గుక్కెడు నీళ్ల కోసం అగచాట్లు (ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : దక్షిణాఫ్రికా రాజధాని కేప్ టౌన్ నగరంలో వరుసగా మూడేళ్లపాటు వర్షాలు కురియక పోవడంతో జలాయశాలు ఎండిపోయాయని, భూగర్భ జలాలు ఇంకి పోయాయని, ప్రభుత్వ కుళాయిల నుంచి చుక్క నీరు కూడా చూడని రోజు వస్తుందనే వార్త ఇటీవల ప్రపంచమంతట సంచలనం సృష్టించింది. అలాంటి రోజును ‘డే జీరో’గా కూడా పేర్కొంది. రోజువారి సరాసరి సగటు వినియోగాన్ని 87 లీటర్లకు కుదించింది. ఆ తర్వాత ఇటీవల దాన్ని 50 లీటర్లకు తగ్గించింది. ‘డే జీరో’ రోజు నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రదేశాల నుంచి మాత్రమే నీటిని తీసుకెళ్లాల్సి ఉంటుందని ఆ ప్రభుత్వం అక్కడి ప్రజలను హెచ్చరించింది.
ఆ పరిస్థితి భారత్‌కు కూడా త్వరలో వచ్చే ప్రమాదం ఉంది. దేశంలోని పలు నగరాలు మంచినీటి కటకటను ఎదుర్కోనున్నాయని 14, రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతం పరిధిలోని 28 నగరాల్లో ఇటీవల జరిపిన ఓ సర్వే వెల్లడించింది. నీటి కటకటలో బెంగుళూరు నగరం ప్రథమ స్థానంలో ఉన్నట్లు ఇటీవల బీబీసీ కూడా వెల్లడించింది. తీవ్ర నీటి ఎద్దటిని ఎదుర్కొంటున్న కేప్ టౌన్‌లో నీటి వినియోగం పట్ల షరతులు విధించినా ఇప్పటికీ పట్టణ పాలక సంఘం 24 గంటలపాటు ప్రభుత్వ కుళాయిల నుంచి నీటిని సరఫరా చేస్తోంది. భారత్‌లోని ఈ 28 నగరాల్లో ప్రభుత్వం సగటున కుళాయిల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నది 3.3 గంటలు మాత్రమే. రెండంటే రెండు నగరాల్లో మాత్రమే 12గంటలపాటు నీటిని సరఫరా చేస్తున్నారు. 62 శాతం పట్టణాల్లో కేవలం సరాసరి సగటున రెండు గంటలపాటు మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారు.
భారత్‌లో నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం సరాసరి సగటున 135 లీటర్లు సరఫరా చేయాలి. అయితే 124.6 లీటర్లు మాత్రమే సరఫరా చేస్తున్నట్లు సర్వేలో తేలింది. ఈ సరఫరా కూడా క్రమబద్ధంగా లేదు. కొన్ని ప్రాంతాల్లో సగటున 298 లీటర్లు సరఫరా చేస్తుండగా, కొన్ని ప్రాంతాల్లో అతి తక్కువగా 37 లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ సెటిల్‌మెంట్’ దేశంలోని 1400 నగరాల్లో నిర్వహించిన సర్వే ప్రకారం సరాసరి సగటున 69 లీటర్ల నీటిని ప్రభుత్వం సరఫరా చేస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో కేప్ టౌన్ పట్టణంలో సరాసరి నీటి వినియోగాన్ని రోజుకు 50 లీటర్లకు తగ్గించగా, ఇప్పటికే భారత్‌లోని కొన్ని నగరాల్లో ఇంత కన్నా తక్కువ నీటిని సరఫరా చేస్తున్నారు.
‘డే జీరో’ వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ కుళాయిల్లో నీరు రావని, ప్రభుత్వం నిర్దేశించిన నీటి కేంద్రాల నుంచే నీటిని సేకరించుకోవాలని కేప్ టౌన్ ప్రభుత్వం అక్కడి ప్రజలను హెచ్చరించింది. కానీ భారతీయ నగరాల్లో కామన్ పాయింట్ల నుంచి నీటిని తెచ్చుకోవడం కామనే. 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం 71 శాతం పట్టణ ప్రజలు ఇళ్లవద్దనే నీటిని పట్టుకుంటారు. 21 శాతం మంది ఇంటికి సమీపంలోని కుళాయిల నుంచి పట్టుకుంటున్నారు. ఎనిమిది శాతం మంది సుదూర ప్రాంతానికి వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు. పట్టణాల్లో 77 శాతం మహిళలు నడిచి రావడానికయ్యే సమయం సహా నీటి కుళాయి వద్ద నీటి కోసం సగటున 30 నిమిషాలు నిరీక్షిస్తోందని ‘నేషనల్ శాంపిల్ సర్వే అఫీస్’ అధ్యయనం వెల్లడిస్తోంది.
ఈ లెక్కన కేప్ టౌన్‌లో భవిష్యత్‌లో రానున్న ‘డే జీరో’ పరిస్థితి భారత్‌లో ఎప్పుడో వచ్చిందన్న మాట. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలోని పట్టణ ప్రాంతాల్లో 37 కోట్ల మంది ప్రజలు ఉండగా, ఆ సంఖ్య 2030 నాటికి 60 కోట్ల మందికి చేరుతుందన్నది ఒక అంచనా. నాటికి నీటి డిమాండ్‌కు సరఫరాకు 50 శాతం వ్యత్యాసం ఉంటుందని ‘అసోసియేటడ్ చేంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా, ఆడిటర్ పీడబ్యూసీ’ ఓ నివేదికలో హెచ్చరించాయి. అప్పటి వరకు మన ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోతే నీటి సరఫరా కేంద్రాల వద్ద మనం ‘తన్నీర్ తన్నీర్’ అంటూ తన్నుకు చావాల్సి వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment