నీటి దందా
♦ భవన నిర్మాణాలకు తాగునీరు
♦ 9 గ్రామాలకు నీళ్లు కరువు
♦ దారి మళ్లిస్తున్న అక్రమార్కులు
♦ చక్రియాల్ పంప్‌హౌస్ నుంచి ప్రత్యేక లైన్‌తో నీటి సరఫరా
♦ చోద్యం చూస్తున్న అధికారులు
అసలే తీవ్ర నీటికొరతతో ప్రజలు అల్లాడుతుంటే.. కొందరు అక్రమార్కులు తాగు నీటిని దారి మళ్లిస్తున్నారు. యథేచ్ఛగా నీటి వ్యాపారం చేస్తున్నారు. చక్రియాల్ పంప్ హౌస్ నుంచి ప్రత్యేక లైన్ ఏర్పాటు చేసి భవన నిర్మాణాలకు నీటిని అందిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటమే ఇందుకు కారణమని స్థానికులు మండిపడుతున్నారు.
పుల్‌కల్: చక్రియాల్ పంప్‌హౌస్ ద్వారా పుల్‌కల్‌తో పాటు అందోల్ మండలంలోని వివిధ గ్రామాలకు నీటిని సరఫరా చేస్తున్నారు. మంజీర బ్యారేజీ పూర్తిగా ఎండిపోవడంతో ప్రత్యేకంగా వేసిన బోర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. నీటి కొరత వల్ల చౌటకూర్, కోర్పోల్, సుల్తాన్‌పూర్, పోసన్‌పల్లి, సరాఫ్‌పల్లి గ్రామాలకు నీటి సరఫరాను నిలిపివేశారు. అయితే వొన్నాపూర్ శివారులోని సత్యసాయి నీటి పథకం నుంచి పక్కనే నిర్మాణం జరుగుతున్న వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్ భవనానికి ప్రత్యేకంగా పైప్‌లైన్ వేశారు. రోజుకు సుమారు 20-30 వేల లీటర్ల వరకు నీటిని సరఫరా చేస్తున్నారు.
అదే నీటిని గ్రామాలకు సరఫరా చేస్తే చక్రియాల్‌తో పాటు మరో 9 గ్రామాల దాహార్తి తీరే అవకాశం ఉంది. కాని స్థానిక గ్రామీణ నీటి సరఫరా అధికారులతో పాటు స్థానిక నాయకులు భవన నిర్మాణ కాంట్రాక్టర్‌తో లాలూచి పడి జనం గొంతు తడపాల్సిన నీటిని నిర్మాణానికి తరలిస్తున్నారు. ‘ఊరికే తీసుకోవడం లేదు. ఇందుకోసం రూ. 2 లక్షలు ఇచ్చాను’.. అంటూ కాంట్రాక్టర్ చెబుతున్నాడు. కానీ జనం నీరు లేక వ్యవసాయ బోర్ల వద్దకు పరుగులు తీస్తుంటే సత్యసాయి నీటి పథకం ద్వారా మాత్రం దర్జాగా భవన నిర్మాణానికి సరఫరా చేస్తున్నారు.
నీటిని విక్రయిస్తున్న ఆపరేటర్లు
చక్రియాల్ నీటి పథకం ద్వారా వొన్నాపూర్ ఫిల్టర్ నుంచి మంచి నీటిని ఆపరేటర్లు విక్రయిస్తున్నారు. ఇటీవల శివ్వంపేటకు చెందిన ఇద్దరు వ్యక్తులకు రూ. 800 తీసుకొని ట్రాక్టర్ ట్యాంకర్‌ను నింపి ఇస్తున్న క్రమంలో స్థానికులు పట్టుకున్నారు. అయినా అధికారుల్లో చలనం లేదు. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో చాలా గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. పంప్ హౌస్‌లో శుద్ధి చేస్తున్న నీటిని తాగేందుకు ఇవ్వకుండా భవన నిర్మాణాలు, ఇతర అవసరాలకు ఆపరేటర్లు విక్రయిస్తుండటం గమనార్హం.
రూ. 2 లక్షలు ఇచ్చాం..
పాలిటెక్నిక్ హాస్టల్ భవన నిర్మాణానికి పైప్‌లైన్ ద్వారా నీటిని తరలిస్తున్నారన్న దానిపై సైట్ మేనేజర్ సుబ్బారావు స్పందిస్తూ.. దొంగతనంగా ఏమీ తీసుకోవడంలేదని, గ్రామస్తుల నిర్ణయం మేరకు రూ. 2 లక్షలు చెల్లించి తీసుకుంటున్నామని తెలిపారు.