
జనగామ: జలం కోసం జనం ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేలా ప్రజాప్రతినిధులు, అధికారులపై ఒత్తిడి తీసుకురావాలని జనగామ మండలంలోని పెంబర్తి గ్రామ యువకులు నిర్ణయించారు. పెంబర్తిలోని పెద్ద చెరువు ఎండిపోయినా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడం.. చుక్క నీరు లేక ఎండుతున్న పంటలకు తోడు గుక్కెడు నీటి కోసం ప్రజలు పడుతున్న కష్టాలను చూసిన చలించిపోయిన యువకులు వినూత్న నిరసనకు దిగారు. స్థానిక యువకులు చొప్పరి సంతోష్, సతీష్, ఏదునూరి రాము, గుడికందుల ప్రశాంత్, మణికంఠ, సాయి, పల్లపు శ్రీకాంత్, గుజ్జుల వేణు, పల్లపు హరీశ్ ఆధ్వర్యాన ఇంటింటికి చెంబెడు నీళ్ల సేకరణకు శ్రీకారం చుట్టారు.
ఇప్పటికే కలెక్టరేట్ గ్రీవెన్స్ సెల్‌లో వెయ్యి దరఖాస్తులు అందించిన యువకులు మరో నిరసన చేపట్టారు. ఇంటింటికీ చెంబు చొప్పున సేకరించిన నీటితో పెద్ద చెరువును నింపే యత్నం చేస్తామని, అప్పుడైనా ప్రజాప్రతినిధులు మేల్కొంటారని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా శనివారం వంద బిందెల నీటిని పెద్దచెరువులో పోసి తమ ఆవేదన వెళ్లగక్కారు. ఎంపీటీసీ ఎన్నికల్లో అభ్యర్థిని నిలపి సత్తా చాటుతామని యువకులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment