తిరుమల గోవిందుని సన్నిధిలో తాగడానికి గుక్కెడు నీళ్లు కరువైపోయాయి. కొండమీద తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల తాగునీటి జలాశయాలు ఎండిపోయాయి. ఉన్న నీటితో రెండు బ్రహ్మోత్సవాలు నెట్టుకొచ్చిన టీటీడీకి భవిష్యత్‌పై నీటి కష్టం ఎదురవుతోంది.
కొండమీద పెరిగిన నీటి పొదుపు చర్యలు
తీవ్ర నీటి ఎద్దడి కారణంగా తిరుమల కొండ మీద టీటీడీ నీటి పొదుపు చర్యలు చేపట్టింది.ఆలయం, అన్నప్రసాద కేంద్రం మినహాయించి మిగిలిన చోట్ల సుమారు 40 శాతం కోత విధించారు. 30 మఠాలు, 20 దాకా పెద్ద హోటళ్లు, మరో 50 హోటళ్లకు సరఫరాలోనూ పొదుపు చర్యల్ని తీవ్రం చేశారు. దీంతో తిరుపతి నుంచి ట్యాంకర్లతో నీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇక స్థానికులు నివాసం ఉండే బాలాజీనగర్‌లో కూడా పది రోజులకు ఒకసారి సరఫరా చేస్తున్నారు. కాటేజీల్లోని నీటి కొళాయిల సరఫరాలోనూ కోత విధించారు. ఆరుబయట కొన్ని తాగునీటి కొళాయిల్ని మూసివేశారు. ఆరుబయట రోడ్లకు ఇరువైపులా ఉండే మరుగుదొడ్లు, స్నానాల గదుల్లో కొన్ని మూసివేశారు. నీరు వృథా కాకుండా నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేశారు.
అడుగంటి ప్రధాన జలాశయాలు
శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులతోపాటు ఆలయ అవసరాల కోసం 32 లక్షల గ్యాలన్లు నీరు అవసరం. ఏటా కొండమీద శేషాచలం అడవుల్లో 1,369 మి.మీ.వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఈ యేడు అందులో సగం కూడా పడలేదు. దీంతో తాగునీరు సరఫరా చేసే గోగర్భం ( 2,840 లక్షల గ్యాలన్ల సామర్థ్యం), ఆకాశ గంగ (670 లక్షల గ్యాలన్లు), పాపవినాశనం (5,240 లక్షల గ్యాలన్లు), కుమారధార(3,224 లక్షల గ్యాలన్లు), పసుపుధార (886.70 లక్షల గ్యాలన్ల) ఎండిపోయాయి. ఈ ప్రాజెక్టుల్లో అడుగంటిన బురద నీరు కనిపిస్తోంది.
గంగ, బోర్ల నీటితో నెట్టుకొస్తున్న టీటీడీ
తిరుమల అవసరాల కోసం రోజూ 7 ఎంఎల్‌డీ (మిలియన్ లీటర్స్ పెర్ డే) తెలుగుగంగ నీటిని సరఫరా చేస్తున్నారు. ఒప్పందం ప్రకారం రోజూ 10 ఎంఎల్‌డీ (22.5 లక్షల గ్యాలన్లు) తెలుగుగంగ నీటిని సరఫరా చేయాల్సి ఉన్నా అది అమలు కావటం లేదు. దీనిపై ప్రభుత్వంతో టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు చర్చలు జరుపుతూ తెలుగుగంగ కోటాను పెంచే చర్యలు చేపట్టారు. దీంతోపాటు కల్యాణిడ్యామ్‌లో వేసిన బోర్ల ద్వారా మరికొంత నీటిని సేకరిస్తున్నారు. గతంలో ఇక్కడ వేసిన 25 బోర్లలో 13 ఎండిపోయాయి.
వర్షంపై టీటీడీ గంపెడాశ
నైరుతి రుతుపవనాలు మొహం చాటేయగా, ఈశాన్య రుతుపవనాలపై టీటీడీ గంపెడాశతో ఉంది. ఈనెల 11వ తేది నుంచి ప్రారంభమయ్యే కార్తీక మాసంలో తిరుమలలో వర్షం కురిసే అవకాశం ఉందని టీటీడీ వాటర్‌వర్క్స్ ఇంజనీరు నర సింహమూర్తి తెలిపారు. ఆ మేరకు వర్షాలు పడకుంటే తిరుమల భక్తులకు తాగునీటి కష్టాలు మరింతగా పెరిగే ప్రమాదముంది.
ఏడుకొండలపై నీటికి కోటా
Published Thu, Nov 5 2015 9:38 AM | Last Updated on Sun, Sep 3 2017 12:04 PM
Advertisement