
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మార్చిలోనే ఎండలు దంచికొడుతున్నాయి. మార్చి నెలలోనే సాధారణం కంటే ఎక్కువగా రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు.. రానున్న రెండు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలోనే పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
తెలంగాణ వ్యాప్తంగా మార్చి నెలలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సాధారణం కన్నా 3.3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు. రానున్న రెండు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు.
ఇదే సమయంలో మంచిర్యాల, ఆదిలాబాద్, కొమురంభీమ్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో ఎండ తీవ్రతతో పాటు వడగాలుల ప్రభావం అధికంగా ఉంటుందని ఐఎండీ తెలిపింది. ఈ జిల్లాల్లో ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. అలాగే, శనివారం గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉన్నందున మరో 7 జిల్లాల్లోనూ శనివారం నుంచి ఎల్లో హెచ్చరికలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
అయితే.. మార్చి 20 నుంచి 24 తేదీల్లో మాత్రం రాష్ట్రంలో అకాల వర్షాలు కురిస్తాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అవి కూడా బలమైన ఉరుములతో కూడిన అకాల వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ వాతావరణం ఎప్పటికప్పుడు మారుతుందని కూడా పేర్కొన్నారు. అయితే.. ప్రస్తుతానికి మాత్రం వేడికి బాధపడాల్సిందేనని.. మార్చి 20 తర్వాత మాత్రం రైతులు కాస్త జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment