పలాసలోని సుజలధార కేంద్రం వద్ద ఉంచిన పసుపు క్యాన్లు
కాశీబుగ్గ : పసుపు క్యాన్‌కు రూ.400 చెల్లిస్తేనే ఎన్‌టీఆర్ సుజల తాగునీరు అందించే కార్డు అందజేస్తామని నిర్వాహకులు తేల్చిచెప్పడంతో పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ ప్రజలు విస్తుపోతున్నారు. మున్సిపాలిటీలో 11 చోట్ల, మందస, పలాస, వజ్రపుకొత్తూరు మండలాల్లో 6 చోట్ల సుజలధార పథకాలు ఏర్పాటు చేశారు. తాగునీరు కావాలంటే రూ.400 చెల్లించి పసుపు ట్యాంకు తమ వద్దే కొనుగోలు చేయాలని నిర్వాహకులు చెబుతుండటంతో ప్రజలు మండిపడుతున్నారు. తమవద్ద పాత క్యాన్లు ఉన్నాయని చెబుతున్నా వినడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు కూడా ముఖం చాటేస్తుండటంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
స్థానిక జన్మభూమి కమిటీ సభ్యులు తమ చేతికి మట్టి అంటకుండా కొంతమంది వ్యక్తులను నియమించి ఈ ట్యాంకులను ఒకొక్కటి రూ.400 చొప్పున అమ్ముతున్నారు. పలాస ప్రభుత్వ ఆసుపత్రి, పురుషోత్తపురం, పలాస హైస్కూల్, మున్సిపల్ కార్యాలయాల వద్ద ఈ వసూళ్ల పర్వం కొనసాగుతోంది. ఇంత జరుగుతున్నా అధికారులు దృష్టి సారించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం రెండు రూపాయలకే 20 లీటర్లు తాగునీరు అందిస్తామని ఏర్పాటుచేసి ప్రారంభించిన నిర్వాహకులు ఇప్పుడు పసుపు క్యాన్ కొనుగోలు చేస్తేనే తప్ప కార్డు ఇవ్వమని చెబుతుండటం తగదని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలనని పలువురు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment