ఇదేం కరువు మాయమైన చెట్టూ చెరువు | What is this drought | Sakshi
Sakshi News home page

ఇదేం కరువు మాయమైన చెట్టూ చెరువు

Published Sat, Apr 30 2016 10:53 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

ఇదేం కరువు మాయమైన చెట్టూ చెరువు - Sakshi

ఇదేం కరువు మాయమైన చెట్టూ చెరువు

రంగారెడ్డి జిల్లాలో తీవ్ర దుర్భిక్షం
 
♦ ఎన్నడూ ఎండిపోని చెరువులూ నైచ్చాయి
♦ పశువులకు గ్రాసం కరువు.. మేత లేక సంతలో అమ్ముకుంటున్న రైతులు
♦ సాగు పనుల్లేక వలసబాట పట్టిన రైతులు, కూలీలు
 
 ఇది రంగారెడ్డి జిల్లాలోనే అతిపెద్ద
 సాగునీటి ప్రాజెక్టు కోటిపల్లి దుస్థితి!

 12,600 ఎకరాలను స్థిరీకరించే ఈ జలాశయం ఎండిపోవడంతో దీని పరిధిలోని ఆయకట్టు బీడును తలపిస్తోంది. ఒకప్పుడు బోటు షికారు.. చేపల వేట.. పర్యాటకుల సందడితో కళకళలాడే ఈ ప్రాజెక్టు ఇప్పుడిలా కళావిహీనంగా కనిపిస్తోంది. దీని నీటి నిల్వ సామర్థ్యం 1,688 అడుగులు. కానీ ఇప్పుడు ఓ బురద గుంటగా మారింది. మరో వారం రోజుల్లో ఈ నీరు కూడా ఆవిరైపోతుందని భావించిన మత్స్యకారులు బురదలో వలలు వేసి చేపలను పట్టారు.  జిల్లాలో ఎక్కడ చూసినా నైచ్చిన నేలలు, అడుగంటిన జలాశయాలు, ఎండిపోయిన పంటలు, మోడువారిన చెట్లే కనిపిస్తున్నాయి. పశువులకు గ్రాసం కరువవడంతో వాటిని సాకలేక రైతులు సంతల్లో అమ్మేస్తున్నారు. రాష్ట్ర రాజధాని అవసరాలను తీర్చే కూరగాయల పంటలు, ఉద్యాన తోటలపైనా కరువు పంజా విసిరింది. ఎద్దు, ఎవుసం పోవడంతో పొట్ట చేతబట్టుకొని రైతులు, వ్యవసాయ కూలీలు వలసబాట పడుతున్నారు! రంగారెడ్డి జిల్లాలో కరువుపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం...
 - డోకూరి వెంకటేశ్వర్‌రెడ్డి, సాక్షి ప్రతినిధి, రంగారెడ్డి
 
 మేత లేక.. సాకలేక
 ఈ చిత్రంలో చూడముచ్చటగా కనిపిస్తున్న కాడెద్దులు అమ్మకానికి వచ్చాయి. ఇన్నాళ్లు కంటికి రెప్పలా కాపాడుకున్న ఎడ్లను సాకలేక మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరుకు చెందిన రైతు అంజన్‌గౌడ్ సర్దార్‌నగర్ సంతకు ఇలా తీసుకొచ్చాడు. అంజన్‌గౌడ్ బలహీనతను సొమ్ము చేసుకునేందుకు దళారీలు జోడెడ్లను రూ.40 వేలకు అమ్మాలని బేరమాడారు. ఒకప్పుడు రూ.1.20 లక్షలకు బేరం వచ్చినా అమ్మేందుకు మనసొప్పని ఆ రైతు... దళారుల ధరతో నివ్వెరపోయాడు. ‘ఏం చేస్తాం సార్.. నాకున్న రెండెకరాల్లో మొక్కజొన్న, పత్తి, మినుములు వేశా. వర్షాల్లేక అవి పూర్తిగా ఎండిపోయాయి. బోరు బావి తవ్వించా. అది కూడా పోయింది. మరోవైపు పశువులకు మేత కూడా కరువైంది. చేసేదిలేక నమ్ముకున్న ఎడ్లను అమ్ముదామని సంతకు వస్తే ఇదీ పరిస్థితి’ అని వాపోయాడు.
 
 చెరువు తోటయింది..
 ఈ చిత్రం చూశారా! ఇదొక జ లాశయం. దాదా పు 3 వేల ఎకరాల ఆయకట్టును సస్యశ్యామలం చేసే ప్రాజెక్టు. సీను కట్ చేస్తే.. ఇప్పుడో తోట! ఈ చెరువు ఎండిపోవడంతో ఓ వ్యాపారి ప్రాజెక్టును పండ్ల తోటగా మార్చాడు. చెరువు గర్భంలో కర్బుజా తోటను సాగు చేశాడు. సారవంతమైన ఒండ్రుమట్టి కావడంతో దిగుబడి కూడా బాగానే వచ్చింది. ఇదంతా ఎక్కడనుకుంటున్నారా. పరిగి మండలం లక్నాపూర్ ప్రాజెక్టులో. మునుపెన్నడూ ఎండిపోని ఈ రిజర్వాయర్ తొలిసారి ఎండిపోయింది. ఎండుముఖం పట్టిన చెరువు పరిస్థితిని ముందే ఊహించిన వ్యాపారి అక్రమంగా పండ్ల తోటను వేశాడు. దీంతో ఇప్పుడు చెరువు స్థానంలో తోట దర్శనమిస్తోంది.
 
 అన్నదాతకు ఎంత కష్టం.. ఎంత నష్టం
 
ఆవులకు మేత పెట్టలేని దయనీయ పరిస్థితిలో అన్నదాతలు దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఏళ్లుగా కుటుంబంలో ఒక్కరిగా మెలిగిన గోమాతను గత్యంతరం లేక రైతన్నలు అమ్మకానికి పెట్టారు. గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు సుమారు రూ.4 కోట్ల విలువైన ఆవులు,గేదెలు,ఎడ్లను రైతులు విక్రయించారు. పంటలు ఎండుతున్నా.. వాటికోసం  చేసిన అప్పుల వడ్డీలు మాత్రం పెరుగుతున్నాయి. కనీసం పశువులకు మేత కూడా పెట్టలేని దయనీయ పరిస్థితి. ఒక్కొక్క రైతుది ఒక్కో దీనగాథ. కూతుళ్ల పెళ్లిళ్ల కోసం కొందరు.. అప్పుల వడ్డీ పెరుగుతుందనే కారణంతో కొందరు.. గ్రాసం కోసం వందల్లో ఖర్చు పెట్ట లేక మరికొందరు పశువులను అమ్మేసుకుంటున్నారు.
 
 రోజుకు గడ్డికి రూ.500 ఖర్చు
 పశుగ్రాసం కొరత ఉంది. జత ఎడ్లకు మేతకు రోజుకు రూ.500 ఖర్చు పెట్టాలి. నెలకు ఒక ట్రాక్టర్ గడ్డికి రూ.15 వేల వరకు పెట్టుబడి కావాలి. అంత డబ్బు లేదు. వరి పంట వేసినా..నీళ్లు లేక ఎండిపోయింది.  పంటలకోసం చేసిన అప్పులు ఉన్నాయి. వాటికి మిత్తి కట్టాల్సి వస్తుంది. అందుకే ఎడ్లను రూ.40 వేలకు విక్రయించాను.
 - కృష్ణ, పాత తాండూరు
 
 బిడ్డ పెళ్లి కోసం...ఎడ్ల అమ్మకం
 రూ.1 లక్ష వరకు పంటల కోసం చేసిన అప్పు ఉంది. కంది పంట దిగుబడులు అంతంతమాత్రంగా వచ్చాయి. పశువులకు గడ్డి లభించడం లేదు. మోపు ధర అధికంగా ఉంది. పశువులకు మేత పెట్టే స్తోమత లేదు. ఇప్పుడు బిడ్డ పెళ్లి పెట్టుకున్నా. అందుకే రెండ ఎడ్లను రూ.60వేలకు అమ్మకానికి పెట్టాను.
 - అంజిలయ్య,వాల్మీకినగర్
 
 ఉద్యానం ఢమాల్..
 ఉద్యాన పంటల సాగు భారీగా తగ్గిపోయింది. హైదరాబాద్ చుట్టూరా విస్తరించి ఉండడంతో జిల్లాలో పండి ంచిన కూరగాయల్ని నేరుగా నగరంలోని మార్కెట్లకు రైతులు తరలిస్తారు. జిల్లాలో ఏటా 28,264 హెక్టార్లలో వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతోటలు సాగవుతాయి. కానీ ఈసారి ఉద్యాన పంటల సాగు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టింది. జిల్లాలో అధికంగా సాగయ్యే టమాటా పంట దిగుబడి దారుణంగా పడిపోయింది. చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి టమాటాను చేవెళ్ల మార్కెట్‌కు దిగుమతి చేసుకుంటున్నారంటే కూరగాయల కొరత తీవ్రతను అంచనా వేసుకోవచ్చు. ఉత్తరాదితో పాటు విదేశాలకు ఎగుమతి చేసే క్యారెట్ పంట 1,736 హెక్టార్ల నుంచి 250 హెక్టార్లకు పడిపోయింది.
 
 30% తగ్గిన పాల ఉత్పత్తి...
 పాడిరైతులు అధిక ధర వెచ్చించి గ్రాసం కొనలేక.. పశువులనే విక్రయించేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో పాలిచ్చే ఆవులు, గేదెల సంఖ్య క్రమంగా తగ్గడంతో పాల ఉత్పత్తిపై ప్రభావం పడింది. జిల్లాలో 65వేల మంది రైతులు పాడిపరిశ్రమపై ఆధారపడ్డవారే. రోజుకు సగటున 1.5 లక్షల లీటర్ల పాలు నగరానికి ఎగుమతి అవుతాయి. తాజా పరిస్థితులతో పాల దిగుబడి 30 శాతం తగ్గింది. ప్రస్తుతం రోజుకు 1.06 లక్షల లీటర్ల పాలు ఎగుమతి చేస్తున్నట్లు మదర్ డెయిరీ మేనేజర్ రమేశ్ చెప్పారు.
 
 శివసాగర్  ఎండింది
 వికారారాబాద్ పట్టణ ప్రజల తాగునీ టి అవసరాలను తీ ర్చే శివసాగర్ చెరువు తొలిసారి ఇలా ఎండిపోయింది. లక్ష జనాభా కలిగిన వికారాబాద్ పట్టణానికి ప్రతిరోజూ 2.44 ఎంఎల్‌డీ నీటిని సరఫరా చేసే ఈ జలాశయం చుక్కనీరు కూడా లేకపోవడంతో తాగునీటికి బోరుబావులపైనే ఆధారపడాల్సి వస్తోంది.
 
 చెంతనే నది అయినా..

 యాలాల మండలం బాణాపూర్ అనుబంధ గ్రామం అడాల్‌పూర్ పక్కనే కాగ్నా నది ఉంది. ఇన్నేళ్లూ ఈ నదీ ప్రవాహంతో అడాల్‌పూర్‌వాసులకు నీటి  కష్టాలంటే తెలియదు. కానీ ఇప్పుడు తొలిసారి నది ఎండిపోయింది. ఇది 40 ఏళ్ల చరిత్రలోనే అతిపెద్ద కరువుగా చెబుతున్న ఈ గ్రామ ప్రజలు... నది అంతర్భాగంలో చెలిమ తవ్వారు. ఈ చెలిమే మండు వేసవిలోనూ వారి దప్పికను తీరుస్తోంది. కాగ్నా ఎండిపోవడంతో తాండూరుకూ తిప్పలు తప్పడం లేదు. ఇక్కడ మూడ్రోజులకోసారి నీటిని సరఫరా చేస్తున్నారు.
 
 2,350 చెరువులు ఎండిపోయాయి
 సాగునీటి ప్రాజెక్టులు పెద్దగా లేకపోవడంతో జిల్లా రైతాంగం భూగర్భ జలాలపైనే ఆధారపడుతోంది. జిల్లావ్యాప్తంగా 2,851 నీటి వనరులు ఉన్నాయి. ఇందులో వంద ఎకరాల విస్తీర్ణం పైబడి 264 చెరువులు, వంద ఎకరాలలోపు చెరువులు 2,587 ఉన్నాయి. ఇవన్నీ నీటితో కళకళలాడితే 1,28,774 ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది. ప్రస్తుతం జిల్లాలో 2,350 చెరువులు పూర్తిగా ఎండిపోయాయి. చిన్ననీటి పారుదల ప్రాజెక్టులు కోటిపల్లి, లక్నాపూర్, ఇబ్రహీంపట్నం, శివసాగర్ ప్రాజెక్టులు.. జంటనగరాల దాహార్తి తీర్చే ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లు కరువు విలయానికి ఎడారులుగా మారాయి.
 
 తాగునీటికి తండ్లాట..
 గ్రామీణ నీటిసరఫరా విభాగం గణాంకాల ప్రకారం జిల్లాలో 1,646 ఆవాసాలుండగా.. ఇందులో 1,637 ఆవాసాల్లో తాగునీటి సమస్య  ఉన్నట్లు గుర్తించారు. ప్రభుత్వ బోర్లు ఎండిపోవడంతో అద్దెకు బోర్లు తీసుకుని ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ.. సమస్యకు పూర్తిస్థాయి పరిష్కారం దొరకడంలేదు.

