మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగడానికి ఉన్న పథకాలు, శిక్షణ కార్యక్రమాలు, మార్కెట్ మెలకువలు, అందుతున్న రుణాలు, వడ్డీ రేటు, సబ్సిడీలు, ఎక్కడ.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి, అవసరమైన డాక్యుమెంట్లు, సక్సెస్ రేట్ వంటి వివరాలను ‘‘ఓనర్‘షి’ప్’’ పేరుతో ప్రతి శనివారం అందిస్తున్నాం! ముద్ర లోన్స్‌ఈ వారం స్కీమ్ ‘ముద్ర లోన్స్’.
ప్రాథమిక అర్హతలు కలిగిన పేద, మహిళలందరూ స్వల్ప వ్యవధిలో సూక్ష్మ, చిన్నతరహా వ్యావపారాలు మొదలుపెట్టేలా ప్రత్సహించే పథకమే ‘ముద్ర లోన్స్’. 2015, ఏప్రిల్‌లో ప్రారంభమైన కేంద్రప్రభుత్వ పథకమిది. ‘క్రెడిట్ గ్యారంటీ ఫండ్’ద్వారా ప్రభుత్వమే రుణ గ్యారంటీ సదుపాయాన్ని కల్పిస్తోంది. రూ. 20 లక్షల వరకు లోన్ దొరుకుతుంది. దీన్ని గ్రామీణ, వాణిజ్య, కో–ఆపరేటివ్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల నుంచి పొందదవచ్చు. ఈ రుణాలను మూడు విభాగాల్లో అందిస్తారు.
శిశు: 50 వేల రూపాయల వరకు రుణం అందుతుంది. అతి చిన్న, వీథి వ్యాపారాలు, కుటీర పరిశ్రమలకు అనుకూలమైనది. ఇందులో అత్యధికంగా 44 వేల 891 కోట్ల రూపాయల వరకు రుణాలు అందించారు.
కిశోర: దీనికింద రూ. 50 వేల నుంచి అయిదు లక్షల వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు. పూచీకత్తు అవసరం లేదు.
తరుణ: రూ. 5 లక్షల పైబడి పది లక్షల వరకు రుణాన్ని పొందవచ్చు. లబ్ధి పొంది, రుణాన్ని విజయవంతంగా తిరిగి చెల్లిస్తున్నవారు అదనంగా మరో 20 లక్షల రూపాయల వరకు ‘తరుణ్ ప్లస్’ రుణాన్ని పొంది, వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశమూ కల్పిస్తోంది ఇది.
కనీస అర్హతలు: రుణాల్లో ఎగవేత రికార్డ్ ఉండకూడదు. క్రెడిట్ ట్రాక్ బాగుండాలి. ప్రాజెక్ట్ రిపోర్ట్ అవసరం. దరఖాస్తుతో ఆధార్, పాన్‌కార్డ్, ఓటరు ఐడీ లేదా డ్రైవింగ్ లైసెన్స్, ఏడాది బ్యాంక్ స్టేట్‌మెంట్, వ్యాపారానికి సంబంధించిన స్కిల్ సర్టిఫికెట్‌ను జత చేయాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలయితే క్యాస్ట్ సర్టిఫికెట్‌నూ పెట్టాలి. తరుణ్ ప్లస్ లోన్‌కి ఐటీఆర్ కూడా పొందుపరచాలి.
ఇదీ చదవండి : Ma Illu ట్విన్స్ విజేత, శ్వేత అనాథలు కాదు అంగరంగ వైభవంగా పెళ్లి!
18 ఏళ్లు పైబడి 60 ఏళ్లలోపు వారందరూ అర్హులే! మంచి వ్యాపార ప్రణాళికతో బ్యాంకులను సంప్రదించాలి. బ్యాంకువారు.. మనం వ్యాపారం పెట్టాలనుకుంటున్న ప్రాంతం, వ్యాపార వృద్ధికి అక్కడున్న అవకాశాలను బట్టి ఎంత రుణమివ్వాలో నిర్ణయిస్తారు. తీసుకున్న రుణాన్ని అయిదేళ్లలోపు చెల్లించే వెసులుబాటు ఉంటుంది. సబ్సిడీ సదుపాయం లేదు. కానీ టాప్ అప్, సీసీ లోన్స్‌ను పొందే వీలుంటుంది. దీనికి వస్తు ఉత్పత్తి, మార్కెట్, సేవారంగాల్లో మంచి అవకాశాలున్నాయి. కూరగాయల అంగళ్లు, విస్తరాకుల తయారీ, పేపర్ కప్స్, సారీ రోలింగ్, లాండ్రీ, కిరాణా షాప్స్, కర్రీపాయింట్స్, పిండి మరలు, జిరాక్స్, ఇంటర్నెట్, డయాగ్నస్టిక్స్, స్టేషనరీ నుంచి ఆటో, క్యాబ్, ట్రాక్టర్, వరికోత మిషన్‌లు, జేసీబీల దాకా దేనికైనా రుణాన్ని పొందవచ్చు. ఈ వ్యాపారం ఎలా ప్రారంభించాలి, సమస్యలను ఎలా అధిగమించాలి వంటివాటి మీద MSME,DIC, బ్యాంకింగ్ రంగాల వారు అవగాహనా సదస్సులను నిర్వహిస్తున్నారు. అంతేకాదు ప్రభుత్వం కూడా శిక్షణ కార్యక్రమాలనూ చేపడుతోంది.
-బి.ఎన్. రత్న, బిజినెస్ కన్సల్టెంట్, దలీప్
మీ సందేహాలను పంపవలసిన మెయిల్ ఐడీ ownership.sakshi@gmail.com
నిర్వహణ : సరస్వతి రమ
Comments
Please login to add a commentAdd a comment