titidi
-
‘రామయ్య’ బ్రహ్మోత్సవాలకు కసరత్తు
ఒంటిమిట్ట రామాలయం(రాజంపేట): వచ్చేనెల 5నుంచి 14వరకు జరిగే ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్ధానం (టీటీడీ) కసరత్తు చేస్తోంది. ఈ మేరకు శుక్రవారం ఆలయంలోని రంగమండపంలో అధికారులతో టీటీడీ జేఈఓ పోలా భాస్కర్ సమీక్షించారు. సీఈ చంద్రశేఖరరెడ్డి, డీఎఫ్ఓ శివరాంప్రసాద్, ఎస్ఈ రాములు, వెంకటేశ్వర్లు, విజలెన్స్ అధికారి సుకుమార్, ఏపీఎస్పీడీసీఎల్ డీఈ చంద్రశేఖర్, స్ధానిక తహసీల్దారు శ్రీనివాసులరెడ్డి, టీటీడీ డిప్యూటీ ఈఓ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ నాగరాజు, ఆలయ ప్రధానఅర్చకులు వీణారాఘవచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఇవీ నిర్ణయాలు.. ఒంటిమిట్ట రామయ్య బ్రçహ్మోత్సవాలకు రూ.3,86 కోట్లు వ్యయం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దాశరధి కల్యాణాన్ని 70వేల మంది వీక్షించేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఆలయ సంప్రదాయాల ప్రకారం ఉత్సవాలు జరిపేందుకు ప్రణాళికలు రూపొందించారు. రామాలయానికి వచ్చే భక్తులకు సౌకర్యాలను కల్పించే అంశాలను ప్రస్తావించారు. కల్యాణవేదిక వద్ద ఎల్ఈడీలు ఏర్పాటు చేస్తున్నారు. కళ్యాణవేదిక నుంచి రామాలయంతోపాటు వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల విద్యుత్ పనులకు సంబంధించి రూ 1,01,75,000,00 ఖర్చు చేయనున్నారు. వివిధ సౌకర్యాలకు సంబంధించి ఏర్పాట్లు నిమిత్తం రూ.259లక్షలను వ్యయం చేస్తున్నారు. ఈ పనుల చేపట్టేం తేదిలను టీటీడీ ఖరారు చేస్తుంది. అలాగే రూ.977లక్షల వ్యయంతో ప్రతిపాదనలను సిద్ధం చేశారు. సమన్వయంతో పనిచేయాలి ఒంటిమిట్టలో శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని టీటీడీ జేఈఓ పోలా భాస్కర్ ఆదేశించారు. రంగమండపంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి అధికారికంగా రామాలయంలో జరిగే నవమి ఉత్సవాలు వైభవంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంతకముందుగా స్వామివారిని జేఈఓ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. -
వీ వాంట్ లడ్డూస్..!
- శ్రీవారి లడ్డూల కోసం భక్తుల నిరసన - అదనపు లడ్డూలు ఇవ్వాలని నినాదాలు సాక్షి,తిరుమల: తిరుమలలో శ్రీవారి లడ్డూల కోసం బుధవారం భక్తులు ఆందోళనకు దిగారు. ఆలయం వెలుపల అదనపు లడ్డూ కౌంటర్లో భక్తుల రద్దీని బట్టి రూ.25 ధరతో రూ.50కి రెండు, రూ.100కి నాల్గు చొప్పన లడ్డూలు విక్రయిస్తారు. ఉదయం వేళ సుమారు 2 వేల లడ్డూలు మాత్రమే కేటాయించారు. తర్వాత కౌంటర్ మూసివేశారు. దీనిపై భక్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము క్యూలో నిరీక్షిస్తున్నా లడ్డూలు ఇవ్వకుండా కౌంటర్ మూసివేయటం తగదంటూ ఆలయం వద్ద నినాదాలు చేశారు. ‘‘వీ వాంట్ లడ్డూస్..వీ వాంట్ లడ్డూస్’’ అంటూ నిరసన వ్యక్తం చేశారు. దీంతో విజిలెన్స్ సిబ్బంది అప్రమత్తమై వారిని వారించి పంపించేశారు. రోజూ 3 నుండి 3.5 లక్షల లడ్డూలు తయారు చేస్తున్నా డిమాండ్ రెట్టింపు స్థాయిలో ఉండటమే లడ్డూల కొరతకు ప్రధాన కారణంగా ఉందని ఆలయ అధికారులు చెబుతున్నారు. అదనపు లడ్డూలు తయారు చేయటానికి ఆలయ పోటులో స్థలం సరిపోదని చెబుతున్నారు. నేడు గోకులాష్టమి తిరుమలలో శ్రీవారి ఆలయంలో గురువారం గోకులాష్టమి ఆస్థానం నిర్వహించనున్నారు. రాత్రి 8 నుండి 10 గంటల వరకు బంగారు వాకిలిలో వైదికంగా ఈ ఆస్థాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పకు ఏకాంతంగా తిరుమంజనం నిర్వహిస్తారు. 26వ తేదిన శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప సమక్షంలో ఆలయ పురవీధుల్లో ఉట్లోత్సవం నిర్వహిస్తారు. శుక్రవారం నిర్వహించాల్సిన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార ఆర్జిత సేవలు టీటీడీ రద్దు చేసింది. -
ఏడుకొండలపై నీటికి కోటా
తిరుమల గోవిందుని సన్నిధిలో తాగడానికి గుక్కెడు నీళ్లు కరువైపోయాయి. కొండమీద తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల తాగునీటి జలాశయాలు ఎండిపోయాయి. ఉన్న నీటితో రెండు బ్రహ్మోత్సవాలు నెట్టుకొచ్చిన టీటీడీకి భవిష్యత్‌పై నీటి కష్టం ఎదురవుతోంది. కొండమీద పెరిగిన నీటి పొదుపు చర్యలు తీవ్ర నీటి ఎద్దడి కారణంగా తిరుమల కొండ మీద టీటీడీ నీటి పొదుపు చర్యలు చేపట్టింది.ఆలయం, అన్నప్రసాద కేంద్రం మినహాయించి మిగిలిన చోట్ల సుమారు 40 శాతం కోత విధించారు. 30 మఠాలు, 20 దాకా పెద్ద హోటళ్లు, మరో 50 హోటళ్లకు సరఫరాలోనూ పొదుపు చర్యల్ని తీవ్రం చేశారు. దీంతో తిరుపతి నుంచి ట్యాంకర్లతో నీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇక స్థానికులు నివాసం ఉండే బాలాజీనగర్‌లో కూడా పది రోజులకు ఒకసారి సరఫరా చేస్తున్నారు. కాటేజీల్లోని నీటి కొళాయిల సరఫరాలోనూ కోత విధించారు. ఆరుబయట కొన్ని తాగునీటి కొళాయిల్ని మూసివేశారు. ఆరుబయట రోడ్లకు ఇరువైపులా ఉండే మరుగుదొడ్లు, స్నానాల గదుల్లో కొన్ని మూసివేశారు. నీరు వృథా కాకుండా నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేశారు. అడుగంటి ప్రధాన జలాశయాలు శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులతోపాటు ఆలయ అవసరాల కోసం 32 లక్షల గ్యాలన్లు నీరు అవసరం. ఏటా కొండమీద శేషాచలం అడవుల్లో 1,369 మి.మీ.వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఈ యేడు అందులో సగం కూడా పడలేదు. దీంతో తాగునీరు సరఫరా చేసే గోగర్భం ( 2,840 లక్షల గ్యాలన్ల సామర్థ్యం), ఆకాశ గంగ (670 లక్షల గ్యాలన్లు), పాపవినాశనం (5,240 లక్షల గ్యాలన్లు), కుమారధార(3,224 లక్షల గ్యాలన్లు), పసుపుధార (886.70 లక్షల గ్యాలన్ల) ఎండిపోయాయి. ఈ ప్రాజెక్టుల్లో అడుగంటిన బురద నీరు కనిపిస్తోంది. గంగ, బోర్ల నీటితో నెట్టుకొస్తున్న టీటీడీ తిరుమల అవసరాల కోసం రోజూ 7 ఎంఎల్డీ (మిలియన్ లీటర్స్ పెర్ డే) తెలుగుగంగ నీటిని సరఫరా చేస్తున్నారు. ఒప్పందం ప్రకారం రోజూ 10 ఎంఎల్డీ (22.5 లక్షల గ్యాలన్లు) తెలుగుగంగ నీటిని సరఫరా చేయాల్సి ఉన్నా అది అమలు కావటం లేదు. దీనిపై ప్రభుత్వంతో టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు చర్చలు జరుపుతూ తెలుగుగంగ కోటాను పెంచే చర్యలు చేపట్టారు. దీంతోపాటు కల్యాణిడ్యామ్లో వేసిన బోర్ల ద్వారా మరికొంత నీటిని సేకరిస్తున్నారు. గతంలో ఇక్కడ వేసిన 25 బోర్లలో 13 ఎండిపోయాయి. వర్షంపై టీటీడీ గంపెడాశ నైరుతి రుతుపవనాలు మొహం చాటేయగా, ఈశాన్య రుతుపవనాలపై టీటీడీ గంపెడాశతో ఉంది. ఈనెల 11వ తేది నుంచి ప్రారంభమయ్యే కార్తీక మాసంలో తిరుమలలో వర్షం కురిసే అవకాశం ఉందని టీటీడీ వాటర్‌వర్క్స్ ఇంజనీరు నర సింహమూర్తి తెలిపారు. ఆ మేరకు వర్షాలు పడకుంటే తిరుమల భక్తులకు తాగునీటి కష్టాలు మరింతగా పెరిగే ప్రమాదముంది. -
మెడికల్ హబ్ దిశగా తిరుపతి!
ఆరు వైద్య కేంద్రాలను అనుసంధానించే యోచన 12 మంది కమిటీతో కీలక నివేదిక నిర్వహణతోపాటు కీలకపోస్టులో టీటీడీ ఈవో హబ్ డెరైక్టర్‌పై ఆశలు పెంచుకున్న బర్డ్ డెరైక్టర్ నేడు సీఎం చంద్రబాబు అంగీకారమే తరువాయి తిరుపతి సిటీ: వైద్య రంగంలో తిరుపతి మరో ముందడుగు వేసేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా కార్యాచరణ రూపొందిస్తున్నాయి. ఆరు వైద్య కే్రందాలను అనుసంధానిస్తూ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం నగరంలో టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న స్విమ్స్, బర్డ్, సెంట్రల్ హాస్పిటల్స్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వ పెత్తనంతో నడుస్తున్న ఎస్వీ వైద్యకళాశాల, రుయా, మెటర్నిటీ హాస్పిటల్స్‌ను ప్రాథమికంగా ఎంపిక చేశారు. మెడికల్ హబ్ ఏర్పాటు కు సంబంధించిన వ్యవహారాలపై రెండు రో జులుగా జిల్లా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి టీటీడీ ఈవో ఎంజీ గోపాల్‌తోపాటు ఆరు వైద్య కేంద్రాల ప్రధాన అధికారులతో చర్చలు జరుపుతున్నారు. దీనిపై అధికారులు పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించారు. ఆస్పత్రులలో ప్రధానంగా రోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, లోపాలను గుర్తించి నివేదిక తయారు చేసేందుకు 12 మందితో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. కమిటీలో టీటీడీ ఈవో, జేఈవోలతో పాటు డీఎంఈ, అడిషనల్ జాయింట్ కలెక్టర్, అర్బన్ ఎస్పీ, మున్సిపల్ కమిషనర్, ఎండోమెంట్ కార్యదర్శి, ఆరు విభాగాలకు చెందిన హెచ్వోడీలు ఉండేవిధంగా నిర్ణయం తీసుకున్నారు. ఏర్పాటు కాబోయే మెడికల్ హబ్‌కు టీటీడీ ఈవో చైర్మన్‌గా వ్యవహరించే విధంగా చర్యలు తీసుకోనున్నారు. శ్రీవెంకటేశ్వర మెడికల్ హబ్.. కొత్తగా ఏర్పడే మెడికల్ హబ్ ఎక్కువగా టీటీడీ ఆధ్వర్యంలో నడవనున్న నేపథ్యంలో ‘శ్రీవేంకటేశ్వర మెడికల్ హబ్’గా పిలిస్తేనే సార్థకత అవుతుందనే ఉద్దేశంతో అధికారులు ఉన్నట్లు సమాచారం. నేడు తిరుపతికి సీఎం చంద్రబాబు రానున్నారు. దీనిని సీఎం ముందు ఉంచి గ్రీన్ సిగ్నల్ పొందాలనే యోచనలో అధికారులు ఉన్నారు. ఏది ఏమైనా తమను ప్రభుత్వం, టీటీడీ ఇబ్బందులకు గురిచేయకుండా నిధులను సకాలంలో అందించాలని ఆరు వైద్య కేంద్రాలకు చెందిన అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో వరుస సమావేశాలలో ఆస్పత్రులకు సంబంధించిన పాత జీవోలను క్షుణ్ణంగా పరిశీలించి వాటిపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ప్రతి 3 నెలలకు వైద్య కేంద్రాలకు అవసరమయ్యే నిధులు ప్రభుత్వం నుంచి రావడం ఆలస్యమైతే వాటిని తొలుత టీటీడీ భరించి ప్రభుత్వ నిధులు వచ్చిన వెంటనే పొందేవిధంగా కమిటీ నిర్ణయించింది. అలాగే పేదరోగుల సహాయార్థం స్విమ్స్ ఆస్పత్రికి అందిస్తున్న విధంగా రుయా, మెటర్నిటీ ఆస్పత్రులకు కూడా టీటీడీ ప్రాణదాన నిధులను అందించేందుకు అంగీకారం తెలపాలని ఎండోమెంట్‌కు నివేదిక పంపాలని కమిటీ నిర్ణయించింది. బర్డ్ డెరైక్టర్ కోసమే.. అని ప్రచారం ప్రస్తుతం బర్డ్ డెరైక్టర్‌గా పనిచేస్తున్న జగదీష్‌కు సీఎం చంద్రబాబుతో సుదీర్ఘ పరిచయం ఉంది. చంద్రబాబు అధికారంలో ఉన్నా లేక పోయినా పార్టీకి సంబంధించిన కేడర్‌కు బర్డ్ ఆస్పత్రిలో వైద్యం అవసరమైతే అందుబాటులో ఉంటూ చంద్రబాబుకు మరింత దగ్గరయ్యారు. దీంతో పదేళ్ల తర్వాత బాబు అధికారంలోకి రావడంతో బర్డ్ డెరైక్టర్ చిరకాల కోరిక తీర్చేందుకే మెడికల్ హబ్ ప్రతిపాదన తెరపైకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన దిశా నిర్దేశకాలు బర్డ్ డెరైక్టర్ ఇచ్చినవే అనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. తాత్కాలిక కమిటీలో కూడా జిల్లా మంత్రి బర్డ్ డెరైక్టర్ ఆలోచన మేరకు నివేదిక సిద్ధం చేయాలని పరోక్షంగా ఆదేశించినట్లు తెలిసింది. ఒక్క బర్డ్ ఆస్పత్రికే డెరైక్టర్‌గా ఇన్నాళ్లు చేశాం.. దీనికంటే పెద్ద పదవి కావాలంటే ఆరు వైద్య కేంద్రాలను కలిపి అందులో డెరైక్టర్‌గా కూర్చోవాలనే ఆలోచనతోనే ఈ కొత్త హబ్ ప్రస్తావన వచ్చినట్లు విమర్శలు ఉన్నాయి. అయితే ఎన్ని హబ్‌లు ఏర్పాటైనా సామాన్యుడికి వైద్యం అందుబాటులోకి తేవాలనే విషయాన్ని పాలకులు విస్మరించకుంటే చాలు. -
చిత్తూరు జేసీగా భరత్‌గుప్తా
కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్,టీటీడీ ఈవో గోపాల్ తెలంగాణకే... జీఏడీకి రిపోర్ట్ చేసుకోవాల్సిందిగా జేసీ శ్రీధర్‌కు ఉత్తర్వులు ఎస్పీలు శ్రీనివాస్,గోపినాథ్ జట్టీలు జిల్లాలోనే జిల్లాకు త్వరలో కొత్త కలెక్టర్ సాక్షి, చిత్తూరు: చిత్తూరు జాయింట్ కలెక్టర్‌గా మదనపల్లె సబ్‌కలెక్టర్ భరత్‌గుప్తాను ప్రభుత్వం నియమించింది. చిత్తూరు జేసీ, ప్రస్తుత ఇన్చార్జి కలెక్టర్ శ్రీధర్‌ను జీఏడీకి రిపోర్ట్ చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం జరిగిన ఐఏఎస్‌ల బదిలీల్లో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. చిత్తూరు జాయింట్ కలెక్టర్‌గా ఈ ఏడాది మార్చి 10న శ్రీధర్ బాధ్యతలు తీసుకున్నారు. ఎన్నికల సమయంలో గట్టిగా పనిచేశారు. రాజం పేట పార్లమెంట్ రిటర్నింగ్ అధికారిగా విధులు నిర్వహించారు. ప్రజలు ఏదైనా సమస్యతో తన వద్దకు వస్తే తక్షణమే స్పందిస్తారనే మంచి పేరు తెచ్చుకున్నారు. నిర్ణయాలు తీసుకోవడంలో కూడా దూకుడుగా వ్యవహరించారు. ముఖ్యంగా ఎర్రచందనం అంతర్జాతీయ స్మగర్లపై దాదాపు రెండు నెలలుగా పీడీయాక్టు నమోదు చేయకుండా కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ తాత్సారం చేశారు. ఈ అంశంలో కలెక్టర్‌పై పలు విమర్శలు, ఆరోపణలు కూడా వచ్చాయి. కలెక్టర్‌ను తెలంగాణకు కేటాయించడం, సింగపూ ర్ పర్యటనకు వెళ్లడంతో ఇన్చార్జి కలెక్టర్‌గా శ్రీధర్ ఈ నెల 24న బాధ్యతలు తీసుకున్నారు. బాధ్యతలు తీసుకున్న వెంట నే ఏడుగురు అంతర్జాతీయ స్మగ్లర్లపై పీడీయాక్టు నమోదు చే సి ‘శభాష్’ అనిపించుకున్నారు. తక్కిన వారిపై పీడీ నమోదు చేసేందుకు ఫైళ్లు సిద్ధం చేయాలని పోలీసులను ఆదేశించారు. సబ్‌కలెక్టర్‌గా సక్సెస్ చిత్తూరు జేసీగా నియమితులైన భరత్‌గుప్తా మదనపల్లె సబ్‌కలెక్టర్‌గా 2013 అక్టోబర్ 27న బాధ్యతలు తీసుకున్నారు. అతిపెద్ద రెవెన్యూ డివిజన్ అయిన మదనపల్లె సబ్‌కలెక్టర్‌గా సక్సెస్ అయ్యారు. ప్రజా సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారని, తన వరకూ వచ్చిన విషయాలకు వీలైనంత వరకూ తక్షణ పరిష్కారం చూపిస్తారని పేరు తెచ్చుకున్నారు. ఒకే స మస్యపై పలుసార్లు తన వద్దకు ప్రజలు వస్తే తీవ్రంగా స్పందించేవారు. జిల్లా పరిస్థితులపై భరత్‌గుప్తాకు పూర్తిగా అవగాహన ఉండటంతో జాయింట్ కలెక్టర్‌గా తన బాధ్యతలు మరింత సులువు కానున్నాయి. తెలంగాణకే కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ తెలంగాణకే వెళ్లనున్నారు. ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీల్లో భాగంగా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్, టీటీడీ ఈవో గోపాల్ తెలంగాణ కేడర్‌కు, జేసీ శ్రీధర్, మదనపల్లె సబ్‌కలెక్టర్ భరత్‌గుప్తా ఆంధ్రాకు కేటాయించబడ్డారు. ఈ నెల 2 వరకూ అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వం స్వీకరించింది. ఈ క్రమంలో ఐఏఎస్, ఐపీఎస్‌ల అభ్యంతరాలను పూర్తిగా తోసిపుచ్చింది. ఇదివరకే జరిగిన బదలాయింపులే ఫైనల్ అని తేల్చి చెప్పింది. దీంతో సిద్ధార్థ్‌జైన్, గోపాల్ తెలంగాణకు వెళ్లడం అనివార్యమైంది. చిత్తూరు, తిరుపతి ఎస్పీలు జిల్లాలోనే కొనసాగనున్నారు. జూలై 12న జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన సిద్ధార్థ్‌జైన్ దూకుడుగా పాలన అందించేందుకు ప్రయత్నించారు. అయితే పూర్తిగా కుప్పంపైనే దృష్టి సారించి విమర్శల పాలయ్యారు. అలాగే అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి మోపి ఇబ్బంది పెట్టారని కూడా అధికార వర్గాలు చెబుతున్నాయి. మదనపల్లెను మరువలేను దేశంలో అతి పెద్ద రెవెన్యూ డివిజన్ కేంద్రమైన మదనపల్లెను జీవితంలో మరువలేను. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ శుభాలే జరిగాయి. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఇక్కడ చాలా మధురానుభూతులు ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడి వాతావరణం, రాజకీయ నాయకులు, ప్రజల సహకారం మరువలేను. జాయింట్ కలెక్టర్‌గా శుక్రవారం బాధ్యతలు చేపడతా. - భరత్ గుప్తా చిత్తూరు చాలామంచి జిల్లా : శ్రీధర్, ఇన్చార్జి కలెక్టర్ చిత్తూరులో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఇది చాలా మంచి జిల్లా. వీలైనంత వరకూ ప్రజలకు ఉపయోగపడేలా పాలన సాగించాననే తృప్తి ఉంది. ఎర్రచందనం అంతర్జాతీయ స్మగ్లర్లు ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్లకూడదనే నిర్ణయంతోనే ఇన్చార్జ్ కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత పీడీయాక్టుపై తక్షణ నిర్ణయం తీసుకున్నా. జిల్లా ప్రజలు, అధికారులు కూడా నాపై మంచి ప్రేమ చూపారు. అందరికీ కృతజ్ఞతలు. -
టీటీడీ చైర్మన్ పీఠంపై స్థానికుడా.. స్థానికేతరుడా?
ఎన్నికలకు ముందే తనకు హామీ ఇచ్చారంటున్న చదలవాడ పార్టీ కోసం పనిచేసిన తనకే టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వాలంటూ ‘గాలి’ పట్టు తనను టీటీడీ చైర్మన్ చేయాలంటున్న రాయపాటి! రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ మంత్రాంగం టీటీడీ పాలక మండలి అధ్యక్ష పదవి స్థానికులకు దక్కుతుందా? స్థానికేతరులు చేజిక్కించుకుంటారా? అన్నది హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వని నేపథ్యంలో టీటీడీ చైర్మన్ పదవి ఇస్తానంటూ రాతపూర్వకంగా చంద్రబాబు తనకు హామీ ఇచ్చారని మాజీ ఎమ్మెల్యే చదలవాడ చెబుతున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన గాలి ముద్దుకృష్ణమనాయుడు పార్టీ కోసం పనిచేసిన తనకే ఆ పదవి దక్కుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆ పదవి ఇస్తానంటేనే టీడీపీలో చేరానని.. తనకే ఇవ్వాలని నరసరావుపేట ఎంపీ రాయపాటి పట్టుబడుతున్నారు. మరోవైపు రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ ఆ పదవి కోసం తెర వెనుక మంత్రాంగం నడుపుతున్నారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి: టీటీడీ సహా అన్ని దేవాలయాల పాలక మండళ్లను రద్దు చేస్తూ శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దాంతో టీటీడీ పాలక మండలి ఖాళీ అయ్యింది. ఇప్పుడు టీటీడీ చైర్మన్ పదవిని చేజిక్కించుకోవడానికి టీడీపీ నేతలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి శాసనసభ టీడీపీ టికెట్ కోసం చదలవాడ కృష్ణమూర్తి, ఎం.వెంకటరమణ పోటీపడ్డారు. ఎమ్మెల్యే టికెట్‌ను వెంకటరమణకు ఇచ్చిన చంద్రబాబు.. టీటీడీ చైర్మన్ పదవిని చదలవాడకు ఇస్తానని రాతపూర్వకంగా హామీ ఇచ్చినట్లు చదలవాడ వర్గీయులు చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు గుంటూరు జిల్లాకు చెం దిన రాయపాటి సాంబశివరావు కాంగ్రెస్‌లో మూడు దశాబ్దాలపాటు పనిచేశారు. ఎన్నికలకు ముందు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్‌లో ఉన్న కాలంలో టీటీడీ చైర్మన్ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నించిన రాయపాటి ఆ పదవిని దక్కించుకోవడం విఫలమయ్యారు. టీడీపీలో చేరే ముందు.. పార్టీ అధికారంలోకివస్తే టీటీడీ చైర్మన్ పదవి ఇస్తానని రాయపాటికి చంద్రబాబు హామీ ఇచ్చినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. నరసరావుపేట లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసిన రాయపాటి విజయం సాధించారు.. నరేంద్రమోడీ మంత్రివర్గంలో టీడీపీ కోటాలో తనకు మంత్రి పదవి దక్కుతుందని భావించారు. కానీ.. మంత్రి పదవి దక్కకపోవడంతో ఆ వెంటనే చంద్రబాబుతో సమావేశమై టీటీడీ బోర్డు చైర్మన్ పదవిని తనకు ఇవ్వాలని పట్టుపట్టారు. ఇప్పుడు టీటీడీ పాలక మండలిని రద్దు చేయడంతో తమకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని రాయపాటి ఓ వైపు.. చదలవాడ మరో వైపు చంద్రబాబుపై తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారు. 2009 నుంచి సార్వత్రిక ఎన్నికల వరకూ చంద్రబాబుకు గాలి ముద్దుకృష్ణమనాయుడు వెన్నుదన్నుగా నిలిచారు. సార్వత్రిక ఎన్నికల్లో నగరి నుంచి పోటీచేసిన గాలి ఓటమి పాలయ్యారు. తాను గెలిచి ఉంటే మంత్రివర్గంలో స్థానం దక్కేదని.. ఓడిపోయిన నేపథ్యంలో తనకు టీటీడీ చైర్మన్ పదవిని ఇవ్వాలని చంద్రబాబుపై గాలి తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వని పక్షంలో ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి.. మంత్రివర్గంలోకి తీసుకోవాలని గాలి కోరుతున్నారు. ఇక చంద్రబాబు సన్నిహితుడుగా ముద్రపడిన రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ టీటీడీ చైర్మన్ పదవిపై మక్కువ పెంచుకున్నారు. ఇటీవల 75వ జన్మదినం సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మురళీమోహన్ తన మనసులోని మాటను బయటపెట్టారు. టీటీడీ బోర్డు చైర్మన్ పదవిని దక్కించుకోవడం కోసం చంద్రబాబుపై మురళీమోహన్ తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ బోర్డు చైర్మన్ పదవి స్థానికులకు దక్కుతుందా? స్థానికేతరులకు దక్కుతుందా అన్నది తేలాలంటే మరి కొంత కాలం వేచిచూడక తప్పదు మరి!