► జిల్లాలోని 12 మండలాల్లో 20 మీటర్ల నుంచి 43 మీటర్లలోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. మరో 15 మండలాల్లో 20 మీటర్లలోతులో గంగమ్మ ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. బంట్వారంలో గతేడాది ఇదే సమయంలో 35 మీటర్లలోతులో నీరు లభ్యమైతే.. ప్రస్తుతం 43 మీటర్లకు పడిపోయింది. మొయినాబాద్ మండలంలో గతేడాది ఇదే సమయంలో 27.66 మీటర్ల లోతులో జలాలుండగా.. ప్రస్తుతం 40.46 మీటర్ల లోతుకు వెళ్లాయి.
► జిల్లాలో 10,615 గ్రామీణ నీటి సరఫరా విభా గం బోర్లు, చేతి పంపులుండగా.. ఇందులో 6వేలకు పైగా బోర్లలో నీళ్లు పూర్తిగా అడుగంటాయి.
 
 చలో పుణే.. ముంబై
 పల్లెలపై కరువు తీవ్ర ప్రభావం చూపుతోంది. వ్యవసాయం లేక.. ఉపాధి కరువై గ్రామాలను ఖాళీ చేయిస్తోంది.  ఉన్న ఊరిలో ఉపాధి కరువై.. పిల్లాజెల్లా.. తట్టాబుట్టా సర్దుకొని ఉపాధి కోసం ముంబై, పుణే రెలైక్కుతున్నారు. వలస వెళుతున్న వారిలో ఎక్కువగా రైతులే ఉన్నారు. కరువుతో పంటలు లేక.. చేసిన అప్పులు తీర్చలేక.. కుటుంబ పోషణ కోసం పట్టణాల వైపు పయనిస్తున్నారు. తాండూరు రైల్వే స్టేషన్ మీదుగా వెళ్లే కోణార్క్, రాజ్‌కోట్, హుస్సేన్‌సాగర్, ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో రోజుకు సగటున ఆరేడు వేల మంది ముంబై, పుణే, కుర్ల, థానే, లోనావాలాకు వలస వెళుతున్నట్లు రైల్వేశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

గత నెల నుంచి వలసల పర్వం మొదలైందని రైల్వే టికెట్ల జారీని బట్టి తెలుస్తోంది. తాండూరు డివిజన్‌లోని సిరిగిరిపేట్, సంకిరెడ్డిపల్లితండా, గోవింద్‌రావుపేట, తొప్పర్లగడ్డ తండా, దుబ్బల తండా, మన్‌సాన్‌పల్లి, కోత్లాపూర్, నంద్యానాయక్, బాబునాయక్ తండాలతోపాటు మైల్వార్, నీళ్లపల్లి, జిల్లాలోని దోమ, కులకచర్ల గ్రామాల ప్రజలు తాండూరు రైల్వేస్టేషన్ నుంచి రోజుకు జనరల్ కేటగిరీ టికెట్లు 6 వందల వరకు విక్రయం అవుతున్నట్టు రైల్వే వర్గాలు చెబుతున్నాయి. భవన నిర్మాణ పనులు లేదా అడ్డా కూలీలుగా అక్కడికి వెళ్లడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. ఉపాధి హామీ కింద పనులు కల్పించినా డబ్బుల చెల్లింపులో జాప్యం జరుగుతుండడం కూడా వలసలకు కారణమవుతోంది.
 
 ప్రతి పశువుకు రెండు కేజీల దాణా

 జిల్లాలో కరువు తీవ్రంగా ఉంది. నీటి కొరత ఉన్నప్పటికీ, నియంత్రణలో ఉంది. 205 ఆవాసాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నాం. 87 బోర్లను అద్దెకు తీసుకున్నాం. 14 ప్రాంతాల్లో నీటి ఫిల్లింగ్ చేసి... ఎద్దడి ఉన్న గ్రామాల్లో పంపిణీ చేస్తున్నాం. కరువు ప్రభావం పశువులపై పడింది. పశుగ్రాసం దొరకడం లేదు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు సబ్సిడీపై గడ్డి విత్తనాలను పంపిణీ చేశాం. ప్రతి పశువుకు రోజుకు 2 కేజీల దాణా ఇవ్వాలనే ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపుతున్నాం. నీటి తొట్లను కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. ఉపాధి కూలీలు వడదెబ్బ బారిన పడకుండా ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, డేరాలను అందజేస్తున్నాం.   
 - రజత్‌కుమార్‌సైనీ, రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్
 
 మకరందం కాదు.. మంచినీళ్లు కావాలి!
 మనుషులే కాదు నీళ్లకోసం క్రిమికీటకాలూ అవస్థలు పడుతున్నా యి. రంగారెడ్డి జిల్లా పరిగిలో ఓ పళ్ల రసం అమ్మే వ్యాపారి రెండు గ్లాసుల్లో నీళ్లు నిం పి పెట్టగా ఇలా గుం పుగా వచ్చిన తేనెటీగ లు దాహం తీర్చు కున్నాయి.  
   - పరిగి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement