
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ రంగాల కోసం డిజిటల్ బిజినెస్ లోన్ ప్రారంభించింది. రానున్న ఐదు సంవత్సరాల్లో ఈ విభాగం వేగంగా అభివృద్ధి చెందుతుందని భావించి లోన్స్ వేగంగా అందించడానికి ఎస్బీఐ సన్నద్ధమైంది.
ఎంఎస్ఎంఈలకు కేవలం లోన్స్ అందించడం బ్యాంక్ పురోగతికి కూడా దోహదపడుతుంది. గత ఆర్ధిక సంవత్సరంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంఎస్ఎంఈలకు ఏకంగా రూ. 4.33 లక్షల కోట్ల లోన్ మంజూరు చేసింది. ఇది 2022-23 ఆర్థిక సంవత్సరం కంటే సుమారు 20 శాతం ఎక్కువని తెలుస్తోంది.
మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ రంగాలకు 45 నిమిషాల్లో లోన్ అందిస్తామని, ఇప్పటికే తమ వద్ద ఎంఎస్ఎంఈలకు సంబంధించిన చాలా సమాచారం ఉందని, ఇది లోన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయడంలో ఉపయోగపడుతుందని ఎస్బీఐ చైర్మన్ దినేష్ కుమార్ ఖారా అన్నారు.
కేవలం 45 నిమిషాల్లో లోన్ అందించడం ఎంఎస్ఎంఈలకు ఓ గొప్ప అవకాశం అనే చెప్పాలి. తక్కువ సమయంలో లోన్ మంజూరు చేయడం వల్ల బ్యాంక్ ప్రక్రియ మరింత సులభతరం అవుతుంది. ఈ విధానం సుదీర్ఘ పరిశీలనకు మంగళం పాడనుంది. ప్రస్తుతం రూ. 50 లక్షల వరకు లోన్ తీసుకోవడానికి ఎలాంటి ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్‌లను అందించాల్సిన అవసరం లేదు. కేవలం జీఎస్తీ రిటర్న్స్ సమర్పిస్తే సరిపోతుందని ఎస్బీఐ స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment