బ్రిటష్ పాలనలో దారుణంగా దెబ్బతిన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఇ) రంగం స్వాతంత్య్రానంతరం చెప్పుకోదగినంత పురోగతినే సాధించింది. ఒకప్పుడు గ్రీస్, రోమన్ సామ్రాజ్యాలకు మేలిమి వస్త్రాలను ఎగుమతి చేసిన భారతదేశం వలస పాలనతో తన వైభవాన్ని కోల్పోడానికి కారణం మన జౌళి ఎగుమతులపై బ్రిటిష్ వాళ్లు అపరిమితంగా సుంకాలు విధించడమే. భారతదేశాన్ని కేవలం ముడి సరకుల ఎగుమతిదారు స్థాయికి దిగజార్చి బ్రిటన్‌లో యంత్రాలపై తయారైన వస్తువులను భారతీయులకు అధిక ధరలకు అంటగట్టేవారు. పర్యవసానంగా స్థానిక కుటీర పరిశ్రమలవారు, చేతివృత్తుల వారు ఎన్నటికీ కోలుకోని విధంగా దెబ్బతిన్నారు.
మిగతా రంగాలు కూడా ఇదే విధంగా క్షీణించి పోయాయి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1948 లో స్వదేశీ ప్రభుత్వం ప్రకటించిన పారిశ్రామిక విధానం ఏమంత సత్ఫలితాలను ఇవ్వలేదు. తర్వాత 1956 నాటి పారిశ్రామిక విధానం గ్రామీణ, కుటీర, చిన్న పరిశ్రమలకు ఊతం ఇవ్వాలన్న లక్ష్యంతో ఏర్పడింది. 1991 నాటి పారిశ్రామిక విధానం కొన్ని సంస్కరణలను సూచించింది. 1997 పారిశ్రామిక విధానం చిన్న పరిశ్రమలను సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలుగా వర్గీకరించింది. 2006 నాటి ఎంఎస్‌ఎంఇ అభివృద్ధి చట్టం నిర్దిష్ట విధానాలను ముందుకు తెచ్చింది. 2020లో ఆత్మనిర్భర్ పథకంలో ఎంఎస్‌ఎంఇల వర్గీకరణకు కొత్త ప్రమాణాలు ప్రతిపాదనకు వచ్చాయి. స్వాతంత్య్రం వచ్చిన సుమారు డెబ్బై ఏళ్లకు 2015–16లో ఈ రంగం 10 కోట్ల ఉద్యోగాలను సృష్టించిందని 73 వ జాతీయ నమూనా సర్వే పేర్కొంది. వచ్చే పాతికేళ్లలో కనుక విధానపరంగా ప్రోత్సాహం లభిస్తే ఈ రంగం మరింతగా పురోగమించగలదని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment