరువాత ఆ హామీని గంగలో కలిపింది. జిల్లా ప్రజల సంగతి దేవుడెరుగు కనీసం ఫ్లోరైడ్ ప్రాంతాల్లోనైనా వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి ప్రజలకు తాగునీటిని అందిస్తారనుకుంటే అధికారులు ఆ దిశగా ఎటువంటి చర్యలు చేపట్టలేదు. జిల్లా ప్రజలు ఓవైపు ఫ్లోరైడ్ నీరు, మరోవైపు వారానికి ఒకమారు వచ్చే నీటిని తాగి అనారోగ్యం బారిన పడుతున్నారు.
జిల్లాకు సంబంధించి ప్రజల అవసరాల కోసం, అభివృద్ధి కోసం ఎన్ని కోట్లు నిధులైనా ఇస్తానని పదేపదే చెబుతున్న ముఖ్యమంత్రి ఒట్టిమాటలతో సరిపెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా దాతల సంగతి పక్కనపెట్టి ప్రభుత్వం ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని ప్రజలు కోరుతున్నారు.