pembarthi
-
లంకె బిందె.. అరుదైన ఆభరణాలు; మాకూ వాటా కావాలి!
జనగామ: రెండోరోజైన గురువారం జరిపిన తవ్వకాల్లోనూ అరుదైన పగడాలు, రాతిపూసలు, నాగుపాము ఆకారంలో ఉన్న బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. జనగామ జిల్లా పెంబర్తి గ్రామశివారు టంగుటూరు రోడ్డు సమీపంలో వెంచర్ కోసం భూమిని చదును చేస్తుండగా గురువారం లంకె బిందె, అందులో గుప్తనిధులు బయటపడ్డ సంగతి తెలిసిందే. ఈ మేరకు పురావస్తు శాఖ వరంగల్ అసిస్టెంట్ డైరెక్టర్ బి.మల్లునాయక్ నేతృత్వంలో ఉద్యోగులు భానుమూర్తి, బాబు శుక్రవారం ఈ ప్రాంతాన్ని సందర్శించి మట్టిని జల్లెడ పట్టించారు. ఈ సందర్భంగా కోరల్ బీడ్(ఎముకలతో తయారు చేసిన పూసలు), రాతి పూసలు(మహిళలు పుస్తెలతాడులో వేసుకునే పగడాలు), ల్యాపిన్ లాజ్యులీ స్టోన్(స్టోన్ రకానికి చెందిన పగడం), నాగుపాము ఆకారంలో ఉన్న బంగారు ఆభరణాలు వెలుగుచూశాయి. మట్టిలో దొరికిన ఆభరణాలను ప్రత్యేక కవర్లో ప్యాక్ చేసి ఉన్నతాధికారులకు అందజేశారు. ఇక అధికారులు ఆభరణాలను సేకరించే సమయంలో రైతులు అక్కడికి చేరుకుని తమకు కూడా వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్సై రవికుమార్ సర్దిచెప్పగా వారు వెనక్కి తగ్గారు. అమ్మవారి ఆభరణాలు కావు! వ్యవసాయ క్షేత్రంలో బయటపడినవి అమ్మవారికి అలంకరించే ఆభరణాలు కాకపోవచ్చని పురావస్తు శాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. 1930– 40 ప్రాంతంలో రజాకార్ల దాడుల్లో సంపన్న కుటుంబాలు భద్రత కోసమే బండరాళ్ల మధ్య వీటిని దాచిపెట్టాయా.. లేక దారి దోపిడీ దొంగలు ఎత్తుకొచ్చి ఇక్కడ పాతిపెట్టారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటిల్లో ఎక్కువగా మహిళలు, పిల్లలు వినియోగించే ఆభరణాలు ఉండటం గమనార్హం. కాగా, గురువారం రాత్రి ఈ ప్రాంతంలో ఎలాంటి నిఘా లేకపోవడంతో బంగారు ఆభరణాల కోసం పలువురు పోటీపడి తవ్వినట్లు సమాచారం. కొందరికి బంగారు ఆభరణాలు లభించాయని తెలిసింది. ఈరోజు తవ్వకాల్లో వెలుగుచూసిన ఆభరణాల వివరాలు ►బంగారు ఆభరణాలు: 6 తులాల 300 మి.గ్రా. ►వెండి ఆభరణాలు: 2 తులాల 800 మి.గ్రా. ►కోరల్ బీడ్స్: 7 తులాల 200 మి.గ్రా. చదవండి: జనగామ: బయటపడ్డ లంకె బిందె.. బంగారం, వెండి లభ్యం! -
జనగామ: బయటపడ్డ లంకె బిందె.. 5 కిలోల బంగారం!?
సాక్షి, జనగామ: వెంచర్ ఏర్పాటు కోసం భూమిని చదును చేస్తుండగా బంగారు, వెండి ఆభరణాలతో కూడిన లంకె బిందె బయటపడింది. ఐదు కిలోల బరువైన బిందె బయటపడగా, అందులో మూడు కిలోలకుపైగా మట్టి ఉంది. మిగతా బంగారు, వెండి ఆభరణాలు ఉండగా, అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని ట్రెజరీకి తరలించారు. శుక్రవారం నుంచి ఆ ప్రాంతంలో తవ్వకాలు చేపట్టాక, హైదరాబాద్‌లో పరిశీలన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. తొలుత ఇవి నిజాం కాలం నాటి ఆలయాల్లోని ఆభరణాలుగా ప్రచారం జరిగినా, పురావస్తు శాఖ అధికారులు మాత్రం 50 ఏళ్ల క్రితం నాటివేననే నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. వెంచర్ కోసం భూమి కొనుగోలు జనగామ మండలం పెంబర్తి శివారు టంగుటూరు క్రాస్ రోడ్డు 399, 409 సర్వే నంబర్లోని 11.06 గుంటల భూమిని సంకటి ఎల్లయ్య, ప్రవీణ్, నర్సయ్య. పర్శరాములు, దేవరబోయిన యాదగిరి, రాంచందర్, సత్తెయ్య తదితరులు ఇటీవల అమ్మారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం బోగారం గ్రామానికి చెందిన మెట్టు నర్సింహ, దుర్గాప్రసాద్, నాగరాజులు ఈ భూమిని కొనుగోలు చేయగా, కొంతమొత్తంలో నగదు అందజేసి వెంచర్ కోసం బుధవారం పనులు ప్రాంభించారు. తొలుత జేసీబీ సాయంతో భూమిలో ఉన్న బండరాళ్లను తొలగిస్తుండగా చిన్న బిందె కనపడటంతో పెద్దగా పట్టించుకోలేదు. మళ్లీ గురువారం ఉదయం పనులు ప్రారంభించగానే ఆ బిందె పగిలి అందులో నుంచి ఆభరణాలు బయటపడడంతో గుప్త నిధులుగా భావించి పోలీసులు, అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అదనపు కలెక్టర్ ఎ.భాస్కరరావు, ఏసీపీ వినోద్ కుమార్, ఇతర అధికారులు అక్కడికి చేరుకున్నారు అమ్మవారి అలంకరణ నగలని కొందరు.. రాగి బిందెలో బయటపడిన బంగారం, వెండి ఆభరణాలు అమ్మ వారికి అలంకరణ కోసం ఉపయోగించిన నగలుగా, మొత్తంగా 5 కిలోల బంగారం బయల్పడినట్లుగా తొలుత ప్రచారం జరిగింది. నిజాం కాలం నాటి ఆభరణాలుగా మరికొందరు చెప్పుకొచ్చారు. స్వర్ణకారుడు మాచర్ల బాలకృష్ణను పిలిపించి పంచనామా చేయించగా.. 18.7 తులాల బంగారు ఆభరణాలతో పాటు కిలోన్నర వెండి ఆభరణాలు, ఏడు గ్రాముల పగడాలు ఉండడంతో ప్రత్యేక బాక్స్‌లో భద్రపరిచి కలెక్టరేట్‌కు తరలించారు. హారాలు, చెవి కమ్మలు, కాళ్ల కడియాలు, నాగపడిగెలు, పూజలు చేసే సమయంలో చేతి వేళ్లకు పెట్టుకునే శివలింగంతో కూడిన ఉంగరాలు ఈ ఆభరణాల్లో ఉన్నాయి. వీటిని చూసేందుకు అనేక గ్రామాల నుంచి వందలాది మంది తరలిరావడంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది ట్రెజరీ స్ట్రాంగ్ రూమ్‌కు తరలింపు జిల్లా కలెక్టర్ కె.నిఖిల వాటిని పరిశీలించిన అనంతరం, వరంగల్ అర్బన్ జిల్లా ట్రెజరీ స్ట్రాంగ్ రూంలో భద్రపరిచేందుకు పోలీసు బందోబస్తు మధ్య పంపించారు. అంతకుముందే హైదరాబాద్ నుంచి పురావస్తు శాఖకు చెందిన డిప్యూటీ డైరెక్టర్ రాములునాయక్ తదితరులు తవ్వకాలు చేపట్టిన ప్రాంతాన్ని పరిశీలింన అనంతరం కలెక్టర్‌తో సమావేశమయ్యారు. అక్కడ ఆభరణాలను పరిశీలించి ఇవి యాభై ఏళ్ల క్రితం నాటివేనని నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. స్థానికుల్లో స్థితిమంతులెవరైనా వీటిని తమ పిల్లల కోసం దాచి పెట్టి ఉంటారనే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. చదవండి: బయటపడ్డ 1100 ఏళ్ల నాటి బంగారు నాణేలు -
పెంబర్తి వద్ద బొలెరో బోల్తా.. ఎస్ఐ మృతి
సాక్షి, జనగామ: వరంగల్ పోలీస్ ట్రైనింగ్ కాలేజీకి చెందిన సబ్ ఇన్స్పెక్టర్ కర్ణుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయన ప్రయాణిస్తున్న బొలెరో వాహనం జనగామ జిల్లా పెంబర్తి శివారు వద్ద బోల్తా పడింది. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. డిపార్ట్మెంట్ వాహనంలో కర్ణుడు వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్తున్నట్టుగా తెలిసింది. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. (చదవండి: దండం పెడుతున్నాం.. రోడ్లపైకి రాకండి) -
చెంబెడు నీటితో చెరువు నింపుతాం
జనగామ: జలం కోసం జనం ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేలా ప్రజాప్రతినిధులు, అధికారులపై ఒత్తిడి తీసుకురావాలని జనగామ మండలంలోని పెంబర్తి గ్రామ యువకులు నిర్ణయించారు. పెంబర్తిలోని పెద్ద చెరువు ఎండిపోయినా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడం.. చుక్క నీరు లేక ఎండుతున్న పంటలకు తోడు గుక్కెడు నీటి కోసం ప్రజలు పడుతున్న కష్టాలను చూసిన చలించిపోయిన యువకులు వినూత్న నిరసనకు దిగారు. స్థానిక యువకులు చొప్పరి సంతోష్, సతీష్, ఏదునూరి రాము, గుడికందుల ప్రశాంత్, మణికంఠ, సాయి, పల్లపు శ్రీకాంత్, గుజ్జుల వేణు, పల్లపు హరీశ్ ఆధ్వర్యాన ఇంటింటికి చెంబెడు నీళ్ల సేకరణకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే కలెక్టరేట్ గ్రీవెన్స్ సెల్లో వెయ్యి దరఖాస్తులు అందించిన యువకులు మరో నిరసన చేపట్టారు. ఇంటింటికీ చెంబు చొప్పున సేకరించిన నీటితో పెద్ద చెరువును నింపే యత్నం చేస్తామని, అప్పుడైనా ప్రజాప్రతినిధులు మేల్కొంటారని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా శనివారం వంద బిందెల నీటిని పెద్దచెరువులో పోసి తమ ఆవేదన వెళ్లగక్కారు. ఎంపీటీసీ ఎన్నికల్లో అభ్యర్థిని నిలపి సత్తా చాటుతామని యువకులు పేర్కొన్నారు. -
అలజడి రేపిన వింత ఘటన
పెంబర్తి: మానసికరోగి మాటలు నమ్మి స్థానికులు జాతీయ రహదారిని తవ్వేసిన వింత ఘటన జనగామ జిల్లా పెంబర్తిలో చోటుచేసుకుంది. వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై కొంతమంది జేసీబీతో పెద్దగొయ్యి తవ్వారు. దీనిపై ఆరా తీసిన పోలీసులకు అవాక్కయ్యే నిజం తెలిసింది. ఇక్కడ శివలింగం ఉందని మనోజ్ అనే వ్యక్తి చెప్పడంతో గొయ్యి తవ్వినట్టు స్థానికులు తెలిపారు. తనకు శివుడు కలలో కనిపించి ఇక్కడ తవ్వమన్నాడని మనోజ్ చెప్పడం గమనార్హం. శివుడు తనను పూనినట్టుగా వింతగా ప్రవర్తిస్తుడటంతో స్థానికులు అతడి మాటలు నమ్మారు. తాను చెప్పినట్టు చేయకపోతే శివుడు శపిస్తాడని అతడు భయపెట్టాడు. దీంతో స్థానికులు జేసీబీ సహాయంతో 10 అడుగుల గుంతను తవ్వారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మనోజ్‌తో పాటు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. తాము గొయ్యి తవ్విన చోట కచ్చితంగా శివలింగం ఉందని మనోజ్ అంటున్నాడు. శివరాత్రి రోజునే ఇక్కడ తవ్వాలనుకున్నా కుదర్లేదని చెప్పాడు. గొయ్యి తవ్వడానికి స్థానిక రాజకీయ నేతలు సహకరించారని వెల్లడించారు. అయితే పిచ్చోడి మాటలు నమ్మి రోడ్డు తవ్వారని ప్రగతిశీలవాదులు అంటున్నారు.